breaking news
M.. Mutyalanayudu
-
అది జేఏసీ సభా..కాంగ్రెస్ వేదికా?
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర కోసం ఉధృతంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరు కార్చడానికి మంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు, విశాఖ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ విమర్శించారు. ఈ నెల 21న నాన్‌పొలిటికల్ జేఏసీ విశాఖలో నిర్వహిస్తున్న లక్ష గళార్చన జేఏసీ సభా? లేక కాంగ్రెస్ సభా? అనేది చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఆ సభకు సమైక్యవాదులెవరూ హాజరు కావద్దని వంశీకృష్ణ కోరారు. పార్టీ కార్యాలయంలో సోమవారం వారు భీమిలి సమన్వయకర్త కోరాడ రాజబాబు, పార్టీ నాయకులు పక్కి దివాకర్, నౌషాద్, కాళిదాసురెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ పార్టీ అయితే రాష్ట్ర విభజనకు కారణమైందో ఆ పార్టీకి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావును పక్కన పెట్టుకుని, సమైక్య సభకు సీఎంను కూడా ఆహ్వానిస్తామని చెప్పడం ఉద్యమానికి ద్రోహం చేసినట్లేనని వారు విమర్శించారు. మంత్రులు వారి రాజకీయ మనుగడ కోసం జనాన్ని ఈ రూపంలో కూడా మోసం చేస్తున్నారన్నారు. నాన్‌పొలిటికల్ జేఏసీ కన్వీనర్ బాలమోహనదాస్ సమైక్య సభ ఏర్పాట్ల సభకు తమను కూడా పిలిచి ఇది రాజకీయేతర సభ అని చెప్పారని వంశీకృష్ణ తెలిపారు. తీరా ఆయన తీరు చూస్తే కాంగ్రెస్ ఏజెంట్‌గా మారినట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. తమను తప్పుదోవ పట్టించిన బాలమోహన్‌దాస్ నాన్ పొలిటికల్ అనే పేరు తీసి దాని స్థానంలో కాంగ్రెస్ జేఏసీ అని పెట్టుకోవాలన్నారు. మంత్రి గంటాతో ఆయన కుమ్మక్కయ్యారనీ, అందువల్ల 21వ తేదీ జరిగే సభకు సమైక్యవాదులెవరూ వెళ్లవద్దని ఆయన కోరారు. -
సమైక్య గర్జన!
సమైక్య నినాదాలతో జిల్లా హోరెత్తిపోయింది. ఉద్యమ స్ఫూర్తిని నింపింది. రహదారులు జన సంద్రమయ్యాయి. దీక్ష శిబిరాలు సమైక్య గర్జన చేశాయి. నర్సీపట్నంలో సోమవారం నిరసనలు మిన్నంటాయి. వేలాది మందితో నిర్వహించిన జన గర్జన విజయవంతమైంది. వంగపండు తన ఆటపాటలతోఆకట్టుకున్నారు. అరకులోయలో మూడు రాష్ట్రాలుగా విభజించాలన్న కిశోర్‌చంద్రదేవ్ లేఖ ప్రతులను ఏపీఎన్జీవో సభ్యులు దగ్ధం చేశారు. ఏయూ ఎంప్లాయీస్ యూనియన్, విశ్వవిద్యాలయ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో500మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం జరిగిన సమైక్య గర్జన సభ ఆంధ్రులంతా ఎప్పటికీ సమైక్యంగా ఉండాలంటూ చాటి చెప్పింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలు, మనోభావాలను పక్కన పెట్టి, సమష్టి ప్రయోజనాలను పరిగణనలోనికి తీసుకుని విభజన చేయాలని గతంలో ఇందిరాగాంధీ చెప్పారన్నారు. ఆమె ఆశయాలకు విరుద్ధంగా కేవలం రాజకీయ లబ్ధిని దృష్టిలో ఉంచుకుని విభజనకు నేడు యుపీఏ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. విభజన జరిగితే ప్రధానంగా వ్యవసాయరంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి పరిశీలిస్తే తెలంగాణలో సాగయ్యే భూముల విస్తీర్ణం 110 శాతం పెరగ్గా, రాయలసీమలో 55, కోస్తాలో 30కి పరిమితమయ్యాయన్నారు. ఇలాంటి అభివృద్ధిని ప్రభుత్వాలు ప్రాతిపదికగా తీసుకోవా? అంటూ ప్రశ్నించారు. కొత్త రాజధాని ఏర్పాటు చేయాలంటే రూ. 5 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, దాని నిర్మాణం పూర్తి చేయాలంటే వంద సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ కార్యక్రమ నిర్వాహక ప్రతినిధి గోపీనాథ్ మాట్లాడుతూ విభజనపై అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిషత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.