breaking news
LS members
-
నేడు టీఆర్‌ఎస్‌పీపీ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (టీఆర్‌ఎస్‌పీపీ) సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరగనున్న ఈ సమావేశంలో అధికార పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేతను ఈ సమావేశంలోనే ఎన్నుకోనున్నారు. టీఆర్ఎస్ కీలక నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ లోక్‌సభపక్ష నేతగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. గత లోక్‌సభలో టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేతగా ఉన్న ఏపీ జితేందర్‌రెడ్డికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. గత సభలో సభ్యులుగా ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, గోడం నగేశ్, బూర నర్సయ్యగౌడ్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున గెలిచిన తొమ్మిది మంది లోక్‌సభ సభ్యుల్లో బి.బి.పాటిల్ (జహీరాబాద్), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్), పసునూరి దయాకర్ (వరంగల్), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం) రెండోసారి ఎన్నికయ్యారు. నామా నాగేశ్వర్రావు 2009 నుంచి 2014 వరకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించారు. పోతుగంటి రాములు (నాగర్‌కర్నూలు) గతంలో రాష్ట్ర మంత్రిగా, మాలోతు కవిత (మహబూబాబాద్) గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. మిగిలిన ముగ్గురు వెంకటేశ్‌నేత (పెద్దపల్లి), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), గడ్డం రంజిత్‌రెడ్డి (చేవెళ్ల) చట్టసభకు తొలిసారి ఎన్నికయ్యారు. ఈ ముగ్గురిలో ఒకరికి అవకాశం.. సీనియర్ ఎంపీలుగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి, నామా నాగేశ్వర్రావు, పసునూరి దయాకర్‌లో ఒకరికి టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేతగా అవకాశం దక్కనుంది. గతంలో టీడీపీ లోక్‌సభా పక్షనేతగా వ్యవహరించిన నామా నాగేశ్వర్రావు ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. కమ్మ సామాజికవర్గానికి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేకుంటే నామా నాగేశ్వర్‌రావుకే ఈ పదవి ఇస్తారని తెలుస్తోంది. కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ సభ్యులలో కొత్తగా ఎన్నికైన వారే ఎక్కువగా ఉండటంతో ఈ పదవిలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. -
స్పీకర్ ను సర్ప్రైజ్ చేసిన లోకసభ సభ్యులు
న్యూఢిల్లీ : లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను సభ సభ్యులు సర్ ప్రైజ్ చేశారు. బుధవారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని సభ సభ్యులందరూ 'హ్యాపీ బర్త్ డే' సాంగ్ ను ఆలపించారు. వారి బర్త్ డే సాంగ్ మురిసిపోయిన సుమిత్రా మహాజన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ ప్రారంభం కాగానే సభ్యులందరూ ఒక్క సారిగా పైకి లేచి, హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడారు. ఆయురారోగ్యాలతో, సుదీర్ఘ కాలం పాటు జీవించాలని కోరుకుంటూ వారు ప్రార్థన నిర్వహించారు. వారి ప్రార్థనలకు ఆమె ఎంతో సర్ ప్రైజింగ్ గా ఫీలయ్యారు. నేడు ఆమె 73 సంవత్సరంలోకి అడుగు పెట్టారు. సభ మొత్తం తరుఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్, ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలను తెలిపారు.''సభ్యులందరి తరుఫున మీరు సుదీర్ఘ కాలం పాటు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్ వారి శుభాకాంక్షలకు ఎంతో ఆనందం వ్యక్తంచేశారు. సభ నిర్వహించేటప్పుడు తను వ్యవహరించే తీరును, మందలింపు చర్యలను ఎవరూ సీరియస్ తీసుకోరని ఆశిస్తున్నట్టు సుమిత్రా పేర్కొన్నారు.