breaking news
Mahalingam
-
ఐటీకి కష్టకాలం!!
బెంగళూరు: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గతంలో ఎన్నడూ చూడనంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని ఐటీ రంగ నిపుణుడు ఎస్ మహాలింగం వ్యాఖ్యానించారు. ఆసియా సంక్షోభం, వై2కే, 2008 ఆర్థిక మాంద్యం లాంటి వాటిని కూడా దేశీ ఐటీ కంపెనీలు గట్టెక్కాయని .. కానీ ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి వీటన్నింటి కన్నా భిన్నంగా ఉందని ఆయన చెప్పారు. ‘నేను 1970లో ఐటీ రంగంలో అడుగుపెట్టాను. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందని. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల పునరుద్ధరణకు చాలా సమయం పట్టేస్తుంది. వలస నిబంధనలు మొదలుకుని చాలా అంశాలు పెను మార్పులకు లోనవుతాయి‘ అని మహాలింగం వివరించారు. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో మహాలింగం గతంలో సీఎఫ్ఓగా, ఈడీగా వ్యవహరించారు. విశ్వసనీయతకు మారు పేరు.. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే భారత కంపెనీలు విశ్వసనీయ భాగస్వాములని ఈ సంక్షోభంతో నిరూపితమైందని మహాలింగం చెప్పారు. లాక్డౌన్ వేళ కూడా సర్వీసుల డెలివరీలో సమస్యలు తలెత్తకుండా దేశీ ఐటీ కంపెనీలు వినూత్నమైన పరిష్కార మార్గాలు అమలు చేస్తున్నాయని ఆయన కితాబిచ్చారు. లాక్డౌన్ ఎత్తివేశాక.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ కార్యకలాపాల నిర్వహణ తీరును పునఃసమీక్షించుకోగలవని.. తద్వారా ఐటీ సంస్థలకు పుష్కలమైన వ్యాపార అవకాశాలు లభించగలవని మహాలింగం తెలిపారు. నిర్మాణ, తయారీ రంగ కంపెనీల్లో ఐటీ మరింత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సిలికాన్ వేలీలో కోతలు.. అమెరికాలో ఐటీ కంపెనీలకు కేంద్రమైన సిలికాన్ వేలీలో స్టార్టప్ సంస్థలు.. ఉద్యోగాలు, జీతాల్లో కోతలకు సిద్ధమవుతున్నాయి. పెద్ద ఐటీ కంపెనీలు.. కొత్త నియామకాలను కొంత కాలం నిలిపివేసే యోచనలో ఉన్నాయి. ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు, వ్యాపారవేత్త ఎం రంగస్వామి ఈ విషయాలు తెలిపారు. సిలికాన్ వేలీలో వచ్చే నెల రోజుల్లో నిరుద్యోగిత భారీగా పెరిగే అవకాశం ఉందని, 2008 నాటి మాంద్యం సమయంలో కూడా చూడనంత స్థాయిలో ఉండొచ్చన్నారు. -
అవగాహన లేకే బాండ్లకు దూరం
♦ ఆన్లైన్లోనూ లభ్యమైతే బాగుంటుంది ♦ సెబీ సభ్యుడు మహాలింగం వ్యాఖ్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాండ్లలో పెట్టుబడి విషయంలో దేశంలో మదుపరులకు అవగాహన చాలా తక్కువని సెబీ శాశ్వత సభ్యుడు జి.మహాలింగం వ్యాఖ్యానించారు. అసోచామ్ ఆధ్వర్యంలో బుధవారమిక్కడ జరిగిన సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్ బాండ్లకు భద్రత తక్కువనే భావన ప్రజల్లో ఉందన్నారు. ‘‘అది నిజం కాకపోయినా... ఆ విషయంలో సరైన అవగాహన లేకే ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్లవైపు మొగ్గు చూపుతున్నారు’’ అని ఆయన చెప్పారు. బాండ్ల కొనుగోలు మరింత సులభం కావాలని, ఆన్లైన్లో కూడా కొనుగోలు చేసుకునే అవకాశం ఉండాలని తెలిపారు. ఈక్విటీలను హై రిస్క్ అసెట్లుగా ఆయన అభివర్ణించారు. రిస్క్ ఉన్నప్పటికీ అధిక రాబడులుంటాయన్న ఆశతోనే రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారని గుర్తు చేశారు. బాండ్లు దీర్ఘకాలిక ఆర్థిక సాధనమని చెప్పారాయన. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే బాండ్లపై రాబడి సగటున 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) అధికమని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ మనోజ్ కుమార్ జైన్ చెప్పారు. కాగా బాండ్లకు రేటింగ్ ఇచ్చే విధానం మరింత సరళీకృతం కావాలని క్రిసిల్ రిసర్చ్ అసోసియేట్ డైరెక్టర్ భూషన్ కేదర్ చెప్పారు. ప్రస్తుతం ట్యాక్స్ ఫ్రీ బాండ్లకే ఆదరణ ఉంటోందని చెప్పారాయన. మొత్తం బాండ్ల మార్కెట్లో కార్పొరేట్ బాండ్ల వాటా 24 శాతం కాగా మిగిలిన 76 శాతం ప్రభుత్వ సెక్యూరిటీలదేనని శ్రేయి ఇన్ఫ్రా ఫైనాన్స్ ఎస్వీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. కార్పొరేట్ బాండ్ల విపణి జీడీపీలో 14 శాతం (రూ.19 లక్షల కోట్లు) ఉందని తెలియజేశారు.