అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, అమరావతి: మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్ట్ నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్‌కు చెందిన బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం అత్యవసరంగా మూడు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కాగా, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఇప్పటికే హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వీటిపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వికాస్‌సింగ్, నాగముత్తు కోరారు. ఈ లోపు ఏసీబీ అరెస్ట్ చేస్తే తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు నిరర్థకం అవుతాయని తెలిపారు.అయితే, ఏసీబీ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు స్పష్టం చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ధనుంజయరెడ్డి తదితరులు అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కనీస స్థాయిలో కూడా మా వాదన వినలేదుఅరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించడాన్ని తమ వ్యాజ్యాల్లో ధనుంజయరెడ్డి తదితరులు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తమ వ్యక్తిగత స్వేచ్ఛ ముడిపడి ఉందని, న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతో ప్రాధాన్యతనిస్తాయని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. హైకోర్టు తీరు తమ హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు. అరెస్ట్ విషయంలో తమ ఆందోళనను హైకోర్టు కనీస స్థాయిలో పట్టించుకోలేదని, తమ సీనియర్ న్యాయవాదులకు వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పారు. ముందస్తు బెయిల్ మంజూరు అంశాన్ని కనీస స్థాయిలోనూ పరిశీలించకపోవడం, వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వాస్తవానికి ఏసీబీకి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసే అధికారం హైకోర్టుకు ఉందన్నారు. గుర్భక్ష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. అరెస్ట్ విషయంలో ఆందోళన ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టుల్లో తమను కుట్రదారులుగా పేర్కొందని, ఆ ఆరోపణలన్నీ నిరాధారమని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తమ వ్యాజ్యాల్లో వివరించారు.మద్యం కొనుగోళ్లతో మాకేం సంబంధం లేదుమద్యం కొనుగోళ్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి వివరించారు. ఇదంతా పూర్తిగా ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోనిదని తెలిపారు. తాము కుట్రదారులని చెప్పేందుకు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదే వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇప్పటికే తేల్చి చెప్పిన సంగతిని గుర్తుచేశారు. అయినా కూడా తమపై ఆరోపణలు చేయడం వేధింపుల్లో భాగమేనని పేర్కొన్నారు. మద్యం కొనుగోళ్లలో తమ పాత్ర ఉందన్న ఆరోపణలకు ఆధారాలుంటే అవి ఏసీబీ వద్దే ఉంటాయని, అలాంటప్పుడు తాము ఆధారాలను ఎలా తారుమారు చేయగలమని వారు ప్రశ్నించారు. ప్రజల్లో తమ స్థాయిని తగ్గించి, అవమానించాలన్న ఉద్దేశంతోనే ఏసీబీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కోరారు.