breaking news
Legal warning
-
ఫ్యూచర్ స్టోర్స్ రీబ్రాండింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భవన యజమానులకు బకాయిలు చెల్లించలేక మూతపడ్డ ఫ్యూచర్ రిటైల్ స్టోర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోవడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తొలి దశలో 250 కేంద్రాలను రిలయన్స్ చేజిక్కించుకుంటోంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 20 వరకు ఔట్లెట్స్ ఉన్నట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్ నిర్వహణలో దేశవ్యాప్తంగా 1,700లకుపైగా కేంద్రాలు ఉన్నాయి. ఫ్యూచర్ రిటైల్ ఆస్తుల విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెజాన్ మధ్య లీగల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాస్తా బకాయిలు పేరుకుపోవడానికి దారి తీయడం, అద్దెలు చెల్లించలేకపోవడంతో ఫ్యూచర్ రిటైల్ ఔట్లెట్స్ కాస్తా మూసివేతకు గురవుతున్నాయి. కాగా, రీబ్రాండింగ్‌తో ఎఫ్‌బీబీ స్టోర్లు ట్రెండ్స్ కేంద్రాలుగా మారనున్నాయి. బిగ్ బజార్ స్టోర్స్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లేదా రిలయన్స్ మార్కెట్, ఈజీ డే ఔట్లెట్స్ రిలయన్స్ ఫ్రెష్‌గా పేరు మారనున్నాయి. ఫ్యూచర్ రిటైల్ నెట్‌వర్క్‌లో పని చేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని రిలయన్స్ నిర్ణయించింది. ఈ నిర్ణయం సుమారు 30,000 మందికి ఊరట కలిగించనుంది. ‘నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి తెరపడింది. విక్రేతలు, సరఫరాదార్లు తమ బకాయిలు పొందుతున్నారు. భవన యజమానులు సైతం తమ స్టోర్స్‌ను రిలయన్స్‌కు లీజుకు ఇస్తున్నారు. గత ఏడాది అద్దెలు ఫ్యూచర్ గ్రూప్ నుంచి వీరికి అందలేదు. ఆ బకాయిలను సంస్థ తీర్చింది. అయితే నష్టాలు వస్తున్న ఔట్‌లెట్స్‌ను కంపెనీ తీసుకోవడంతో దివాలా ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. సర్దుబాటు పథకం గనుక ఆమోదం పొందితే తమ బకాయిలు రాగలవని రుణదాతలు భావిస్తున్నారు’ అని రిలయన్స్ వెల్లడించింది. -
సిగరెట్ ప్యాకెట్లపై 85% స్థలంలో హెచ్చరికలు
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. పొగతాగటం వల్ల అనర్థాలపై సిగరెట్ ప్యాకెట్లపై 85 శాతం స్థలంలో చట్టబద్ధమైన హెచ్చరికలను తప్పనిరిగా ముద్రించాలని తయారీ కంపెనీలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పొగాకు ఉత్పత్తుల తయారీ కంపెనీలు సిగరెట్ పెట్టెపై 60 శాతం స్థలంలో ధూమపానం వల్ల కలిగే నష్టాలపై రేఖా చిత్రాలు, 25 శాతం స్థలంలో హెచ్చరికలను తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది. సిగరెట్ల తయారీ కంపెనీలు ప్యాకెట్లపై దీనికి అనుగుణంగా మార్పులు చేసేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు గడువు ఇవ్వనున్నారు.