breaking news
low level bridge
-
తప్పిన పెనుప్రమాదం
కరీంనగర్ (మానకొండూర్): మహిళా కూలీలు వరదలో కొట్టుకుపోగా గ్రామస్తులు కాపాడారు. ఈ ఘటన మండలంలోని అర్కండ్ల లోలెవల్ వంతెనపై సాయంత్రం జరిగింది. వివరాలు.. మండలంలోని అర్కండ్ల రైతుల వ్యవసాయ భూములు గ్రామానికి అవతలి వైపు ఉన్నాయి. మంగళవారం ఉదయం లోలెవల్ వంతెనపై నీటి ప్రవాహం తక్కువ ఉండడంతో వరినాట్లు వేసేందుకు మహిళలు వంతెనమీదుగా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని వెళ్లారు. సాయంత్రం నీటి ప్రవాహం పెరిగింది. గమనించని మహిళలు తిరిగి వస్తున్న క్రమంలో కొంత మంది బ్రిడ్జి దాటగా.. నేదురు సారమ్మ, నేదురు ఐలమ్మ, ఇజ్జిగిరి వనమ్మ, ఇజ్జిగిరి భాగ్యమ్మ, ఇజ్జిగిరి మొగిళి వాగులో నీటి ప్రమావాహంలో కొట్టుకుపోయారు. మిగతా కూలీలు కేకలు వేయడంతో పొలం పనులు ముగించి ఇంటికి వస్తున్న రైతులు, గ్రామస్తులు వెంటనే వరదలో కొట్టుకుపోతున్న ఐదుగురిని కాపాడి గట్టుకు చేర్చారు. అందరూ ప్రాణాలతో బయట పడడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. గట్టుకు చేరిన తర్వాత బాధితులు చచ్చి బతికామంటూ రోదించారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
వరంగల్, హసన్‌పర్తి: రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. రైల్వే లోలెవల్ కింద చేరిన వరద నీటిని సకాలంలో తొలగించకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మునిపల్లి–చింతగట్టు మార్గమధ్యలోని లోలెవల్ బ్రిడ్జిలో మంగళవారం రాత్రి జరగగా బుధవారం ఉదయం కుటుంబసభ్యులు గుర్తించారు. వివరాల్లోకెళితే.. మునిపల్లికి చెందిన యువరైతు దుర్గం శ్రీధర్(32) మంగళవారం రాత్రి పని ముగించుకుని చింతగట్టు నుంచి మునిపల్లికి బయల్దేరాడు. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జిలో వరదనీరు చేరడం వల్ల రైలు పట్టాలు దాటి బ్రిడ్జి పిట్టగోడ పైనుంచి గ్రామానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారీ వరదనీటిలో పడ్డాడు. కాగా, శ్రీధర్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బుధవారం ఉదయం గాలించారు. లోలెవల్ బ్రిడ్జిలో శ్రీధర్ చెప్పులు కనిపించడంతో అందులో గాలించగా శ్రీధర్ మృతదేహాం లభ్యమైంది. గ్రామస్తుల ఆందోళన.. కాగా, రైల్వే అధికారుల నిర్లక్ష్యంతోనే శ్రీధర్ నీటిలో పడి మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు కొంతసేపు సంఘటనా స్థలంలో ఆందోళన నిర్వహించారు. ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా వర్షాకాలంలో ఈ సమస్య నెలకొన్నప్పటికీ ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఓ దశలో ప్రధాన రహదారిపై మృతదేహంతో ధర్నాకు సిద్ధమయ్యారు. కాగా, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్‌బాబు వారిని సముదాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రమాదాన్ని ముందే చెప్పిన ‘సాక్షి’.. ఇదిలా ఉండగా మునిపల్లి–చింతగట్టు మధ్య ప్రమాదం ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. ఈనెల 4న ‘సాక్షి’లో ‘రాకపోకలు బంద్’ అనే కథనం ప్రచురితమైంది. కాగా, అందులో చేరిన వరద నీరు తొలగించడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
గూడెం వంతెన తాకుతున్న గోదావరి
దండేపల్లి/ధర్మపురి: ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని గూడెం(రాయపట్నం వంతెన) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండ్రోజుల క్రితం కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటిని వదలడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నదిపై ఉన్న పాత లోలెవల్ వంతెన ఆదివారం మునిగిపోయేలా కనిపించింది. వంతెనకు సమానంగా నీరు ప్రవహిస్తుండడంతో.. అధికారులు శనివారం రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, జీపులను ఆదివారం ఉదయం నుంచి కొత్త వంతెనపై నుంచి పంపిస్తున్నారు. కొత్త వంతెనపై బీటీ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు రాయపట్నం వైపు పూర్తయ్యాయి. గూడెం వైపు ఇంకా సాగుతున్నాయి. వర్షాలు పడడంతో అప్రోచ్ రోడ్డు పనుల్లో కొంత జాప్యం జరిగింది. కాగా, నీటి ప్రవాహం పెరిగితే సోమవారానికి లో లెవల్ వంతెన పూర్తిగా మునిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
వరద ‘బలి’ని ఆపేదెవరు?
పాలకుల నిర్లక్ష్యం ప్రజలపాలిట శాపంగా పరిణమిస్తోంది. ఎందరో అమాయకుల ప్రాణాలు ‘వరద’లో కొట్టుకుపోతున్నాయి. లోలెవెల్ బ్రిడ్జిల రూపంలో ఎక్కడో అక్కడ.. ఎవరో ఒకరిని మృత్యువు కబళిస్తూనే ఉంది. ప్రభుత్వాల అశ్రద్ధ కారణంగా ఏటా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. నిండుప్రాణాలు నిలువునా ‘మునిగి’పోతున్నా పాలకుల మనసు ‘ద్రవించడం’ లేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తరహా పాలన వస్తే తప్ప తమ జీవితాలకు రక్షణ ఉండదని ప్రజలు పేర్కొంటున్నారు. గన్నవరం రూరల్, న్యూస్‌లైన్ : గన్నవరం మండలంలోని లోలెవెల్ బ్రిడ్జిలు ప్రజలపాలిట మృత్యుకుహరాలుగా మారిపోతున్నాయి. ఏటా ఎవరో ఒకరిని బలిగొంటూనే ఉన్నాయి. ఈ ఏడాది ముస్తాబాద పెద్దచెరువు వద్ద ఉన్న లోలెవెల్ బ్రిడ్జిపై తండ్రీకూతుళ్లు కొట్టుకుపోయిన దుర్ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. లోలెవెల్ బ్రిడ్జిలను ఆధునికీకరించి బీబీగూడెం తరహాలో హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మిస్తే తప్ప ప్రాణనష్టం తప్పేలా లేదు. గన్నవరం మండలంలో 21 గ్రామాలుండగా చిన్నపాటి వర్షానికే అనేక గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వీటిని దాటి వెళ్లేందుకు అప్పట్లో తూములు నిర్మించారు. కొన్ని చోట్ల లోలెవెల్ బ్రిడ్జిలు నిర్మించారు. ఇవికాక రోడ్ల పైనే నీరు పారేటట్లు రహదారిని దిగువకు నిర్మించారు. వర్షాలు వచ్చినప్పుడు నీరు వెళ్లిపోవడం, ఆ తర్వాత మామూ లుగా ప్రయాణాలు కొనసాగడం ఈ ప్రాంతాల్లో సర్వసాధారణమైపోయింది. గన్నవరం, పురుషోత్తపట్నం మార్గంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద చీమలవాగు లోలెవెల్ బ్రిడ్జి ఎంతో కాలంగా ఉంది. అలాగే ముస్తాబాద-సూరంపల్లి రహదారిలో హైస్కూల్ క్రాస్ రోడ్ వద్ద లంబాడీ బాట వాగు పొంగింది. స్థానిక పెద్ద చెరువులోకి నీరు అధికంగా వచ్చి చేరడంతో ఆ నీరు రహదారి పైన ఉన్న లోలెవల్ బ్రిడ్జి దాటి రెండు కిలోమీటర్ల దూరంలోని పేడ చెరువుకు చేరుతుంది. రహదారికి పలుసార్లు మరమ్మతు చేసిన ఆర్ అండ్ బీ శాఖ ఈ బ్రిడ్జిలను ఎత్తుగా నిర్మించే ఆలోచన చేయలేదు. ఈ కారణంగా అధిక వర్షాలు కురిసిన ప్రతిసారీ పొంగి పొర్లి రాకపోకలకు విఘాతం ఏర్పడడమే కాకుండా ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. లోలెవెల్ బ్రిడ్జిలను నిర్మించిఆరు దశాబ్దాల పైమాటే! ఆర్ అండ్ బీ రహదారులైన కేసరపల్లి- సావరగూడెం, గన్నవరం-పురుషోత్తపట్నం, పురుషోత్తపట్నం-వెదురుపావులూరు, ముస్తాబాద-సూరంపల్లి, సూరంపల్లి- సూరంపల్లి అడ్డరోడ్డు, చిక్కవరం-కొత్తగూడెం గ్రామాల మధ్య ఈ లోలెవెల్ బ్రిడ్జిలు ఉన్నాయి. వీటన్నింటినీ హైలెవెల్ బ్రిడ్జిలుగా మార్చకపోతే ఏటా ఇవే పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న లోలెవెల్ బ్రిడ్జిలు నిర్మించి 60 సంవత్సరాలు దాటిందని ఆ ప్రాంతంలో నివసించే వృద్ధులు చెబుతున్నారు. బీబీగూడెంలో చీమలవాగుపై వంతెన నిర్మాణం వైఎస్ చలవే.. మండలంలోని బీబీగూడెం గ్రామంలో చీమలవాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి 2008వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 50 లక్షల నిధులు కేటాయించారు. గన్నవరం-ఆగిరిపల్లి మార్గంలో చీమలవాగు మహోధృతంగా ప్రవహిస్తూ 1989 అక్టోబరు 30వ తేదీన నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఆ ప్రమాద సంఘటన తర్వాత ఎవరూ వంతెన నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ఎజెండాగా పాలన సాగించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ వంతెన నిర్మించి ప్రజలు కష్టాలు తీర్చారని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ చెప్పుకొంటున్నారు. అధికారులు స్పందించాలి.. ప్రతి వర్షాకాలంలోనూ వాగుల వద్ద నీటి ఉరవడికి రాకపోకలు నిలిపివేయడం పరిపాటిగా మారింది. ప్రాణాలు బలి గొంటూ ఇబ్బందులు పెడుతున్న వరద ఉధృతిపై అధికారులు దూరదృష్టితో ఆలోచనలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న లోలెవెల్ బ్రిడ్జిల స్థానే హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలని వేడుకుంటున్నారు. మండలంలోని వాగులివే.. గన్నవరం మండలంలో పురుషోత్తపట్నం, సావరగూడెం, కొత్తగూడెంలలో చీమలవాగు; పురుషోత్తపట్నం, సావరగూడెంలలో బొబ్బరవాగు; ముస్తాబాదలో లంబాడి బాట వాగు; సూరంపల్లిలో లాయదారు వాగు; గోపవరపుగూడెంలో ఎన్.ఎస్.పి. కాల్వ ఉన్నాయి. ఇవికాకుండా గోపవరపుగూడెం, కొండపావులూరు, కట్టుబడిపాలెం తదితర గ్రామాల్లో ఉన్న వాగుల్లో చిన్నపాటి వర్షానికే రహదారులపైకి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. ఇద్దరిని మింగిన చీమలవాగు 2010-11 సంవత్సరంలో సంభవించిన వరదల కారణంగా చీమలవాగు ఉధృతంగా పొంగి ప్రవహించింది. ఆ ప్రవాహ ఉధృతికి నున్న గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కొట్టుకుపోయి నాలుగు రోజులకు పంటచేలల్లో శవమై తేలాడు. 2012లో విజయవాడకు చెందిన నాలుగో తరగతి విద్యార్థి సత్యప్రీతమ్ కొండపావులూరులోని తన తాతయ్య, అమ్మమ్మల ఇంటికి వచ్చాడు. తాత ఆదాం రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద విధులు నిర్వర్తిస్తుంటాడు తాత వెంట వచ్చిన సత్య ప్రీతమ్ పొంగి పొర్లుతున్న వాగులో నడుస్తున్నాడు. ఆ సమయంలో వరద నీటి ఉధృతి ఎక్కువ కావడంతో చిన్నారి కొట్టుకుపోయాడు. ఈ రెండు సంఘటనలతో అయినా సర్కార్ స్పందిస్తుందని ప్రజలు ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తండ్రీ కుమార్తెను బలితీసుకున్న పెద్దచెరువు ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు ముస్తాబాద-సూరంపల్లి రహదారిలో హైస్కూల్ క్రాస్‌రోడ్ వద్ద లంబాడి బాట వాగు (పెద్దచెరువు) పొంగి తండ్రి, కుమార్తెను బలితీసుకున్న సంఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ముస్తాబాదలో ఎల్కేజీ చదువుతున్న కుమార్తె మజీరా పర్వీన్ (4)ను స్కూల్లో వదిలేందుకు షేక్ మస్తాన్ (28)సూరంపల్లి నుంచి మోపెడ్‌పై వచ్చాడు. రహదారి పైనున్న లో లెవెల్బ్రిడ్జిపై మూడడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతిని అంచనా వేయలేని మస్తాన్ మోపెడ్‌ను వరదనీటి లోంచి పోనివ్వడంతో ప్రవాహవేగానికి బిడ్డతో సహా కొట్టుకుపోయాడు. మస్తాన్‌కు భార్య, రెండు సంవత్సరాల కుమారుడు మజీద్ ఉన్నారు. భర్తను కోల్పోయిన నగీనా దుఃఖానికి అంతులేకుండా ఉంది. ఈ ప్రమాద ఘటనలకు, ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యమేనని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.