breaking news
maa abbai
-
నా జీవితమే ఓ పెద్ద సినిమా!
– బలగ ప్రకాశరావు ‘‘ఓ సినిమాలో ఎన్ని మలుపులుంటాయో, నా జీవితంలో అన్ని మలుపులున్నాయి. ప్రతి మలుపునూ ధైర్యంగా ఎదుర్కొని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశా. విజయం సాధించా! నా జీవితానికి నేనే హీరో. ఈ ప్రయాణంలో నాకెందరో స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడు నేను కొందరికి స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది. నేనొక్కడినే వృద్ధిలోకి వస్తే చాలనుకోవడం లేదు. నా విజయం మరికొందరికి ఉపయోగపడాలనుకుంటున్నాను. సినీ నిర్మాణంతో పాటు సేవా కార్యక్రమాలకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను’’ అన్నారు నిర్మాత బలగ ప్రకాశరావు. శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా కుమార్ వట్టి దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ‘బేబీ’ సాక్షి సమర్పణలో బలగ ప్రకాశరావు నిర్మించిన ‘మా అబ్బాయి’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బలగ ప్రకాశ రావుతో జరిపిన ఇంటర్వ్యూ... హాయ్ అండీ! చిన్న వయసులోనే నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. మీ నేపథ్యం ఏంటి? మాది శ్రీకాకుళం జిల్లా, నందిగాం మండలంలోని బడగాం గ్రామం. నేను సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. స్వశక్తితో పనిచేస్తూ, కష్టపడి ఉన్నత స్థాయికి వచ్చాను. నా కుటుంబమే నా ఆస్తి... నా ఆత్మ విశ్వాసమే నా సంపద... నా క్రమశిక్షణే నా పెట్టుబడి. నిర్మాతగా ‘మా అబ్బాయి’ మీకు తొలి సినిమా. చిత్ర నిర్మాణం మీకు ఎలా అనిపించింది? సినిమా రంగంతో ఇంతకు ముందు నాకసలు పరిచయమే లేదు. మా ప్రాంతంలో ‘సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. అదొక భిన్నమైన వాతావరణం. తెరపై నటించేవారి కన్నా తెరవెనుక నటించేవారే ఎక్కువ’ అని ప్రచారంలో ఉండేది. కానీ, అదంతా నిజం కాదని ఈ సినిమా నిర్మాణంలో అర్థమవుతూ వచ్చింది. చిత్ర పరిశ్రమ ఓ ఉమ్మడి కుటుంబం వంటిది. ఇక్కడ మా పల్లెల్ని మించిన ప్రోత్సాహం, ఆదరణ, సహకారం చూసి ఎంతో ఆనందపడ్డా. నిర్మాతగా మీకు అనుభవం లేదు కదా.. ఎవరెవరు హెల్ప్ చేశారు? మొదట్లో నేను ‘ఈ ఒక్క సినిమా పూర్తి చేయగలిగితే చాలు’ అనుకున్నా. ఇప్పుడు మాత్రం నా ఆలోచన మరోలా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సాహం చూసిన తర్వాత 100 సినిమాలు చెయ్యాలనేంత ఉత్సాహం వచ్చింది. నిర్మాతగా ఈ ప్రయాణంలో కొందరు పెద్దల్ని కలసిన తర్వాత క్రమశిక్షణ గురించి తెలుసుకున్నా. నిర్ణీత సమయంలో సినిమా పూర్తి చేయాలని అర్థమైంది. మా సినిమాకి చేసిన లైట్ బాయ్ నుంచి దర్శకుడి వరకు అందరూ ప్రతిభావంతులే. వీరి సహకారం మరువలేను. ప్రత్యేకించి వారాహి చలన చిత్రం సాయి కొర్రపాటిగారు పెద్దన్నలా ఆదరించారు. సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేశ్‌బాబుగారు మార్గదర్శిగా నిలిచి, స్ఫూర్తినిచ్చారు. సురక్ష ఎంటర్టైన్మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ గారు అండగా నిలిచారు. వీరందరి సహకారం నాకెంతో ఆత్మసై్థర్యాన్నిచ్చింది. హీరో శ్రీవిష్ణుకు మంచి పేరున్నా... దర్శకుడు కుమార్ వట్టి, సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, హీరోయిన్ చిత్ర శుక్ల... అందరూ కొత్తవారే. అంతా కొత్తవాళ్లతో సినిమా రిస్క్ అనిపించలేదా? లేదండీ. కథపై నమ్మకంతో ముందుకెళ్లాం. ఇలాంటి కథను పెద్ద టీమ్‌తో చేయాలి. టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ డేట్స్ దొరకడం, నిర్ణీత కాలంలో పూర్తి చేయడం కొంచెం రిస్క్. దానితో పోలిస్తే... కొత్తవాళ్లతో రిస్క్ అనిపించలేదు. ఈ సినిమాతో శ్రీవిష్ణుకు మరింత గుర్తింపు వస్తుంది. ఈ చిత్రానికి పనిచేసిన కొత్తవాళ్లకు ప్రేక్షకుల్లో, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వస్తుందని నా నమ్మకం. విడుదల తర్వాత టీమ్ అందరూ ‘మా అబ్బాయి’కి పని చేశామని గర్వంగా చెప్పుకుంటారు. ఈ సినిమా పేరు చెప్పుకుని ముందుకు వెళతారు. నాకూ పరిశ్రమలో ఈ సినిమా చిరునామా ఇస్తుందనే నమ్మకం ఉంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం వల్ల మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఆడియో మంచి హిట్టయింది. ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అంచనాలకు తగ్గట్టుగా ‘మా అబ్బాయి’ మంచి హిట్ అందుకుంటాడు. అందులో ఎటువంటి అనుమానాలు లేవు. సరిగ్గా 10వ తరగతి పరీక్షల టైమ్‌లో సినిమా విడుదల చేస్తున్నారు. అవగాహన లోపమా? వసూళ్లు తగ్గుతాయేమో కదా? నాకు అవగాహన లేకపోతే ‘మా అబ్బాయి’ విడుదల వరకూ వచ్చేది కాదు. సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోతే... ప్రేక్షకుల్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత ఆసక్తి నెలకొనేది కాదు. ఎగ్జామ్స్ టెన్త్ స్టూడెంట్స్‌కి మాత్రమే కాదు, మా సినిమా యూనిట్ సభ్యులకు కూడా. ఈ సినిమాపైనే మా అందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. సినిమాపై మాకెంతో నమ్మకముంది. ఆలస్యంగా విడుదల చేయడం ఇష్టంలేక ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. టెన్త్ ఎగ్జామ్స్ ప్రభావం మా సినిమాపై ఉండదు. ఇంటర్, డిగ్రీ పరీక్షలు పూర్తి కావొస్తున్నాయి. మా సినిమా స్టూడెంట్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం మాకుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. వసూళ్లు, విజయంపై మాకెలాంటి అనుమానాలు లేవు. అసలు సినిమా కథేంటో చెప్పలేదు..? తన కుటుంబానికి ఎదురైన సమస్యను ఓ కుర్రాడు ఎలా పరిష్కరించాడనేది కథ. లవ్, రొమాన్స్, కామెడీ, మంచి పాటలు, ఫైట్స్... కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయి. నెక్ట్స్ ఏంటి? అనే ట్విస్టులతో ముందుకు వెళ్తుంది. అలాగే, చిన్న సందేశం కూడా ఉంటుంది. నిర్మాతగా మీ తదుపరి ప్రణాళిక ఏంటి? ఓ నెల ముందు అడిగితే నా దగ్గర సమాధానం ఉండేది కాదేమో! ఇప్పుడు మాత్రం కచ్చితంగా సినీ రంగంలోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చాను. ప్రేక్షకుల్లో సామాజిక చైతన్యం కల్పించే మరిన్ని మంచి చిత్రాలు తీయాలనుంది. ఈ క్రమంలోనే కొన్ని కథలు అనుకుంటున్నాం. ఈ అందమైన రంగుల ప్రపంచంలో ఆనందాల హరివిల్లు విరబూయించాలనేది ప్రస్తుత ప్రణాళిక. శ్రీకాకుళం జిల్లా మారుమూల పల్లె నుంచి వచ్చిన మీరు సినిమా నిర్మించే స్థాయికి ఎలా చేరుకున్నారు? మీకు కలిసొచ్చిన అంశాలేంటి? ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం నన్ను ధైర్యంగా ముందుకు వెళ్లేలా చేశాయి. భగవంతుని దయ, స్నేహితుల సహకారం నన్ను విజయానికి చేరువ చేశాయి. మనిషిని మనిషే నమ్మకపోతే ఎలా? సానుకూల దృక్పథంతో ఎదుటివ్యక్తిని నమ్మడం విజయానికి మొదటి మెట్టు. ఎవరో ఒకరిద్దరు మన అంచనాలకి తగ్గట్టు లేరని, మనం ఆశించినట్టు లేరని ప్రపంచాన్ని నిందించడం సరికాదు. ప్రపంచం మనల్ని నమ్మకపోతే... మనకీ స్వేచ్ఛ ఎక్కడిది? అలాగే మనమూ ఎదుటివారిపై విశ్వాసం ఉంచాలి. విజయానికి రెండో మెట్టు.. నిర్ణయాధికారం. మనల్ని ఎవరు వ్యతిరేకించినా.. ప్రపంచం మొత్తం కాదన్నా... మనం తీసుకున్న నిర్ణయం మీద స్పష్టత ఉంటే ధైర్యంగా ముందడుగు వేయాలి. ఈ రెండిటితో పాటు నా బలం నా స్నేహితులే. నేను కష్టంలో ఉన్నానని తెలిస్తే నా చుట్టూ రక్షణగా నిలబడతారు. నేను వేసే ప్రతి అడుగునూ ప్రోత్సహిస్తారు. మా అబ్బాయి సూపర్‌హిట్ కావడం గ్యారంటీ విడుదలకు ముందు ఇంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.. దీనికి కారణం? నేను నమ్మేది సమయాన్నే. ప్రపంచంలో దేశాలను బట్టి కరెన్సీ.. ప్రాంతాలను బట్టి భాషలు... కాలాన్ని బట్టి వాతావరణం మారుతుంటాయి. పేద–ధనిక, చిన్న–పెద్ద, ఆడ–మగ.. ఇటువంటి తేడాలు లేకుండా విశ్వమంతా సమానమైంది కాలం మాత్రమే. నేను దాన్ని నమ్ముతాను. టైమ్‌ను నమ్ముకున్నోళ్లు, సద్వినియోగం చేసుకున్నోళ్లు తప్పకుండా విజయం సాధిస్తారు. ‘మా అబ్బాయి’ సూపర్‌హిట్ కావడం గ్యారంటీ! మీ జీవిత లక్ష్యం ఏంటి? నాకంటూ కొన్ని ఆలోచనలున్నాయి. చెబితే అతిశయోక్తిగా ఉంటుందేమో! కానీ, కచ్చితంగా చేసి తీరుతాను. జీవితంలో ఎప్పుడైనా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తినిచ్చే కార్యక్రమం ఒక్కటైనా చేసుండాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పెరిగిన ఊరు, చిన్ననాటి స్నేహం, నా ప్రాంతం అంతా శెహభాష్ అనేలా మా ప్రాంతానికి పనికొచ్చే పని ఏదైనా చెయ్యాలి. అది కూడా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఏ పనైనా ప్రారంభించడం గొప్పకాదు... మనం ఉన్నా, లేకపోయినా మనం ప్రారంభించిన కార్యక్రమం ఆగకూడదు. నా దృక్పథం అదే. నిర్దిష్టమైన ప్రణాళికతో కొంచెం టైమ్ తీసుకుని నేను చేయాలనుకున్న పనిని ప్రారంభిస్తా. వ్యాపారం నచ్చకపోతే ఆపేయొచ్చు.. కానీ, సహకారం అలా కాకూడదు. పలువురి జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. అందుకే, నాకు శాశ్వత సేవా కార్యక్రమం నిర్వహించే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నా. -
నన్ను మా అబ్బాయి అంటారు
‘‘మాస్ హీరోగా పేరొస్తే... మళ్లీ డిఫరెంట్ సినిమాలు చేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. నాకు అన్ని రకాల సినిమాలూ చేయాలనుంది. నాకు పేరు రావడం కంటే... నేను చేసిన పాత్రలకు మంచి పేరొస్తే చాలనుకుంటున్నా’’ అన్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా కుమార్ వట్టి దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్‌రావు నిర్మించిన ‘మా అబ్బాయి’ ఈ నెల 17న విడుదలవుతోంది. శ్రీవిష్ణు చెప్పిన సంగతులు... ♦ ఓ రెండు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన తెలుగు రాష్ట్రాలను వణికించింది. ఆ వాస్తవ ఘటన ఆధారంగా ‘మా అబ్బాయి’ తెరకెక్కింది. ఓ కామన్ కుర్రాడు తన కుటుంబ సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడనేది కథ. ♦ కొత్త కథతో తెరకెక్కిన చిత్రమని చెప్పను. కానీ, ఆరు పాటలు, ఫైట్స్‌తో తీసే కమర్షియల్ ఫార్ములా సినిమాల్లో ఇప్పటి వరకూ ఇలాంటి స్క్రీన్‌ప్లే రాలేదు. ‘మా అబ్బాయి’ కథనం చాలా కొత్తగా ఉంటుంది. ఫైట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కథలో భాగంగానే ఉంటాయి. ∙ఈ చిత్రంలో కాన్ఫిడెంట్‌గా ఉండే అబ్బాయి పాత్రలో కనిపిస్తా. ఏ విషయాన్నయినా ఓపెన్‌గా మాట్లాడతా. బాడీ లాంగ్వేజ్‌తో కాకుండా కళ్లతోనే ఎక్కువ నటించా. ఇందులో విశాఖ యాస ప్రయత్నించా. ♦ బలగ ప్రకాశ్‌రావు వంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. నా కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రమిది. అంత బడ్జెట్లో తీస్తేనే కరెక్ట్. కానీ, సినిమా ప్రారంభించే టైమ్‌కి నాకంత మార్కెట్ లేదు. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమా తీయడానికి సిద్ధమైతే... నేను కొంచెం జంకాను. ఇబ్బందిగా అనిపించింది. కానీ, కథపై నమ్మకంతో ముందడుగు వేశాం. ♦ నా పేరు ఎక్కువమంది ప్రేక్షకులకు తెలియదు. కొందరికి మాత్రమే తెలుసు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చేసినప్పుడు ‘రాయల్ రాజు’... ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చూసి ‘రైల్వే రాజు’ అన్నారు. ఇప్పుడీ ‘మా అబ్బాయి’ చూసిన తర్వాత ప్రేక్షకులు ‘మా అబ్బాయి’ అనే అంటారనుకుంటున్నా. ♦ ఏ కథనైనా ఓ ప్రేక్షకుడిగానే వింటా. యువతకు ఉన్న సమస్యల్లో 80 శాతం కామన్‌గానే ఉంటాయి. కథలో పాయింట్ వాళ్లకు కనెక్ట్ అయ్యేలా ఉంటే అంగీకరించేస్తా. ప్రస్తుతం ‘మెంటల్ మదిలో’, ‘నీది నాది ఒకే కథ’ సినిమాలు చేస్తున్నా. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ తర్వాత ప్రేక్షకుల్లో, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. -
ఒక్క హిట్.. ఫుల్ కిక్ ఇచ్చింది
ప్రేమ ఇష్క్ కాదల్, ప్రతినిథి, సన్నాఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్చయమ్మురా లాంటి చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించిన యువ నటుడు శ్రీ విష్ణు. మంచి పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాలో నారా రోహిత్ కూడా మరో కీలక పాత్రలో నటించినప్పటికీ.., శ్రీ విష్ణు చుట్టే కథ నడవటంతో పాటు విష్ణు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయటంతో సక్సెస్‌తో పాటు వరుస అవకాశలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే మా అబ్బాయి సినిమాను పూర్తి చేసిన శ్రీ విష్ణు.. మరో ఇంట్రస్టింగ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. పెళ్లి చూపులు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మెంటల్ మదిలో షూటింగ్లో పాల్గొంటున్నాడు. వీటితో పాటు నీది నాది ఒకే కథ అనే సినిమాను త్వరలో ప్రారంభించనున్నాడు. కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న శ్రీ విష్ణు, మరిన్ని విజయాలతో దూసుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
ధైర్యంగా సినిమా తీసినందుకు అభినందనలు – రోజా
‘‘ఓ మంచి కథను నమ్మి, ధైర్యంగా సినిమా తీసిన ప్రకాశ్రావుగారికి అభినందనలు. డైరెక్టర్ టేకింగ్ గొప్పగా ఉంది. శ్రీ విష్ణు చక్కగా నటించడంతో పాటు డ్యాన్సులు బాగా చేశాడు. ఈ సినిమా విజయవంతమై, ఇదే యూనిట్ మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’’ అని రోజా అన్నారు. శ్రీ విష్ణు, చిత్రా శుక్లా జంటగా కుమార్ వట్టి దర్శకత్వంలో బేబి సాక్షి సమర్పణలో బలగం ప్రకాశ్‌రావు నిర్మిస్తోన్న చిత్రం ‘మా అబ్బాయి’. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా పాటల సీడీలను హీరోలు నారా రోహిత్, నాగశౌర్య విడుదల చేశారు. రోజా, నిర్మాత మల్కాపురం శివకుమార్, దర్శకుడు విరించి వర్మ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘‘శ్రీకాకుళంలో పుట్టిన నేను ఈ రోజు సినిమా నిర్మించడం ద్వారా ఏదో సాధించానని అనుకుంటున్నా. దర్శకుడు కథ చెప్పగానే సినిమా చేయగలుగుతాడా? అనిపించింది. కానీ, వట్టి కుమార్ కాదు.. తాను గట్టి కుమార్ అని నిరూపించుకున్నాడు’’ అని నిర్మాత అన్నారు. ‘‘మార్తాండ్ కె.వెంకటేశ్‌గారి వద్ద ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నా. ‘మా అబ్బాయి’ పాత్రకు వేరే ఎవరూ సరిపోరనేలా శ్రీవిష్ణు నటించాడు’’ అన్నారు దర్శకుడు. శ్రీవిష్ణు, మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నిర్మాత సాయి కొర్రపాటి, ఐజీ ఎ.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
'మా అబ్బాయి' మూవీ స్టిల్స్