Laughter of children
-
కిల.. కిలలు సరదాగా నవ్వేద్దాం...
నవ్వు ముందు పుట్టి తర్వాత పిల్లలు పుట్టారట! అందుకే నవ్వులూ పిల్లలూ కవలలు. అల్లరి చేసే పిల్లలకు తుంటరి లీడర్ ‘బుడుగు’. బుడుగంటే అందరికీ దడుపు. అందుకే పిల్లల సమస్యలకు నవ్వుల జవాబులు ఇక్కడ ఇస్తున్నాడు...బుడుగు 2.వోఈ కాలం పిల్లలకు హాస్యసాధనాలు అంటే... మిక్కీమౌస్లాంటి కామిక్స్ మాత్రమే. అందుకే మన పిల్లలను గతకాలంలోకి తీసుకెళ్లి రమణగారి, బాపుగారి బుడుగును పరిచయం చేద్దాం. ఒక్కసారి గనుక పిల్లలకు బుడుగు పరిచయం అయితే... నా సామిరంగ... ఇక చూస్కోండీ... నవ్వులే నవ్వుల్! బుడుగు మాటల్లో నుంచి పుట్టేది కృత్రిమ నవ్వు కాదు. ఎండాకాలంలో వేపగాలిలాంటి సహజమైన నవ్వు. ఆరోగ్యకరమైన అందమైన నవ్వు! ఇప్పుడు మనం బుడుగు దగ్గరకు వెళదామన్నమాట...మన పిల్లలు బుడుగును ఇంటర్వ్యూ చేస్తారన్నమాట...పిల్లలు: నమస్తే బుడుగన్నా....మీ గురించి రెండు ముక్కలు చెప్పండి?బుడుగు: నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. ఇంకో ఇంకో పేరు చిచ్చుల పిడుగు. మా బామ్మ పెట్టిన పేరు... హారి పిడుగు. ఇంకో క్వశ్చన్ అడుగు...పిల్లలు: మీరు కవితలు రాస్తారంట గదా... ఒక చిన్న కవిత చెప్పండి...బుడుగు: అగో మా నాన్నమా నాన్నకి నేను కొడుకు మా నాన్న నాకు గొడుగు... వాహ్వా... వాహ్వా!పిల్లలు: మిమ్మల్ని బడిలోకి వేయడానికి చా.....లా పెద్ద కుట్ర జరిగిందని చెబుతుంటారు. విజమేనంటారా?బుడుగు: హండ్రెడ్ పర్సంటు. మా రాధా, గోపాళం, బాబాయి... వీళ్లందరూ నన్ను ఎలాగేనా బళ్లో పెట్టేయాలని చూశారు. బళ్లో పెట్టేస్తే మన తెలివితేటలు అన్నీ పోతాయిట. పోనీ ఏదో ప్పదిరోజులికి ఒకసారి వెళ్లితే చాలదుట. రోఝూ వెళ్లాలిట.ఈ పెద్దవాళ్ళందరూ చిన్నప్పుడు ఇలా కష్టపడినవాళ్లే. అయినా పెద్దయ్యాక ఇప్పుడు చిన్న చిన్న పిల్లలిని బళ్ళో పెఠేస్తున్నారు. నన్ను కూడా బళ్లో పెట్టాలని చాలా కుట్రలు చేశారు.పిల్లలు: మీ తోటి పిల్లలకు ‘బుడుగోపదేశం’ చేశారంట కదా... అంటే?బుడుగు: ‘బుడుగోపదేశం’ అంటే పిల్లలు బడికి వెళ్లకుండా తప్పించుకోవడానికి నేను చెప్పే సలహాలు. చాలా పాపులర్ అయ్యాయి. పరెంగ్జాపుల్... జెరం వచ్చిందని చెప్పాలి. మనం చెప్తే నమ్మరుగదా. అందికని యేం చెయ్యాలంటే, ముందస్తుగా చొక్కా యిప్పేసుకోవాలి. అప్పుడేమో ఎండలో నిలబడాలి చాలాసేపు. అప్పుడు వీపు మీద, పొట్ట మీద జెరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేఠుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాలి.‘అమ్మోయి జెరం జెరం. గబగబా చూడు, బళ్ళోకి వెళ్లద్దని చెప్పూ’ అని చెప్పాలన్నమాట.పిల్లలకు నేను చెప్పిన మరో సలహా కూడా బాగా వర్కవుటు అయింది. రోజూ నీళ్లోసుకోకుండా ఎలా తప్పించుకోవాలో వారికి చెప్పాను.పిల్లలు: ప్లీజ్...మాకు కూడా చెప్పండి...బుడుగు: ఏం చెయ్యాలంటే, నువ్వు రావద్దులే అమ్మా నేనే పోసేసుకుంటాను నీళ్లూ అని చెప్పేసెయ్యాలి ముందస్తుగా. అప్పుడేమో నీళ్లగది తలుపేసేసి, సబ్బుని తడిపి అరగ తీసెయ్యి. కాసేపు ఉత్తినే కూచో. తరువాత కుంచెం నీళ్లు నెత్తి మీద జల్లుకోవాలి. ఏం చేస్తాం మరి. అప్పుడు డేగిసాలో నీళ్లు అన్నీ పారసోసేసి హమ్మయ్య అని ఇంటిలోకి వెళ్లాలి.పిల్లలు: అయిసుఫూట్రు కొనుక్కోవడం గురించి శానా బాగా చెప్పారు... మరోసారి మా కోసం...బుడుగు: ఏమిటంటే ముందస్తుగా అమ్మ చూడకుండా అమ్మే వాడిని పిలిచి అయిసు పూట్రులు రెండు యిమ్మని ఎంగిలి చేసెయాలి. అప్పుడు అమ్మకు చెప్తే ఇంచక్కా కొని పెడుతుంది. -
గురువాణి–1: నిన్ను వెలిగించే దీపం... నవ్వు
‘‘నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్/ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్,/పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు/ విశుద్ధమైన లే/నవ్వులు– సర్వదుఃఖ శమనంబులు, వ్యాథులకున్ మహౌషథుల్’’ మహాకవి గుర్రం జాషువా గారి పద్యం ఇది. ఆయన తేటతెలుగులో అనేక రచనలు చేసారు. ఆయన రచనల్లో అంతర్లీనంగా కులమతాలనే సంకుచిత తత్త్వాన్ని ప్రశ్నించారు. అభ్యుదయ భావాలు కలవారు. ఆయన రచనలు చదువుతుంటే ప్రతిదీ మనకు కళ్లముందు కనిపిస్తుంటుంది. ప్రాతఃస్మరణీయులు. ఆయన కవిత్వం చాలా ఇష్టం. నవ్వవు జంతువుల్...సమస్త ప్రాణికోటిలో ఏ జంతువూ నవ్వదు. మనుష్యులు మాత్రమే నవ్వుతారు. నవరసాలు కళ్ళల్లోంచి ఒలికించినట్లే–మన మానసిక స్థితిని, భావోద్వేగాలను మనం మాటల్లో చెప్పకపోయినా మన నవ్వు చెప్పేస్తుంది. ఎవరయినా ముఖం మాడ్చుకుని దిగాలుగా ఉంటున్నారనుకోండి, ఎవ్వరూ దగ్గరకు వెళ్ళరు, పలకరించరు కూడా. ప్రశాంతం గా, సంతోషంగా ఉన్నవాడి చుట్టూ ఎప్పుడూ పదిమంది ఉంటుంటారు. అసలు నవ్వకుండా బతుకుతున్న వాడి బతుకుకన్నా బరువయినా బతుకు మరొకటి ఉండదు. హాయిగా నవ్వడం, అరమరికలు లేకుండా పకపకా నవ్వడం, సంతోషంగా నవ్వడం, అదీ ఇతరులు బాధపడకుండా నవ్వడం ... ఆ నవ్వు దైవానుగ్రహం. ఎవ్వరిదగ్గరికయినా ఉపకారం ఆశించి వెళ్ళితే వెంటనే వారి ముఖకవళికలు మారిపోతాయి. విచిత్రమైన నవ్వు కనిపిస్తుంది. అడిగిన సహాయం చేస్తారో తెలియదు, చేయరో తెలియదు. అలాటి వారిలో కొన్ని నవ్వులు ఎటూ తేలవు. కొంతమంది నవ్వితే ఓ వారం రోజులు అన్నం సయించదు. మనల్ని అంత క్షోభ పెట్టేటట్లు, బాధపెట్టేటట్లు విషపు నవ్వులు నవ్వుతారు. కొంతమంది ఇతరులు బాధపడితే నవ్వుతారు. బాధితుడిని తన బాధకన్నా ఎదుటివాడి నవ్వు మరింత బాధిస్తుంటుంది. ఎదుటివాడు కష్టంలో ఉన్నట్లు తెలిసి కూడా పిచ్చినవ్వులు నవ్వుతుంటారు కొందరు. ఎవరయినా ఏదయినా సాధిస్తే .. నీ బతుక్కి ఇదెలా సాధ్యం... అన్నట్లు వెకిలినవ్వులు నవ్వుతుంటారు. పువ్వులవోలె ప్రేమరసము వెలిగ్రక్కు విశుద్ధములైన లేనవ్వులు సర్వదుఃఖశమనంబులు... వికసించిన పువ్వులను చూస్తుంటే... మెత్తటి, అతి సున్నితమైన రేకులు, కళ్ళకింపైన రంగులు, మధ్యలో కేసరం, పుప్పొడి, మకరందం, వాటి చుట్టూ తిరిగే తుమ్మెదలు ...మనల్ని కొంచెం సేపు మరిపిస్తుంది, మురిపిస్తుంది... ఇదే అనుభూతి పసిపిల్లల నవ్వుల్లో మనకు కనిపిస్తుంటుంది. ప్రేమగా నవ్వే నవ్వుల్లో కూడా ఈ భావన ఉంటుంది. అవి నిష్కల్మషాలు కాబట్టి వాటి శక్తి ఎక్కువ. మనం ఎంతటి బాధలో ఉన్నా ఆ నవ్వులు మనకు ఉపశమనం కలుగచేస్తాయి. మందుల్లా పనిచేస్తాయి. నవ్వు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. విషపు నవ్వు గుండెల్ని చీలిస్తే, ప్రేమగా నవ్వే ఓ చిర్నవ్వు హృదయాలను పరవశింపచేస్తుంది. చిన్న చిరునవ్వు ఎంత గొప్పదో చెప్పడానికి మూకశంకరులు అమ్మవారి మీద వంద శ్లోకాలుచేస్తూ మందస్మిత శతకం రాసారు. మన విలువను పెంచేది, తెలియని వారికి పరిచయం చేసేది, మనల్ని ప్రపంచానికి దగ్గర చేసేది.. ఓ చిర్నవ్వు...అదెప్పుడూ మన ముఖాన్ని వెలిగిస్తూనే ఉంటుంది, మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తూనే ఉంటుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నవ్వుతూ నిద్దరోవాలి రా తమ్ముడూ!
లెన్స్ లండన్ ఫొటోగ్రాఫర్ శాండి ఫోర్డ్ పేరు గుర్తుకు వస్తే చాలు... గుర్తుకొచ్చేవి పిల్లల నవ్వుల పువ్వులు. వాటి పరిమళానికి ఏది సాటి! న్యూబోర్న్ బేబీస్ను ఫొటోలు తీయడంలో శాండిది పేరు పొందిన చేయి. లండన్లోని ఆమె ‘డే లైట్’ స్టూడియోలో తమ పసిడి నవ్వుల పసిపిల్లల ఫొటోలు తీయించుకోవడానికి తల్లులు అత్యంత ఆసక్తి చూపుతుంటారు. సహజ కాంతిని ఎక్కువగా ఇష్టపడే శాండి, ఫొటోకు సంబంధించిన ఏ చిన్న వివరాన్ని కూడా నిర్లక్ష్యం చేయరు. అనుకున్న ఫొటో అనుకున్నట్లుగా వచ్చేవరకు తీస్తూనే ఉంటారు. శాండికి ముగ్గురు చిన్న పిల్లలు... వాళ్లు ఎప్పుడు నవ్వుతారు? ఎప్పుడు దిగులుగా ఉంటారు? ఎప్పుడు హుషారుగా ఉంటారు?... ఇలాంటి వివరాలన్నీ ఆమెకు కొట్టినపిండి. జస్ట్... ఇటీవలే శాండి తీసిన ఫొటోల తాజాదనపు పరిమళాన్ని ఆస్వాదించండి.


