breaking news
M Kishan Reddy
-
'మూడు అక్షరాల పదవిని అమ్ముకున్నాడు'
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం ప్రజల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని తాకట్టుపెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని డాగ్‌బంగ్లాలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజల ప్రతినిధిగా చెప్పకునే ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నేడు ప్రజలు తలదించుకునేలా వ్యవహరించారని, నడిబజారులో ఎమ్మెల్యే అను మూడు అక్షరాల పదవిని అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి నేడు ఈ ప్రాంత అభివృధ్ది పేరుతో అధికార దాహంతో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విధంగానే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని . కిషన్‌రెడ్డిని మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గత ఎన్నికలల్లో రెండు సార్లు ఏ విధంగా గెలిచారో ప్రజలకు తెలుసునని ఆయన గుర్తు చేశారు. గత ఎన్నికల్లో నైతిక విజయం ఎవరిదో ప్రజలకు తెలుసునని, స్వతంత్ర అభ్యర్థికి ఎమ్మెల్యే, ఎంపీకి కలిసి దాదాపు 70 వేల ఓట్లు నియోజకవర్గంలో వచ్చాయంటే నీది గెలుపేనా..? నీవు చరిష్మ ఉన్న నాయకుడివా..? అంటు విమర్శలు చేశారు. నీవు చరిష్మగల నాయకుడివి అయితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాకోర్టుకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. టీడీపీలో ఉన్నప్పుడు జెడ్పీ ఎన్నికలు వస్తే కిషన్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌కు మద్దతుగా మూడు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నమాటా వాస్తవం కదా?..అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్వార్ధ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పట్నం అభివృధ్దిపై మట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. అభివృధ్దిపై నీకు ప్రేమ ఉంటే దమ్ము, సత్తా కలిగిన నాయకుడు పోరాటలతో ఉద్యమిస్తాడని, నీలా ఇతర పార్టీలకు అమ్ముడుపోడని విమర్శించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని 300 ఎకరాలకు సంబంధించి 20 కోట్ల రూపాయలు వస్తే మూడు కోట్ల రూపాయలు రైతులకు పంచావని, మిగతా 17 కోట్ల రూపాయలు కూడా పంచేస్తే ఇబ్రహీంపట్నం రైతుల రైతాంగాన్ని కాపాడినవాడివి అవుతానని సూచించారు. గెలిచిన నీ పదవిని అడ్డం పెట్టుకొని ఎవడబ్బా సోమ్మని తింటున్నావని విమర్శించారు. చేసిన పాపాలను తుడ్చడానికి టీఆర్ఎస్లో చేరతున్నారని, బజారులో అమ్ముడుపోయిన ఎమ్మెల్యే అని అన్నారు. నియోజకవర్గంలో వడగండ్ల వర్షం పడి రైతన్నలు నష్టాలలో ఉంటే, ప్యాకేజీలతో పబ్బం గడుపుతున్నాడని ఎద్దేవా చేశారు. తాను ప్రజల మనిషినని, ఇక పట్నం నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఉద్యమిస్తానని మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన నేనుంటానంటూ ఆయన నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా భరోసా ఇస్తున్నానన్నారు. విలేకరులు టీడీపీలో చేరుతారా....? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ నియోజకవర్గంలో అన్ని పార్టీలలో తనను అభిమానించే నాయకులు ఉన్నరన్నారు. సమావేశంలో మంచాల జెడ్పీటీసీ సభ్యుడు భూపతిగల్ల మహిపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్నాద్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ డెరైక్టర్లు రవీదంర్‌రెడ్డి, నిట్టు కృష్ణ, ముడుపు వెణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కలిసికట్టుగా ఉద్యమిద్దాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలోని పంచాయతీలను దఫదఫాలుగా గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తూ జిల్లా అస్థిత్వాన్ని దెబ్బతీసేలా సర్కారు చేస్తున్న కుట్రపై అఖిలపక్షం భగ్గుమంది. గతంలో శివారులోని 10 మున్సిపాలిటీలను అప్పట్లో హుడాలో విలీనం చేసి ప్రభుత్వం జిల్లా ఉనికిని దెబ్బతీసిందని ఆగ్రహించింది. తాజాగా 35 పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేయడంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం నగరంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షులు మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు యం.కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ హాజరు కాగా, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు గైర్హాజరయ్యారు. గ్రేటర్లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకునే వరకు ఉద్యమించాలని నిర్ణయించారు. అఖిలపక్షంతో కలిసిరాని పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ప్రకటించారు. ఏకపక్ష నిర్ణయం: టీడీపీ 35 గ్రామాలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే జిల్లాలోని వేల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమయ్యాయన్నారు. పంచాయతీలను విలీనం చేయకుండా ప్రత్యేక మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాల్సిందిగా పలుమార్లు సీఎం కిరణ్, మంత్రి ప్రసాద్, మాజీ మంత్రి సబితలపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 19న జెడ్పీలో చేపట్టే దీక్షలో అన్ని పార్టీల నేతలు పాల్గొనాలని కోరారు. విలీనంతో ఆయా గ్రామాల్లోని పేదలు జీవించే పరిస్థితి లేకుండా పోయిందంటూ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మండిపడ్డారు. సీమాంధ్రుల కుట్ర ఇది: టీఆర్ఎస్ హైదరాబాద్‌ను మహానగరంగా చూపించి సీమాంధ్రుల ఆస్తులకు విలువ పెంచుకునే క్రమంలోనే ఈ విలీన నిర్ణయం జరిగిందని, సామాన్యుల బాగోగులు పట్టించుకోకుండా సీఎం కిరణ్ కుట్రపూరిత నిర్ణయం తీసుకున్నారంటూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన మరుక్షణమే సీఎంను తొలగిస్తే పరిస్థితి ఇలా ఉండకపోయేదన్నారు. ఆది నుంచీ దోపిడే: సీపీఐ జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వాలు జిల్లాలోని వనరులు, ఆస్తులను దోచుకోవడమే పనిగా పెట్టుకుందంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కొల్లగొట్టిన సర్కారు.. విలీనంతో దుర్మార్గానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. విలీనంతో అక్కడి ప్రజలపై అధిక రెట్లలో పన్నుల భారం పడనుందన్నారు.