breaking news
leopard rescued
-
విమానాశ్రయంలో చిరుత హల్ చల్..
రిషికేశ్: డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయంలోకి ప్రవేశించిన ఓ చిరుతపులిని బుధవారం బోనులో బంధించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంత నుంచి విమానాశ్రయ ప్రాంగణంలోకి వచ్చిన చిరుత విమాన రాకపోకల భారీ శబ్దాలకు భయపడి అక్కడే ఉన్న కొత్త టెర్మినల్ భవనం సమీపంలోని ఓ పైపులో దాక్కుందని, దాదాపు పది గంటలు అందులోనే ఉండిపోయిందని సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి జి.ఎస్.మార్తోలియ అన్నారు. మంగళవారం సాయంత్రం చివరి విమానం బయల్దేరిన తరువాత శబ్దాలు తగ్గడంతో చిరుత బయటకి వచ్చి అక్కడి సిబ్బందిని భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు దాదాపు 10 గంటలు శ్రమించి చిరుతను బోనులో బంధించారు. చిరుతపులిని డెహ్రాడూన్ అటవీ విభాగానికి చెందిన బాడ్కోట్ పరిధిలో ఉంచారు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులు దానికి సంబంధిత పరీక్షల తరువాత అడవిలోకి విడుదల చేస్తారని డెహ్రాడూన్ డిఎఫ్ఓ రాజీవ్ ధీమన్ చెప్పారు. -
ఫాంహౌస్లో చిరుత.. రక్షించిన అధికారులు
ఓ ఫాంహౌస్లో బంధించిన మూడు నెలల చిరుతపులి పిల్లను అటవీ శాఖ అధికారులు రక్షించారు. గుర్గావ్ శివార్లలో ఉన్న ఫాంహౌస్లో చిరుత పిల్ల ఉన్నట్లు స్థానికులు అందించిన సమాచారంతో అధికారులు దాడి చేశారు. అక్కడ ఓ ఆడ చిరుత పిల్ల కనిపించింది. దానికి ముందువైపు కుడికాలు బాగా ఫ్రాక్చర్ అయ్యింది. దాన్ని ఇనుప గొలుసులతో బంధించడం లేదా బోనులో పెట్టడం చేసి ఉంటారని, అందుకే కాలు విరిగి ఉంటుందని పశువైద్యులు భావిస్తున్నారు. అయితే, గుర్గావ్ సమీపంలోని గైరత్పూర్ బస్ అనే గ్రామంలో పొదల వద్ద ఈ చిరుత పిల్ల కనిపించినట్లు అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతం ఆరావళి పర్వతశ్రేణి పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చిరుతలు ఎక్కువగా తిరుగుతుంటాయి. గుర్గావ్ వన్యప్రాణి సంరక్షణ విభాగం వాళ్లు కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ చిరుత పిల్లను రక్షించారు. వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుని గానీ, లేదా ఎవరైనా బంధించడం వల్ల గానీ మాత్రమే ఈ చిరుత పులి పిల్ల ఇంతలా గాయపడి ఉండాలని స్థానికులు వాదిస్తున్నారు. ఇది కనిపించిన ప్రాంతానికి సమీపంలో మూడు ఫాంహౌస్లు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు. తమ గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఆడ చిరుత, మగ చిరుత తిరుగుతుండేవని, ఇది వాటి పిల్లే అయి ఉంటుందని స్థానికులు చెప్పారు. దీన్ని ఎక్కడి నుంచి పట్టుకున్నారో అధికారులు స్పష్టంగా చెప్పడంలేదు కాబట్టి తమకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో చిరుత పిల్లను అక్కడి నుంచి తరలించేందుకు కూడా వాళ్లు అడ్డుపడ్డారు.