breaking news
lawyer Royal murder case
-
జిల్లా కోర్టు వద్ద హైడ్రామా
ఏలూరు (అర్బన్) : న్యాయవాది రాయల్ హత్యకేసులో నిందితులు జిల్లా కోర్టులో లొంగిపోనున్నారనే ప్రచారం గురువారం జోరుగా సాగింది. రోజంతా హైడ్రామా నడిచింది. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిందితులెవరో తెలిసినప్పటికీ వారిని అదుపులోకి తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. నిందితులకు కోర్టులో లొంగిపోయే అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో ఉదయం నుంచే కోర్టు పరిసరాలతోపాటు న్యాయస్థానానికి వచ్చే అన్ని దారుల్లో నిఘా పెంచారు. గతంలో కొన్ని కేసుల్లో నిందితులు మారువేషాల్లో, న్యాయవాదుల అవతారాల్లో, కార్లలో నేరుగా కోర్టు ఆవరణలోకి వచ్చి న్యాయమూర్తి ఎదుట లొంగిపోయిన ఘటనలు ఉన్న నేపథ్యంలో పోలీసులు వాటిని పరిగణనలోకి తీసుకుని నిఘా ఏర్పాటు చేశారు. గురువారం కోర్టు వేళలు ముగిసే సమయానికి కూడా నిందితులు రాకపోవడంతో వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కోర్టుకు మూడు రోజులు సెలవు శుక్రవారం ఉగాది, ఆపై రెండో శనివారం, ఆదివారం కావడంతో జిల్లా కోర్టుకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాయల్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభుదాసుతోపాటు మిగతావారు ఈ మూడురోజుల్లో కోర్టులో లొంగిపోయే అవకాశాలు లేవు. దీంతో వారిని ఎలాగైనా ఈలోగానే పట్టుకోవాలని పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులు లొంగిపోక ముందే అరెస్టు చేసి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిందితుల స్నేహితులు, బంధువులను ఆరా తీయడం ద్వారా త్వరగా పట్టుకోవచ్చనే అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరిపై నిఘా కూడా పెట్టినట్టు సమాచారం. విచారణాధికారిగా సీసీఎస్ డీఎస్పీ తోట! రాయల్ హత్యకేసులో విచారణాధికారిని మారుస్తూ పోలీసు అధికారులు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులెవరో తెలిసినా.. ప్రస్తుతం విచారణాధికారిగా ఉన్న టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్ వారిని అదుపులోకి తీసుకోవడంలో పురోగతి సాధించ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సీసీఎస్ డీఎస్పీ తోట సత్యనారాయణను విచారణాధికారిగా నియమించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిందితులకు సహాయ నిరాకరణ ఏలూరు (సెంట్రల్) : న్యాయవాది రాయల్‌ను అతి దారుణంగా హత్య చేసిన నిందితుల తరఫున బెయిల్ పిటీషన్లు వేయడం కానీ, వారికి న్యాయ సలహాలు ఇవ్వడం గానీ చేయకూడదని జిల్లా కోర్టు లోని న్యాయవాదులు తీర్మానం చేశారు. గురువారం బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో న్యాయవాది ఎన్.కృష్ణారావు అధ్యక్షతన రాయల్ సంతాప సభ ఏర్పాటు చేశారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రముఖ న్యాయవాది రోనాల్డ్ రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రాయల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. న్యాయవాది మంచినపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ నిందితులకు శిక్షపడే వరకూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బినేని విజయ్‌కుమార్, జనరల్ సెక్రటరీ సీహెచ్ రాజేంద్రప్రసాద్, సీనియర్ న్యాయవాది కానాల రామకృష్ణ, గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
సూత్రధారులు ఎవరు!
న్యాయవాది రాయల్ హత్య కేసులో పాత్రధారుల్ని మాత్రమే గుర్తించిన పోలీసులు అసలు నిందితులను అరెస్ట్ చేయగలరా ! సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరం.. జనంతో కిటకిటలాడే రోడ్డు పక్కనే ఓ దుకాణం.. మిట్టమధ్యాహ్నం ఒంటిగంట సమయం.. అప్పుడే ఆ షాపులోకి వెళ్లిన న్యాయవాది, హేలాపురి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు పీడీఆర్ రాయల్‌ను హంతకులు కిరాతకంగా మట్టుబెట్టారు. నాలుగైదు నిమిషాల వ్యవధిలోనే గొంతుకోసి కత్తిగాట్లతో శరీరాన్ని ఛిద్రం చేసేశారు. సోమవారం మధ్యాహ్నం వేళ అత్యంత పాశవికంగా జరిగిన హత్యతో ఏలూరు నగరం, ముఖ్యంగా వన్‌టౌన్ ప్రాంతం అట్టుడికిపోయింది. మునుపెన్నడూ ఎరుగని విధంగా పట్టపగలు చోటుచేసుకున్న ఈ కిరాతక ఘటన నగరంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయనే దానికి అద్దం పట్టింది. ఘటనా స్థలానికి పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా.. హంతకులు లెక్కలేని విధంగా దారుణహత్యకు ఒడిగట్టారంటే నేరస్తులకు పోలీసులంటే ఏ మాత్రం భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. దారుణ హత్య వెనుక.. ఘటనా స్థలంలోనే ఉన్న షాపు యజమాని నరహరిశెట్టి భాస్కరరావు ఎంతో ధైర్యం చేసి నిందితుల్లో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా, ఆ యువకుడి నుంచి వివరాలు రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఆ యువకుడి నేపథ్యం, పోలీసులు ప్రాథమికంగా నిర్థారించిన మిగిలిన నిందితుల వివరాలు పరిశీలిస్తే.. వారేం కరడుగట్టిన నేరస్తులేం కాదు. ఓ సినీనటుడి అభిమాన సంఘం తరఫున హల్చల్ చేయడం, పూటుగా మద్యం సేవించడం, చిన్నపాటి గొడవలకు దిగడం మినహా ఇంత దారుణమైన హత్యలు చేసిన నేపథ్యం వారికి లేదు. పైగా పట్టుబడిన యువకుడితోపాటు మిగిలిన నిందితులకు రాయల్‌తో ప్రత్యక్షంగా పగ, ప్రతీకారాలు లేవు. న్యాయవాద వృత్తి చేపట్టి.. వివాదాస్పద కేసులు వాదించడంతోపాటు కొన్నింటిని తనస్థాయిలో పరిష్కరించడంలో ముందుండే రాయల్‌తో చిన్నపాటి మనస్పర్థలు ఉన్నాయనకునున్నా హత్యకు పాల్పడేంతటి కక్షలు లేవు. అలాంటిది న్యాయవాదిని మట్టుబెట్టాల్సిన అవసరం వీరికేమొచ్చిందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. పైగా, నగరంలో పేరుమోసిన న్యాయవాదిగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండే రాయల్‌ను ఏ ప్రయోజనం ఆశించి హత్య చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎవరున్నారు? హత్యాసంస్కృతి, దారుణమైన నేరచరిత్ర తెలియని నలుగురు యువకులు ఓ న్యాయవాదిని పట్టపగలు కత్తులతో నరికేశారంటే కచ్చితంగా దీని వెనుక ఎవరో ఉన్నారనేది పోలీసుల భావన. వాస్తవానికి ఆ కోణంలోనే కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు వాస్తవాలను బయటకు తీసుకువస్తారా.. లేదా నిజాలు తెలిసినా సూత్రధారులతో ఎందుకని పాత్రధారుల అరెస్ట్ చూపి కేసును నిర్వీర్యం చేసేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిర్లక్ష్యమా.. భయపెట్టేందుకా? రాయల్‌ను హత్యే చేయాలనుకుంటే రాత్రివేళల్లో సైతం టూ వీలర్‌పై ఒంటరిగా తిరిగే ఆయన ఎప్పుడైనా చిక్కే అవకాశముంది. కానీ రద్దీగా ఉండే ప్రాంతంలో.. మిట్టమధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌కు దగ్గరలో ఓ షాపులో కూర్చున్న ఆయనను కిరాతకంగా చంపేశారంటే హంతకులు, సూత్రధారుల పన్నాగం ఏమై ఉంటుందనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. పెద్దల అండ ఉంది కాబట్టి ఏమీ కాదనే ఉద్దేశంతోనే నిందితులు ఇలా బరితెగించిరా లేక దారుణ హత్యతో కలకలం సృష్టించి నగరంలో తామంటే ఓ భయం వాతావరణం కల్పించేందుకే ఈ పథకం పన్నారా అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. నోరు మెదపని కాపు నేతలు నగరంలో పేరుమోసిన న్యాయవాదిగానే కాకుండా హేలాపురి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రాయల్ దారుణ హత్యకు బలైతే ఒక్క కాపు నాయకుడు కూడా పరామర్శించేందుకు, హత్యను ఖండించేందుకు ముందుకు రాలేదు. వన్‌టౌన్ ఏరియాకు చెందిన ప్రజలు, వ్యాపారులు, రాయల్ హత్యను ఖండించడంతోపాటు మంగళవారం జరిగిన ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కానీ సామాజికవర్గ నేతలు మాత్రం కనీసం హత్యను ఖండించేందుకు కూడా సాహసం చేయలేదు. ఇటీవల కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పోరాటం చేపట్టిన సందర్భంలో రాయల్ ముందుకొచ్చి ఏలూరులో ప్రతిరోజూ ఆందోళనలు చేపట్టారు. అటువంటి రాయల్ హత్యకు గురైతే పరామర్శించేందుకు కూడా ఎవరూ ధైర్యం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ పోలీసులేమయ్యారు జిల్లాలో చాలామంది పోలీసులకు శాఖాపరమైన మెమోలు, సస్పెన్షన్లు వచ్చినప్పుడు వారికి న్యాయపరంగా ఎంతో సాయం చేసిన రాయల్ కన్నుమూస్తే ఒక్క పోలీసు కూడా అటు వైపు తొంగిచూడలేదు. నిత్యం పోలీసుల వివాదాలు, పరిష్కారాలతోనే గడిపిన రాయల్ హత్యకు గురైతే పోలీసులు ఎందుకొచ్చిన గొడవని ఆయన హత్య కేసుని సైతం సీరియస్‌గా పట్టించుకోవడం లేదన్న వాదనలు ఉన్నాయి. రాయల్ కేసు ఎటు తిరిగి ఎటొస్తుందోనన్న భయం పోలీసు వర్గాలనూ పట్టుకుందని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాయల్ హత్య కేసు విచారణ పక్కాగా జరుగుతుందా లేదా రెండు మూడురోజులు హడావుడి చేసి ఆ తర్వాత అటకెక్కించేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిందితులు ఎంతటి వారైనా వదలం : ఎస్పీ సాక్షి ప్రతినిధి, ఏలూరు : పీడీఆర్ రాయల్ హత్య కేసులో నిందితులను రెండు, మూడు రోజుల్లోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ చెప్పారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో న్యాయవాదిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనా స్థలంలో పట్టుబడిన నిందితుడిని ప్రశ్నిస్తున్నామని, ఇంకా పక్కా సమాచారం రాలేదని పేర్కొన్నారు. మిగిలిన ముగ్గురు నిందితుల్లో ఒకరు దొరికినా కేసు కొలిక్కి వస్తుందని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. నిందితుల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పెదపాడు, హనుమాన్ జంక్షన్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. రాయల్ హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు.