పిడుగుపాటుతో రైతుకు తీవ్రగాయాలు
న్యాల్కల్ (మెదక్): పొలంలో పని చేసుకుంటుండగా పిడుగుపడటంతో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా న్యాల్కల్ మండలంలో గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. మండలంలోని ముంగి గ్రామానికి చెందిన రామిరెడ్డి అనే రైతు గ్రామం సమీపంలోని పొలానికి వెళ్లాడు.
మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఉన్నట్లుండి ఉరుములు, మెరుపుతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఇంతలోనే పొలంలో పనిచేసుకుంటున్న రైతు రామిరెడ్డిపై పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దీంతో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోనే ఉన్న తుకారాం అనే వ్యక్తి గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు క్షతగాత్రుడిని బీదర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు సమాచారం.