breaking news
LV SAGAR
-
కలెక్టర్ వేధింపులు ఆపకపోతే ఉద్యమం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : దళిత నాయకుడు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్వీ సాగర్‌పై కలెక్టర్ వేధింపులు ఆపకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని వివిధ దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. మంగళవారం స్థానిక రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలపాల రవి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, కొంత కాలంగా దళిత ఉద్యోగులే లక్ష్యంగా అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండగా ఉద్యోగులను బదిలీ చేయకూడదనే నిబంధన కలెక్టర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దళిత ఉద్యోగులను అవినీతిపరులుగా చూపించడానికి కలెక్టర్ చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ భాస్కర్ దళిత ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని మొండెం సంతోష్ కుమార్, మున్నుల జాన్‌గురునా«థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ బదిలీ అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దళిత నాయకులు పులవర్తి కొండబాబు, ఎం.ఆనందరావు, పలివెల చంటి, కందుల రమేష్, దాసరి నాగేంద్రకుమార్, మేతర అజయ్, అంతర్వేది కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సాగర్ వేధిస్తున్నారు.. రేషన్ డీలర్ల ఆరోపణ ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్ ఎల్వీ సాగర్ వేధిస్తున్నారని పలువురు రేషన్ డీలర్లు ఆరోపించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్, రేషన్ డీలర్ రాయి విమలాదేవి మాట్లాడుతూ తాను ప్రజాప్రతినిధినైనా ఏకవచనంతో సంబోధిస్తూ మహిళనని కూడా చూడకుండా సాగర్ కించపరుస్తున్నారని ఆరోపించారు. గతంలో ప్రొటోకాల్ నిమిత్తం తమ అసోసియేషన్ నాయకుడు గంగాధర్ నెలకి రూ.500 చొప్పున వసూలు చేసేవారని, సాగర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఈ మొత్తాన్ని రూ.1,600కు పెంచారని, భరించలేమని చెబితే దానిని రూ.1,000కి తగ్గించారన్నారు. విషయాన్ని గంగాధర్‌కు చెబితే అతను కూడా సాగర్‌కు అనుకూలంగా మారి తమను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో బినామీ డీలర్లు ఎవరూ లేరని, అందరూ కుటుంబసభ్యులు మాత్రమే దుకాణాలను నిర్వహిస్తున్నామన్నారు. మారిన పరిస్థితుల్లో ఒక్కో డీలర్ పరిధిలో సుమారు 300కు మించి కార్డులు లేవని, అయితే గంగాధర్‌కు 800 కార్డులున్నాయన్నారు. గంగాధర్‌కు మూడు బినామీ దుకాణాలు ఉన్నాయని ఆరోపించారు. అటువంటి వ్యక్తి తమ కష్టాలపై పోరాడాల్సింది పోయి ఫిర్యాదు చేసిన వారు బినామీ డీలర్లని ప్రచారం చేయడం తగదన్నారు. విలేకరుల సమావేశంలో రేషన్ డీలర్లు దాసరి ఆంజనేయులు, ఈపిచర్ల కాశి, మాదాల రాజశేఖర్, పీవీ రమణ, ఎం.శారద, డి.గంగ, సీహెచ్ రమేష్ పాల్గొన్నారు. -
చింతమనేనిని అరెస్ట్ చేయాలి
- రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్ - విధులను బహిష్కరిస్తామని హెచ్చరిక ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : కృష్ణాజిల్లా ముసునూరు తహసిల్దార్‌పై దాడి చేయించిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని రెవెన్యూ అసోషియేషన్ రాష్ర్ట కార్యదర్శి ఎల్వీ సాగర్ డిమాండ్ చేశారు. చింతమనేనిని అరెస్ట్ చేయాలంటూ రెవెన్యూ ఉద్యోగులు గురువారం సాయంత్రం కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ నేర చరిత్ర ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ విప్‌గా ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రభాకర్‌ను అరెస్టు చేయించిన విషయం మరిచారా అని చంద్రబాబును ప్రశ్నించారు. అనేక కేసులలో ముద్దాయిగా ఉన్న విప్ ప్రస్తుతం తనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే డీఐజీని దర్జాగా కలిసి వెళ్లడం చూస్తే ఆయన అధికార దర్పం అర్థమవుతుందని విమర్శించారు. పాలకులే దగ్గరుండి దాడులు చేయిస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆంధ్రా ఉద్యోగులకు కేంద్ర బలగాలతో రక్షణ ఇవ్వాలని గవర్నర్‌ను ఇటీవలే కోరామన్నారు. రాష్ట్రంలో మాత్రం పాలకులే దాడులకు పాల్పడుతున్నారన్నారు. చింతమనేనిని శుక్రవారం 10 గంటలలోగా అరెస్ట్ చేయకపోతే రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన చేపడతామన్నారు. మిగిలిన శాఖల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరవుతారని, వర్క్‌టు రూల్ పాటిస్తామని సాగర్ స్పష్టం చేశారు. దర్నాకు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రమేష్‌కుమార్, కలెక్టరేట్ విభాగ అధ్యక్షుడు ఎన్వీ నాంచారయ్య, జిల్లా సహాయ కార్యదర్శి డీవీఎన్ సత్యనారాయణ నాయకత్వం వహించారు. కలెక్టరేట్లోని రెవిన్యూ విభాగ ఉద్యోగులు పాల్గొన్నారు.