breaking news
mahesh baghavath
-
‘కొలువుల కొట్లాట’ను మరోరోజు పెట్టుకోండి
హైదరాబాద్: కొలువుల కొట్లాట సభను ఈ నెల 30న కాకుండా మరోరోజు పెట్టు కోవాలని టీజేఏసీ సభ్యులకు పోలీసులు సూచించారు. టీజేఏసీ ఈ నెల 30న సరూర్‌నగర్ ఎల్బీ స్టేడియంలో కొలువుల కొట్లాట సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో మంగళవారం టీజేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సభకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ వారు అనుమతి ఇచ్చారని, ఎల్బీనగర్ డీసీపీ మాత్రం వర్కింగ్ డే కాకుండా సెలవు రోజున నిర్వహించుకోవాలని సూచించారని వారు సీపీకి తెలిపారు. సీపీ కూడా 30న కాకుం డా మరో రోజున సభను పెట్టుకోవాలని వారికి సూచించారు. సీపీని కలసినవారిలో టీజేఏసీ ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, వెంక ట్‌రెడ్డి, శర్మ, చల్మారెడ్డి తదితరులున్నారు. -
టార్గెట్ మార్నింగ్ అంటున్న పోలీసులు!
సాక్షి, సిటీబ్యూరో: ఉదయం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు... హడావుడిలో పక్కింట్లో ఏం జరుగుతుందో పట్టించుకునే అవకాశం లేదని భావించిన ఓ ఘరానా దొంగ తన చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తిస్తాడు. 10.30 నుంచి 12.30 మధ్య సమయంలో చోరీ చేస్తాడు. కేవలం 15 నిముషాల్లోనే పనిపూర్తి చేసి ఆ ప్రాంతాన్ని వదిలేస్తాడు. ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ ఘరానా దొంగను రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 20 తులాల వెండి, 4 ల్యాప్‌టాప్‌లు, 2 చేతిగడియారాలు, ఒక కెమెరా, రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గచ్చిబౌలి పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. 50 ఇళ్లలో రూ.40 లక్షల సొత్తు చోరీ... సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన అవేజ్ అహ్మద్ ఎంబీఏ చదవి ఈజీ మనీ కోసం దొంగగా మారాడు. ఐఎస్ సదస్సులో ఇండియా సర్వీసెస్ కన్సల్టెన్సీని నిర్వహించి నష్టాలు రావడం, సులువుగా డబ్బులు సంపాదించాలని చోరీల బాటను ఎంచుకున్నాడు. 2008 సంవత్సరం నుంచి చోరీలు మొదలు పెట్టిన అతడు 2009లో పోలీసులకు పట్టుబడి ఆ తర్వాత జైలుకు వెళ్లాడు. దాదాపు నాలుగేళ్లపాటు చోరీల జోలికి వెళ్లలేదు. తిరిగి 2015 సంవత్సరంలో చోరీకి పాల్పడి హుస్సేనీఆలం పోలీసులకు చిక్కాడు. డిసెంబర్లో జైలు నుంచి వచ్చాక వరుసగా 11 నెలల పాటు 50 చోరీలు చేసి పోలీసులకు ముచ్చెమటలు పట్టించి పోలీసులకు చిక్కాడు. అయితే ఈ దొంగను పట్టుకున్న మేడిపల్లి ఇ¯ŒSస్పెక్టర్ జగన్నాథరెడ్డి, డీఎస్ఐ జయరాంతో పాటు పోలీసు సిబ్బందికి కొత్త కరెన్సీలో మహేష్ భగవత్ రివార్డులు అందించారు. ‘ఎగ్జిక్యూటివ్’ అవతారంతో పనికానిచ్చేస్తాడు... అవేజ్ అహ్మద్ తన ఆనవాళ్లు ఎవరికీ కనపడకండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇంట్లో నుంచి బయలుదేరే సమయంలో ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌గా డ్రెస్సు వేసుకుని బయలుదేరుతాడు. అతడికి బాగా తెలిసిన ప్రాంతాలైన ఉప్పల్, కుషాయిగూడ, మల్కాజిగిరి, మేడిపల్లి ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తాడు. ఇంటికి తాళం వేసి ఉంటే ఇంట్లోకి చొరబడతాడు. 15 నిమిషాల్లో పని పూర్తి చేసుకొని బయటపడతాడు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్యలోనే ఈ చోరీలు చేస్తుంటాడు. ఈ సమయంలో చాలా మంది గృహిణులు తమ పిల్లలకు స్కూల్లో టిఫిన్ ఇవ్వడానికి, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లడం, ఆఫీసులకు, బంధువుల ఇళ్లకు వెళ్లడం వంటి పనుల్లో బిజీగా ఉంటారని, త్వరగా ఇంటికి తిరిగి వస్తామని అల్మారాలు, కబోర్డులకు తాళాలు వేసి అక్కడే వదిలేసి వెళ్లడం వంటివి జరుగుతాయని అవేజ్ పసిగట్టాడు. దీంతో ఆ సమయాన్ని లక్కీ టైంగా ఎంచుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. -
అందుబాటులో ఉంటా: సీపీ మహేష్ భగవత్
నాగోలు: ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా వేధిస్తే సైబరాబాద్ వాట్సప్ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సైబరాబాద్ ఈస్ట్‌జోన్ కమిషనర్ మహేష్ భగవత్ విజ్ఞప్తి చేశారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లోని క్యాంపు కార్యాలయంలో సీపీ మంగళవారం ప్రజలతో మమేకమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. సైబరాబాద్ పరిధిలో మహిళల రక్షణ కోసం షి–టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. నయీమ్‌కు సంబంధించిన కేసును సిట్ దర్యాప్తు చేస్తుందని, బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే సిట్‌కు బదిలీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి మంగళవారం ఎల్బీనగర్లో అందుబాటులో ఉంటానని, ప్రతి శుక్రవారం నేరేడ్మెట్ డీసీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానన్నారు. బాధితులు తమ ఫిర్యాదులను 9490617111 నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చని కోరారు.