breaking news
librery
-
విద్యార్థినులకు కొత్త వసతి గృహాన్ని నిర్మించండి
కేపీహెచ్‌బీకాలనీ: జేఎన్టీయూహెచ్లో విద్యార్థినుల కోసం కొత్త వసతి గృహాన్ని నిర్మించాలని ఓఎస్డీ స్కూడెంట్స్ అఫైర్ బానోతు ధర్మాను కోరారు. ఈ మేరకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్ఠి నాయకురాలు శేషుశ్రీ పంచాల మాట్లాడుతూ... ఇటీవల వసతి గృహాల్లోనే లైబ్రరీ సదుపాయం కల్పించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థినుల సంఖ్య పెరిగిందన్నారు. విద్యార్థినుల సంఖ్యకు అందుకనుగుణంగా మరో వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరాన్నారు. మెస్ బిల్లులు సైతం ఎక్కువగా వస్తున్నాయని, మెస్ బిల్లులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కార్యక్రమంలో హాస్టల్ కో ఆర్డినేటర్ పవిత్ర, కీర్తన, శ్రీజ, జ్ఞాన ప్రసీద, శ్రేయ, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. -
‘పీవీ’... ఠీవీ
సనత్‌నగర్: అక్కడ పీవీ జ్ఞాపకాలు అడుగడుగునా స్పృశిస్తాయి. భౌతికంగా తాను లేకపోయినా ఆయన అందించిన స్మృతులకు నెలవు అది. ఆయన ఠీవీకి నిలువెత్తు సాక్ష్యం అది. ఆనాడు ప్రధానమంత్రి హోదాలో ఆయన ఉపయోగించిన అంబాసిడర్ కారు దగ్గర నుంచి..ఆయన చదివిన, ఆయన సేకరించిన ప్రతి పుస్తకం అక్కడ పదిలం. చట్టసభల్లో చేసిన డిబేట్స్, అక్కడ చేసిన శాసనాలు..ఇలా రీసెర్చ్ స్కాలర్స్‌కు ఆయుధంగా మలిచే పీవీ స్మారక విజ్ఞాన భండాగారం అక్కడ కొలువై విజ్ఞాన సంపత్తికి కేరాఫ్‌గా మారింది. మహాత్మాగాంధీ, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయ్‌పటేల్, స్వామి వివేకానంద, సుభాష్‌చంద్రబోస్...ఇలా ఎందరో మహోన్నతుల జీవిత గ్రంథాలు ఆ భండాగారంలో మది మదినీ తట్టిలేపుతాయి. భారతావాని దశ దిశను మార్చేలా లోక్‌సభ, రాజ్యసభలో తీసుకున్న నిర్ణయాలు అక్కడ నిక్షిప్తమై చరిత్రకు ఆలవాలంగా నిలుస్తాయి.. దేశాల మధ్య కొనసాగుతున్న సంబంధ బంధవ్యాలు ఇక్కడ గ్రంథరాజల్లో భద్రంగా ఉన్నాయి. న్యాయ పరిపరిపాలన శాస్త్రాలు...కాళోజీ కవితలు, గొల్లపూడి మారుతీరావు, కాశీపట్నం రామారావు, కృష్ణశాస్త్రిల సాహిత్యం, పురాణేతిసాహాలు. ఆధ్యాత్మికం...ఇలా సకల గ్రంథాల సమాహారంగా ఆ గ్రంథాలయం విరాజిల్లుతోంది. పదులు, వందలు కాదు...అక్షరాలా పది వేలకు పైగా పుస్తకాలతో విజ్ఞాన కేంద్రంగా భాసిల్లుతోంది. అవన్నీ కూడా బహుబాషా కోవిదుడు, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు సేకరించుకున్న పుస్తకాలే. మాజీ ప్రధానమంత్రిగా, రాజకీయ నేతగా మాత్రమే పీవీ అందరికీ తెలుసు..కానీ ఆయన ఓ సాహితీ పిపాసి అని కొద్ది మందికే తెలుసు. ఆయన సేకరించిన ఆ పుస్తకాలను చూస్తే ఆయనలోని సాహితీ విలువలకు అద్దంపడుతోంది. ఇంతకీ పీవీ జ్ఞాపకాల దొంతర్లు కొలువుదీరిన ప్రాంతం ఏదనేగా..మీ ప్రశ్ప. అదే బేగంపేట బ్రాహ్మణవాడీ లేన్–9లోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణం. ఇప్పటికీ చెక్కుచెదరని అంబాసిడర్... పీవీ నరసింహారావు ఢిల్లీలో ఉపయోగించిన అంబాసిడర్ కారు ఇప్పటికీ ఇక్కడ ప్రాంగణంలో చెక్కు చెదరకుండా ఉంది. డీఎల్ 2సీ జీ 4395 నెంబర్ రిజిస్ట్రేష¯Œన్ కలిగిన అంబాసిడర్ కారు స్వామి రామానంద తీర్థ మోమోరియల్ కమిటీ భవనం ప్రవేశ ద్వారం వద్దనే దర్శనమిస్తుంది. ప్రతిరోజూ కారును అక్కడ సిబ్బంది తుడవడం దినచర్యలో భాగం. ఎన్నెన్నో భాషలు...అన్నింటా సాహిత్యాలు... పీవీ నర్సింహారావు అనర్గళంగా మాట్లాడే భాషలు ఎన్ని ఉన్నాయో అంతకుమించి భాషల్లోనూ ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మరాఠి, కన్నడ, సంస్కృతం, మళయాళం, ఉర్దూ భాషలతో పాటు ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ వంటి దాదాపు దేశ, విదేశాలకు చెందిన 20 భాషలకు చెందిన పుస్తకాలు ఇక్కడ చూడవచ్చు. ఎక్కువ శాతం పీవీ నర్సింహారావు స్వయంగా కొనుగోలు చేయగా, చాలామంది ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. 1950లో కొనుగోలు చేసిన పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడి చాలా పుస్తక ధరలు అణాల్లో చూడవచ్చు. సకల శాస్త్రాలకు కేరాఫ్... లోక్‌సభ, రాజ్యసభల్లో జరిగిన డిబేట్స్, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, దేశభక్తి నాయకులపై రాసిన గ్రంథాలు, ఆయా మహనీయుల బయోగ్రఫీలు, అంతర్జాతీయంగా పేరెన్నిక గన్న రచయితలు రాసిన సాహిత్య పుస్తకాలు, హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర, జీవిత సత్యాలను ప్రతిబింబించే భారత, భాగవతం, రామాయణ గ్రంథాలు, కంప్యూటర్ రంగ పరిజ్ఞానాన్ని పంచే పుస్తకాలు, సత్యసాయిబాబా, షిర్డిసాయిబాబా, అహోబిల స్వామిలతో పాటు ఎందరో స్వాముల ఆధ్యాత్మిక ప్రవచనాలు, యోగా వాసిష్టం, మలయాళ సద్గురు గ్రంథం, తెలుగు పౌరాణిక సాహిత్యం, ఆంధ్ర మహా గ్రంధం, చైతన్య రామాయణం, న్యాయశాస్త్రాలు, ఐక్యరాజ్యసమితి నిర్ణయాలు.. ఇలా అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. అలాగే పీవీ ముందస్తు మాటలను రాసిన పుస్తకాలు ఇక్కడ వందల్లో ఉంటాయి. ఇది అరుదైన పుస్తకాల వేదిక లైబ్రరీలో ఉన్న పుస్తకాల పేర్లను ఓ రిజిస్ట్రర్‌లో రాస్తున్నాను. ఇప్పటికి పది వేలకు పైగా పుస్తకాలు ఇండెంట్లో పొందుపర్చాను. ఇంకా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఒక్కో పుస్తకం చూస్తుంటే లక్షలు, కోట్లు పెట్టినా కొనలేని విజ్ఞానం సంపాదించుకోవచ్చని కలుగుతుంది. దేశంలోనే అరుదైన పుస్తకాలకు ఇదో వేదిక అని ఖచ్చితంగా చెప్పగలను.– చీకోలు సుందరయ్య, లైబ్రరీ పర్యవేక్షకుడు.. రీసెర్ ్చ స్కాలర్స్‌కు ఆయుధంగా... పీవీ స్మారక గ్రంథాలయం రీసెర్చ్ స్కాలర్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. చరిత్రలో దాగి ఉన్న ఎన్నో విశేషాలను ఇక్కడి పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ఇక్కడి గ్రంథాలయం గురించి తెలుసుకుని ఇక్కడకు వచ్చి పుస్తకాల ద్వారా విజ్ఞాన సముపార్జన చేస్తూ తమ రీసెర్చ్‌ను కొనసాగిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కడా దొరకని సమాచారం కూడా ఇక్కడ లభిస్తుందంటే అతిశయోక్తి కాదు. -
వాళ్లు మారరు... తీరూ మారదు
గ్రంథాలయం పక్కనే చెత్తాచెదారం ఇబ్బందులు పడుతున్న పాఠకులు సమస్య పరిష్కరించాలని విన్నపం నిర్మల్ రూరల్ : వాళ్లంతా స్వయం ఉపాధి పొందుతున్న యువకులు. తమ వంతుగా సమాజానికి ఏదైనా సేవ చేయాలనే తలంపుతో ఉన్నవాళ్లు. తలా కొంత డబ్బు కూడబెట్టి ప్రజల అవసరాన్ని గుర్తిస్తూ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని గాంధీచౌక్‌లో స్వామి వివేకానందుడి పేరిట గ్రంథాలయాన్ని ప్రారంభించారు. దాదాపు పదేళ్లుగా ఇక్కడ సేవలందిస్తున్నారు. అయితే వీరందించే సేవలకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. పాఠకుల కోసం.. పట్టణానికి చెందిన యువకులు గంగిశెట్టి ప్రవీణ్, కూన రమేశ్, అబ్దుల్ అజీజ్, నాయిడి మురళీధర్, వారల్ మనోజ్, అంక శంకర్, ఆర్. శ్రీధర్, శ్రీరామోజీ నరేశ్, తాళ్లపెల్లి నారాయణ, మదన్మోహన్లు నిర్మల వివేకానంద సేవా సమితిగా ఏర్పడి సేవలందిస్తున్నారు. గతంలో గాంధీచౌక్‌లో ఉన్న ప్రభుత్వ శాఖా గ్రంథాలయాన్ని భాగ్యనగర్‌కు తరలించారు. దీంతో గాంధీచౌక్, సోమవార్‌పేట్, బేస్తవార్‌పేట్, కాల్వగడ్డ, బ్రహ్మపురి, వెంకటాద్రిపేట్, బంగల్పేట్, నాయుడివాడ, బుధవార్‌పేట్ తదితర వీధుల ప్రజలకు గ్రంథాలయం చాలా దూరభారమైంది. దీంతో పాఠకులు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన సేవా సమితి సభ్యులు గ్రంథాలయ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. తాము సంపాదించిన దాంట్లో నుంచే తలా కొంత వేసుకొని అందరికీ అందుబాటులో ఉండేలా గాంధీచౌక్‌లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. వివిధ దినపత్రికలతో పాటు వారపత్రికలు, పోటీ పరీక్షల పత్రికలను అందుబాటులో ఉంచుతున్నారు. ముక్కు మూసుకొని చదువుతూ.. వివేకానంద గ్రంథాలయానికి నిత్యం యాభై నుంచి వందమంది వరకు పాఠకులు వస్తుంటారు. ఉదయం, సాయంత్ర వేళల్లో గ్రంథాలయాన్ని తెరిచి ఉంచుతారు. పాఠకుల్లో విశ్రాంత ఉద్యోగులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు, విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్‌గా వచ్చే పాఠకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే గ్రంథాలయం పక్కనే చెత్తచెదారం వేస్తుండటం, గ్రంథాలయ గోడలపై మూత్ర విసర్జన చేస్తుండటంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన వస్తుండటంతో ముక్కు మూసుకొని చదవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. పలుమార్లు సూచించినా.. గ్రంథాలయం వద్ద చెత్త వేయొద్దని, ఇక్కడ మూత్రం చేయొద్దని నిర్వాహకులు పలుమార్లు విన్నవించినా పరిస్థితిలో మార్పురావడం లేదు. స్థానికులు కొంతమేరకు సహకరిస్తున్నా.. దూరప్రాంతాల నుంచి చెత్తను తీసుకువచ్చి ఇక్కడ పోస్తున్నారని పేర్కొంటున్నారు. ఇక మున్సిపల్ అధికారులే ఏదైనా శాశ్వత పరిష్కారం కల్పించాలని నిర్వాహకులు కోరుతున్నారు.