breaking news
laxmi kantha rao
-
ప్రస్తుతానికి 31 జిల్లాలు
-
ప్రస్తుతానికి 31
♦ మంత్రివర్గ భేటీ తర్వాత పూర్తి స్పష్టత ♦ కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ♦ చిన్న జిల్లాలతో మెరుగైన పాలన ♦ పర్యవేక్షణ పెరుగుతుంది, అవినీతి తగ్గుతుంది ♦ ప్రజలకు పథకాలు వేగంగా చేరుతాయి ♦ పెత్తనం పోతోందనే కాంగ్రెస్ నేతల ఆవేదన ♦ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, కర్ణాభరణాలు సమర్పించిన సీఎం దంపతులు సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వేగంగా చేరవేసేందుకే జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి 31 జిల్లాలు అనుకుంటున్నామని, మంత్రివర్గ అత్యవసర సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. జిల్లాల ఏర్పాటు తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు. చిన్న జిల్లాల్లో పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుందని, మంచి పాలన సాగుతుందని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకునేందుకే కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం సీఎం కేసీఆర్ దంపతులు వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 11.7 కిలోల స్వర్ణ కిరీటం, కర్ణాభరణాలు, జటాఝూటాన్ని సమర్పించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘జిల్లాల పునర్విభజనపై ప్రతిపక్షాల నేతలు తెలిసీ తెలియక ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ జిల్లా కావాలి, ఇక్కడ జిల్లా కావాలంటూ ధర్నాలు చేయించారు. ధర్నాలు చేయిస్తున్నది వాళ్లే.. మళ్లీ ఇప్పుడు వద్దంటున్నదీ వాళ్లే. ఏంటో ఇది. మొన్న ఒక కాంగ్రెస్ ఆయన.. తెలంగాణ వచ్చుడే ప్రజల దురదృష్టం. ఇన్ని జిల్లాలు అవసరమా అంటడు. ఇష్టం వచ్చినట్లు గీతలు గీస్తరా అని టీపీసీసీ ప్రెసిడెంట్ అంటడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని, అవగాహనతో మాట్లాడాలె. కొత్త జిల్లాలపై సంవత్సరం క్రితం మంత్రివర్గంలో నిర్ణయించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశాం. తర్వాత కలెక్టర్ల సమావేశం, మంత్రివర్గ ఉపసంఘం, అఖిలపక్షం సమావేశాలు జరిగాయి. కే.కేశవరావు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటై చర్చలు జరిగాయి. తర్వాత నిర్ణయానికి వచ్చినం. దీంట్లో బ్రహ్మ రహస్యం ఏముంది..’ కాంగ్రెస్ వాళ్లది అహంకారం.. ‘‘ఇంతకుముందు వీళ్లు (కాంగ్రెస్) అధికారం లో ఉన్నప్పుడు.. వాళ్ల పెత్తనం, వాళ్ల అహంకా రం, వాళ్ల వ్యవస్థ తప్ప వాళ్లకు ప్రజలు కనబడలేదు. వాళ్లు ఎక్కడుంటే అక్కడికి ప్రజలు రావాలే తప్ప ప్రజలున్న చోటికి వెళదామన్న ఆలోచన రాలేదు. ఎన్టీఆర్ మండల వ్యవస్థ తెచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్లే అడ్డగోలుగా మాట్లాడారు. కానీ ఫలితాలు ఏమిటో చూసి నం. జిల్లాల పునర్విభజనలో ప్రభుత్వ అభిలాష ఏమిటో స్పష్టంగా చెబుతున్నా.. ఒక జిల్లాలో రెండున్నర లక్షల నుంచి 4 లక్షల కుటుంబాలు ఉండాలె. అన్నీ ప్రజలకు తెలి యాలె. అలా ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు. డెన్మార్క్, స్విట్జర్లాండ్ గురించి మనం వార్తలు వింటం. మనం అలా ఎందుకు కాకూడదు. వాళ్ల దగ్గర జనాభా తక్కువ కాబట్టి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తరు. పర్యవేక్షణ ఉండడం వల్లే అది జరుగుతుంది..’’ గందరగోళం ఉండదు.. ‘‘మన దగ్గర ఒక పథకం పెడితే వెంటనే పైరవీకారులు పుట్టుకొస్తరు. కల్యాణలక్ష్మి ఓ మంచి పథకం. దానిని పెట్టగానే పైరవీకారులు వస్తరు. పేదలకు రేషన్‌కార్డు ఇద్దామంటే దొంగలు పుడతరు. ఇలాంటి గందరగోళాలు, అక్రమాలు ఉండవద్దంటే ఒక జిల్లాలో రెండు లక్షల నుంచి నాలుగు లక్షలలోపే కుటుంబాలు ఉండాలి. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక మీరే చూస్తరు. కలెక్టర్లు, మంత్రుల కంప్యూటర్లలో ఆయా జిల్లాలోని ప్రతి కుటుం బం పరిస్థితిని తెలిపే వివరాలు ఉంటయి. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ఉపయోగపడేలా అభివృద్ధి చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది ఇష్టంలేని వాళ్లు, రాజకీయంగా ఆలోచించేవాళ్లు మాత్రమే విమర్శిస్తున్నారు..’’ పర్యవేక్షణ పెరుగుతుంది.. ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కొందరు సన్నాసులు ఇట్లాగే మాట్లాడారు. తెలంగాణ తెస్తనని చెప్పిన.. వంద శాతం తెచ్చిన. జిల్లాలు ఏర్పాటు చేస్తమని ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పినం. దాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నం. అంతిమంగా క్షేత్ర స్థాయిలో పరిపాలన కేంద్రాలు రావాలి, ప్రజలకు మేలు జరగాలి. ఉదాహరణకు వరంగల్ జిల్లాలో ఒక కలెక్టరు ఆలోచించేది ఎలా ఉంటుంది? అదే చోట రేపు నలుగురో, ఐదుగురో ఆలోచిస్తే ఎలా ఉంటుంది. అలాగని ఇష్టం వచ్చినట్లు చేయలె. ప్రామాణికంగా పోతున్నాం. ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి.. మధ్యలో దొంగలు, మధ్యవర్తులను నివారించేందుకు, పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్లేందుకు, పర్యవేక్షణ పకడ్బందీగా జరిగేందుకు, అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు ముందుకుపోతున్నం..’’ విమర్శించేందుకు బయలుదేరిండ్రు ‘‘బ్రహ్మాండమైన వర్షాలు పడి రైతులు పండుగ చేసుకుంటున్నరు. చెరువు కట్టలకాడ మేకపోతులు కోసుకుంటున్నరు. రబీలో బ్రహ్మాండమైన పంటలు పండించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో రైతు ఎజెండా ఏంటి? ఇంకొకాయన బయలుదేరిండు. మహాజన పాదయాత్రట. వాళ్లకు తెలంగాణలో తిరిగే అర్హతే లేదు. చివరి నిమిషం దాకా తెలంగాణ ఏర్పాటును కక్షపూరితంగా వ్యతిరేకించిన పార్టీ అది. వారిని ప్రజలు ఎక్కడిక్కడ నిలదీయాలి’’ పనిచేసి చూపిస్తున్నాం.. ‘‘కాంగ్రెస్ పరిపాలనకు, టీఆర్ఎస్ పరిపాలనకు తేడా ఉంటుంది. ఇసుక తవ్వకాలపై కాంగ్రెస్ పాలనలో ఒకసారి రూ.27 కోట్లు వచ్చినయి. ఎన్నికల ముందు ఏడాదిలో కేవలం రూ.5 లక్షలే వచ్చాయి. దీనిపై అసెంబ్లీల కూడా నిలదీసిన. తెలంగాణ వచ్చినంక గతేడాది ఇసుకపై ప్రభుత్వానికి రూ.365 కోట్ల ఆదాయం వచ్చింది. మరిన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఈసారి ఇంకా పెరుగుతుందని గనుల మంత్రి చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే, నిజాయితీ ఉంటే ఇలా జరుగుతుంది..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి మొక్కు చెల్లింపు వివరాలను సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో భద్రకాళి అమ్మవారికి మొక్కుకున్నామని.. తెలంగాణ సిద్ధించడంతో ప్రభుత్వ పక్షాన స్వర్ణ కిరీటం, కర్ణాభరణాలు, జటాఝూటాలు సమర్పించామని తెలిపారు. మూల నక్షత్రం, అమ్మవారి పుట్టినరోజు, మంచి రోజని పండితులు నిర్ణయిస్తే మొక్కు తీర్చుకున్నామన్నారు. ‘‘కిరీటం పెట్టిన తర్వాత, ఆభరణాలు అలంకరణ చేసిన తర్వాత చూస్తే.. అమ్మవారి ప్రభ ఊహించనంత అద్భుతంగా ఉంది. వరంగల్‌లో బతుకమ్మ పండుగ కూడా గొప్పగా జరిగింది. బతుకమ్మ, దసరా పండుగలు, కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అమ్మవారి దయతో తెలంగాణకు అన్ని రకాలుగా లాభం జరగాలని, బంగారు తెలంగాణ దిశగా సాగాలని కోరుకుంటున్నా..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిదానికి అడ్డమే.. ‘‘కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు. మీలో మీకు వైరుధ్యాలు.. ఒకరు వనపర్తి కావాలంటే, మరొకరు గద్వాల అన్నరు. ఏం చేస్తరని జూసిన్రు. మేం కుటుంబాల సం ఖ్య లెక్కదీసి వనపర్తి, గద్వాల రెండు జిల్లాలు చేసినం. దాం తోటి వాళ్లకు కళ్లు బైర్లు కమ్మినయి. మేం ఏం జేస్తమన్నా వద్దం టరు. కళాభారతి, సచివాలయం, శాసనసభ.. ఏది కడదామ న్నా వద్దంటరు. చారిత్రక నగరం వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం మీరు ఎందుకు కట్టలేదు. సచివాలయంలో మంత్రులు సమావేశమైతే భోజనం చేసే స్థలం లేదు. సీఎం ఆఫీసుకు పోవాలంటే పాము మెలికలు తిరగాలె. 60 ఏళ్ల పాలనలో మీరు నాశనం చేసిన్రు. మీకు చేతగాక.. ఇప్పుడు మమ్మల్ని చేయొద్దని అంటరు. మంచి సలహాలు ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉంటం. జిల్లాల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది..’’ వరంగల్‌కు రూ. 1000 కోట్లు చారిత్రక వరంగల్ నగరం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.300 కోట్లు కేటాయించామని.. మొత్తంగా వెయ్యి కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్థానిక వనరులు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ పథకాల కింద వచ్చే నిధులన్నీ కలిపి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించామన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఉప ముఖ్యమంత్రి, స్పీకర్, నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమావేశమై మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తారని చెప్పారు. టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. -
డీఎస్, కెప్టెన్ ఏకగ్రీవం!
రాజ్యసభకు మంగళవారం నామినేషన్లు వేసిన నేతలు అభ్యర్థుల వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి ఎన్నికపై అధికారిక ప్రకటనే తరువాయి సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో రెండు స్థానాలకు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులుగా ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), కెప్టెన్ లక్ష్మీకాంతరావులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంట రాగా ఉదయం 11.55 నిమిషాలకు వారు నామినేషన్ పత్రాలను శాసనసభా కార్యదర్శి, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ సదారాంకు సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం రెండు స్థానాలకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో డీఎస్, కెప్టెన్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం చివరి రోజు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక డీఎస్, కెప్టెన్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా: డీఎస్ సీఎం కేసీఆర్ అనుగ్రహంతోనే తనకు రాజ్యసభ అవకాశం దక్కిందని.. ఈ పదవిని అదృష్టంగా భావిస్తున్నానని డీఎస్ పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మరో అభ్యర్ధి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌లతో కసి అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిస్వార్థంగా టీఆర్ఎస్లో చేరానని డీఎస్ తెలిపారు. ఎవరు ఎక్కడ ఉండాలో కేసీఆర్‌కు బాగా తెలుసని... ఢిల్లీలో తనకున్న పరిచయాలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను, కేసీఆర్ అనేక విషయాలు చర్చించుకున్నామని, తమ మధ్య మంచి అవగాహన ఉండేదని, చాలా విషయాల్లో సమన్వయంతో పనిచేశామని డీఎస్ వివరించారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సాధించిన కేసీఆర్ బంగారు తెలంగాణకు అర్థం చెప్పారని, ఆయన అంచనాల మేరకు పనిచేస్తానన్నారు. వచ్చే మూడేళ్లలో 80 శాతం ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. వివిధ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, కార్పొరేషన్ల ఎన్నికలతో టీఆర్ఎస్ బలం మరింత పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడం తన అదృష్టమన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నిధులు, నీళ్లు, నియామకాల కోసమని, తెలంగాణ ఉద్యమ ఫలితంగానే తాను రాజ్యసభకు వెళ్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌ను నమ్ముతున్నారని డీఎస్ వివరించారు. ఇది చేతల ప్రభుత్వం: కెప్టెన్ రాష్ట్రంలో ఉన్నది చేతల ప్రభుత్వమని మరో అభ్యర్ధి కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. ఉద్యమ సమయం నుంచే కేసీఆర్‌తో కలసి పనిచేశానని, ఎన్నికల హామీలను కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తానని, కేసీఆర్ చేపడుతున్న పథకాలకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్‌తో కలసి నడుస్తానన్నారు. సమర్థులు, అనుభవజ్ఞులకే సీట్లు దక్కాయి: నాయిని, ఈటల సమర్థులకే రెండు రాజ్యసభ సీట్లు దక్కాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎస్, కెప్టెన్లు బాగా పనిచేస్తారని ఆశిస్తున్నానన్నారు. అనుభవం ఉన్న నాయకులకే అవకాశం దక్కిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలన్నీ నిజమవుతున్నాయని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామన్నారు. తెలంగాణలో సీనియర్లకే అవకాశం దక్కిందని, వారి అనుభవం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగ పడుతుందని కరీంనగర్ ఎంపీ బి. వినోద్‌కుమార్ అన్నారు. ఏపీలో టీడీపీ వ్యాపారవేత్తలకు రాజ్యసభ టికెట్లు ఇచ్చిందని, తెలంగాణలో మాత్రం ఉద్యమకారులను రాజ్యసభకు పంపుతున్నామని, ఇదే టీడీపీకి, టీఆర్ఎస్కు ఉన్న తేడా అని చెప్పారు. డీఎస్, కెప్టెన్లకు ఢిల్లీలో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆంధ్రా మూలాలున్న టీడీపీ తెలంగాణలో అంతర్ధానం కావాల్సిందేనన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, జోగు రామన్న, చందూలాల్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.