breaking news
leader of the Congress
-
కాంగ్రెస్‌కు రాంబాబు రాంరాం
జీహెచ్ఎంసీ ఫ్లోర్‌లీడర్, పార్టీ పదవులకు రాజీనామా నేడు బీజేపీలోకి దిడ్డి కాచిగూడ: నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బర్కత్‌పురా కార్పొరేటర్ దిడ్డి రాంబాబు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పదవికి, కాంగ్రెస్ పార్టీ పదవులను వదులుకున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ గ్రేటర్ అధ్యక్షులు, మాజీ మంత్రి దానం నాగేందర్‌కు పంపించినట్టు ఆయన విలేకరులకు తెలిపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడి నాయకత్వం పట్ల ఆకర్షితుడినై ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా బీజేపీలో చేరనున్నట్టు రాంబాబు ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా గురువారం నగరానికి వస్తున్న సందర్భంగా సికింద్రాబాద్ ఇంపీరిల్ గార్డెన్లో జరిగే సమావేశంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బి.వెంకట్‌రెడ్డి, జాతీయ, రాష్ట్ర నాయకుల నేతృత్వంలో అమీత్‌షా సమక్షంలో తనతో కలిసి వచ్చే అనుచరులతో బీజేపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. బర్కత్‌పురా నుంచి ర్యాలీగా.. బర్కత్‌పురా లింగంపల్లిలోని కార్పొరేటర్ కార్యాలయం నుంచి సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్ వరకు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు రాంబాబు తెలిపారు. -
ఒక్కొక్కరు వంద మందికి గాలం వేయండి
మంత్రి శివకుమార్ బళ్లారి టౌన్ : ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు వంద మంది బీజేపీ కార్యకర్తలకు గాలం వేసి పార్టీలోకి రప్పించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే.శివకుమార్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని రాఘవ కళామందిరంలో వాల్మీకి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో శ్రీరాములు ఒక్కడే వాల్మీకి నాయకుడు కాదన్నారు. మీరంతా మనసు పెడితే మరో పది మంది లీడర్లను తయారు చేసుకోవచ్చన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్వై. గోపాలకృష్ణ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శ్రీరాములు అభివృద్ధి చేసిన దానిపై తాను చర్చించనని, కానీ తనకు నియోజకవర్గం వద్దని రాజీనామా చేసిన తర్వాత మరలా ఆ పార్టీ తరఫున ఎలా అభ్యర్థిని నిలబెట్టారన్నారు. ఎన్వై.హనుమంతప్ప ఆశీస్సుల వల్లే ఆయన ఈ స్థాయికి ఎదిగారన్నారు. ఒకప్పుడు ఆయనను ఇంటి దేవుడిగా కొలిచి నేడు ఆయనపైనే పోటీ చేసి ఓడించే స్థాయికి ఎదిగారన్నారు. తాను ఈ నియోజకవర్గాన్ని ఎన్నికల జరిగేలోగానే ఖాళీ చేస్తామని శ్రీరాములు వ్యాఖ్యనలు చేయడం తగదన్నారు. తాను బళ్లారిలో ఎన్నికల ముగిసేంత వరకు ఉంటానన్నారు. సీఎం సిద్దరామయ్య సామాజిక న్యాయం, పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాజీవ్ ఆవాస్ పథకం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ. 4 లక్షల వరకు ఇవ్వాలని, అందరికీ స్థలాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇది ఎన్నికల హామీ కాదని తమ ప్రభుత్వ ప్రణాళిక అని చెప్పారు. శ్రీరాములు నాడు బీజేపీ నుంచి స్వాభిమానం దెబ్బతినిందని చెప్పి కొత్త పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పీటీ పరమేశ్వరనాయక్, సినీ నటి శశికుమార్, ఎమ్మెల్యే అనిల్‌లాడ్, తుకారాం, ఉగ్రప్ప, పార్టీ అభ్యర్థి ఎన్వై.గోపాలకృష్ణ, స్థానిక నేతలు బెస్ట్ రామప్ప, నెట్టి కల్లప్ప, రాంప్రసాద్, జేఎస్.ఆంజినేయులు, వీకే.బసప్ప, హగరి వండ్రి తదితరులు పాల్గొన్నారు.