breaking news
maha ratham
-
అశ్వవాహనంపై ఆనంద నిలయుడు
తిరుమల: తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు సోమవారం శ్రీవేంకటేశ్వరుడు మహారథం (తేరు)పై భక్తులను అనుగ్రహించాడు. గుర్రాలు వంటి ఇంద్రియాలు మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామివారు ఈ రథోత్సవం ద్వారా భక్తులకు సందేశమిచ్చారు.చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గోవిందా.. గోవిందా.. అంటూ మహారథం మోకు (తాడు)ను లాగుతూ భక్తి తన్మయత్వం చెందారు. వాహన సేవ తర్వాత సుమారు గంట పాటు పండితులు నిర్వహించిన వేదగోష్టితో తిరుమల సప్తగిరులు పులకించాయి. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి రథం లాగారు.రాత్రి చల్లటి గాలుల మధ్య మలయప్ప స్వామి అశ్వవాహనంపై భక్తులను పరవశింపజేశారు. బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాలు, విశేష పుష్పాలంకరణానంతరం స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మరథం, గజ, అశ్వ, తురగ, చతురంగ బలాలు ముందుకు సాగగా జానపద కళాకారులు, భజన బృందాలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. నేడు చక్రస్నానం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఇది ముగిశాక శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి లేపుతారు. ఈ కార్యక్రమం తెల్లవారుజాము 3 నుంచి ప్రారంభమై 9 గంటలకు ముగుస్తుంది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
శంభో శివ శంభో
– రమణీయం రామలింగేశ్వరుడి మహారథోత్సవం – భక్తులతో కిటకిటలాడిన రాంపురం క్షేత్రం – రథోత్సవంలో ప్రముఖులు మంత్రాలయం/రూరల్ : భక్తజనుల హర్షధ్వానాలు .. మంగళవాయిద్యాల సుస్వరాలు.. శంభో శివ శంభో అంటూ భక్తులు పఠిస్తుండగా రామలింగేశ్వరుడు రాతిగాళ్ల మహారథంపై కొలువు దీరారు. అశేషభక్తజనుల మధ్య ఉత్సవమూర్తి ఎంతో వైభవంగా మహారథంపై ఊరేగారు. మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో శ్రీరామలింగేశ్వరస్వామి జాతర రమణీయంగా సాగింది. ఆలయ ధర్మకర్తలు వై.సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి నేతృత్వంలో స్వామివారి రథయాత్రను కనుల పండువగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తి రామలింగేశ్వరుడికి గ్రామోత్సవం జరిపారు. ధర్మకర్తల ఇంటి వరకు వైభవంగా ఉత్సమూర్తిని ఊరేగించారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు ఇచ్చి పల్లకీలో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం అర్చకులు వేదపఠనం చేస్తుండగా.. ఉత్సవమూర్తులను మహారథంపై కొలువుంచి యాత్రకు అంకురార్పణ పలికారు. శివనామస్మరణ పఠిస్తూ భక్తులు రథం గొలుసులను లాగసాగారు. ఆలయం నుంచి 100 మీటర్ల మేర రథాన్ని లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. వేలాదిగా భక్తులు కర్ణాటక, ఆంధ్రప్రాంతాల నుంచి తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. తుంగాతీరమంతా భక్తులజనులతో కనువిందు చేసింది. రాంపురం క్షేత్రదారులు తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసాయి. చెక్కభజనలు, ఊయల ఆటలు భక్తులను ఆకట్టుకున్నాయి. హాజరైన ప్రముఖులు : జాతరను తిలకించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు రాంపురం వచ్చారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఎంపీ బుట్టారేణుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే వెంకటరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, పత్తికొండ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి, నంద్యాల ఇన్చార్జి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, గుంతకల్లు సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్గౌరవ అధ్యక్షుడు వై.సీతారామిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు ప్రదీప్‌రెడ్డి, యూత్ కమిటీ నాయకులు ధరణీధర్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి పురుషోత్తం, మండల అధ్యక్షుడు భీమిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కోసిగి ఇన్చార్జి మురళీరెడ్డి, సర్పంచులు విజయమ్మ, భీమయ్య, సుకూర్సాబ్, నాయకులు బెట్టనగౌడ్, అత్రితనయగౌడ్, సీఐలు నాగేశ్వరరావు, కంబగిరి నాయుడు, ఎస్ఐ శ్రీనివాసనాయక్, రాజారెడ్డి, భానుమూర్తి పాల్గొన్నారు.