breaking news
Mahindra First Choice Wheels
-
చిన్న పట్టణాల్లోనూ మహీంద్రా ఫస్ట్ చాయిస్
* సర్టిఫైడ్ యూజ్డ్ కార్లకు డిమాండ్ * కంపెనీ సీఈవో నాగేంద్ర పల్లె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల విక్రయంలో ఉన్న మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ (ఎంఎఫ్‌సీడబ్ల్యుఎల్) చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా సంస్థకు 701 ఔట్‌లెట్లున్నాయి. ఇందులో 300 కేంద్రాలు చిన్న పట్టణాల్లో ఏర్పాటయ్యాయని, వీటి సంఖ్యను 2018 కల్లా రెండింతలు చేస్తామని కంపెనీ సీఈవో నాగేంద్ర పల్లె తెలిపారు. తెలంగాణలో కంపెనీ 12వ ఔట్లెట్ ‘పారమౌంట్ ఆటోబే సర్వీసెస్’ను ప్రారంభించిన సందర్భంగా రిటైల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ తరుణ్ నాగర్, జోన్ హెడ్ సురేశ్ కుమార్‌తో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల విక్రయాల్లో మెట్రో నగరాల వృద్ధి రేటు ఒక అంకెకు పరిమితమైతే, చిన్న పట్టణాల్లో రెండంకెలుందన్నారు. సర్టిఫైడ్ కార్లకు డిమాండ్ పెరుగుతున్నందునే 3, 4, 5వ శ్రేణి పట్టణాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలిపారు. మూడున్నరేళ్లకో కారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా యూజ్డ్ కార్ల విక్రయాలు 17 శాతం వృద్ధితో 30 లక్షల యూనిట్లు నమోదవుతాయన్న అంచనాలున్నాయి. పరిశ్రమలో వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం. ఇందులో తొలి స్థానంలో ఉన్న మహీంద్రాకు 24 శాతం వాటా ఉందని నాగేంద్ర వెల్లడించారు. ‘కస్టమర్లు మూడున్నరేళ్లకో కారును మారుస్తున్నారు. పాత కారు సగటు అమ్మకం ధర రూ.3.65 లక్షలుంది. రూ.3.5-7 లక్షల ధరలో లభించే కార్ల విక్రయాలు మూడింట రెండొంతులు కైవసం చేసుకున్నాయి. సర్టిఫైడ్ కార్లకు బ్యాంకులు 85 శాతం రుణమివ్వడం కలిసి వచ్చే అంశం’ అని తెలిపారు. కంపెనీకి గ్రామీణ ప్రాంతాల నుంచి 35 శాతం అమ్మకాలు నమోదవుతున్నాయి. -
తొలిసారైనా పాతకారుకు సై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కారు పాతదైతేనేం.. కొనేందుకు సై అంటున్నారు భారతీయ కస్టమర్లు. 2013-14లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ కార్లు కొత్తవి 25 లక్షల యూనిట్లు అమ్ముడైతే, పాతవి సుమారు 30 లక్షలు చేతులు మారాయి. దీనినిబట్టి పాత కార్లకూ ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆసక్తికర అంశమేమంటే అమ్ముడవుతున్న మొత్తం పాత కార్లలో తొలిసారిగా వాహనాన్ని కొనుగోలు చేసే వారు 65 శాతం ఉంటున్నారు. ఈ రంగంలోకి పెద్దపెద్ద సంస్థలు రావడంతో బ్రాండెడ్ యూజ్డ్ కార్ల షోరూంలవైపు కస్టమర్లు మళ్లుతున్నారు. యువతే పెద్ద కస్టమర్లు.. పాత కార్ల మార్కెట్‌ను నడిపిస్తున్నది యువతే. కొనుగోలుదారుల్లో 75% మంది 30-35 ఏళ్ల వయసువారే. మొత్తం విక్రయాల్లో రూ.3.75-4 లక్షల ఖరీదులో లభించే మోడళ్ల వాటా సగముంది. కొత్తకారు ధరలో అంతకంటే పెద్ద మోడల్ రావడం, నెల వాయిదాల భారమూ తక్కువగా ఉండడంతో కస్టమర్లు పాత వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు బ్రాండెడ్ యూజ్డ్ కార్ల షోరూముల్లో 100కు పైగా నాణ్యత పరీక్షలు జరిపిన తర్వాతే వాహనాలను విక్రయిస్తారు. నాణ్యతకు ఢోకా లేకపోవడంతో తృతీయ శ్రేణి నగరాల్లోని కస్టమర్లు సైతం బ్రాండెడ్ షోరూంలలో కారు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. 30 లక్షల యూనిట్లలో వ్యవస్థీకృత రంగం వాటా 20% వృద్ధితో 17% వాటా కైవసం చేసుకుంది. నగదు కొనుగోళ్లు.. అయిదేళ్ల క్రితం వరకు ఒక్కో కస్టమర్ సరాసరిగా ఆరేళ్లు కారును అట్టిపెట్టుకునే వారు. ఇప్పుడు నాలుగేళ్లకే మారుస్తున్నారు. మూడేళ్ల తర్వాత 36 నెలలకు వస్తుందని అంటోంది మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్. కొత్త మోడళ్లు, కుటుంబం పెరగడం, ఆశయాలు మారడం ఇందుకు కారణమని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకు కొత్త కార్లు 57 వేలు, పాతవి 60 వేల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య వరసగా 15 వేలు, 16,500 ఉంది. నగరాల వారీగా చూస్తే ఢిల్లీలో 22 వేలు, ముంబైలో 10 వేలు, హైదరాబాద్‌లో 9 వేల పాత కార్లు ప్రతి నెల చేతులు మారుతున్నాయి. అమెరికాలో ఏటా 4.5 కోట్ల పాత కార్లు, 1.6 కోట్ల కొత్త కార్లు అమ్ముడవుతున్నాయి. కస్టమర్ల సందేహమే.. పాత కారు పనితీరు ఎలా ఉంటుందో అన్న సందేహం సాధారణంగా అందరికీ ఉంటుంది. ఈ అంశమే బ్రాండెడ్ కంపెనీలకు కలిసి వస్తుందని అంటున్నారు మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ సీఈవో నాగేంద్ర పల్లె. ఇక్కడి కొండాపూర్‌లో అధీకృత డీలర్షిప్ ఎక్స్స్పీడ్ వీల్స్‌ను బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. నాణ్యతా పరీక్షలు, విక్రయానంతర సేవ, వారంటీని బ్రాండెడ్ కంపెనీలు ఇస్తాయి. దీంతో కస్టమర్లు ధీమాగా పాత కార్లను సొంతం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తమ కంపెనీ వెబ్సైట్లో అన్ని మోడళ్ల వివరాలను పొందుపరుస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీకి 380 ఔట్‌లెట్లున్నాయి. రెండేళ్లలో మరో 120 ప్రారంభించనుంది. 2013-14లో కంపెనీ తన షోరూంల ద్వారా 57 వేలు, ఆన్లైన్ బీటూబీ పోర్టల్ ఇడిగ్ ద్వారా 60 వేల యూనిట్లను విక్రయించింది.