గురువాణి–1: నిన్ను వెలిగించే దీపం... నవ్వు

Laughter is a god blessing - Sakshi

‘‘నవ్వవు జంతువుల్,  నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్‌/ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్,/పువ్వులవోలె ప్రేమరసమున్‌ వెలిగ్రక్కు/ విశుద్ధమైన లే/నవ్వులు– సర్వదుఃఖ శమనంబులు, వ్యాథులకున్‌ మహౌషథుల్‌’’ మహాకవి గుర్రం జాషువా గారి పద్యం ఇది. ఆయన తేటతెలుగులో అనేక రచనలు చేసారు. ఆయన రచనల్లో అంతర్లీనంగా కులమతాలనే సంకుచిత తత్త్వాన్ని ప్రశ్నించారు. అభ్యుదయ భావాలు కలవారు. ఆయన రచనలు చదువుతుంటే ప్రతిదీ మనకు కళ్లముందు కనిపిస్తుంటుంది. ప్రాతఃస్మరణీయులు. ఆయన కవిత్వం చాలా ఇష్టం.

నవ్వవు జంతువుల్‌...సమస్త ప్రాణికోటిలో ఏ జంతువూ నవ్వదు. మనుష్యులు మాత్రమే నవ్వుతారు. నవరసాలు కళ్ళల్లోంచి ఒలికించినట్లే–మన మానసిక స్థితిని, భావోద్వేగాలను మనం మాటల్లో చెప్పకపోయినా మన నవ్వు చెప్పేస్తుంది. ఎవరయినా ముఖం మాడ్చుకుని దిగాలుగా ఉంటున్నారనుకోండి, ఎవ్వరూ దగ్గరకు వెళ్ళరు, పలకరించరు కూడా. ప్రశాంతం గా, సంతోషంగా ఉన్నవాడి చుట్టూ ఎప్పుడూ పదిమంది ఉంటుంటారు. అసలు నవ్వకుండా బతుకుతున్న వాడి బతుకుకన్నా బరువయినా బతుకు మరొకటి ఉండదు.

హాయిగా నవ్వడం, అరమరికలు లేకుండా పకపకా నవ్వడం, సంతోషంగా నవ్వడం, అదీ ఇతరులు బాధపడకుండా నవ్వడం ... ఆ నవ్వు దైవానుగ్రహం. ఎవ్వరిదగ్గరికయినా ఉపకారం ఆశించి వెళ్ళితే వెంటనే వారి ముఖకవళికలు మారిపోతాయి. విచిత్రమైన నవ్వు కనిపిస్తుంది. అడిగిన సహాయం చేస్తారో తెలియదు, చేయరో తెలియదు. అలాటి వారిలో కొన్ని నవ్వులు ఎటూ తేలవు. కొంతమంది నవ్వితే ఓ వారం రోజులు అన్నం సయించదు. మనల్ని అంత క్షోభ పెట్టేటట్లు, బాధపెట్టేటట్లు విషపు నవ్వులు నవ్వుతారు. కొంతమంది ఇతరులు బాధపడితే నవ్వుతారు. బాధితుడిని తన బాధకన్నా ఎదుటివాడి నవ్వు మరింత బాధిస్తుంటుంది. ఎదుటివాడు కష్టంలో ఉన్నట్లు తెలిసి కూడా పిచ్చినవ్వులు నవ్వుతుంటారు కొందరు. ఎవరయినా ఏదయినా సాధిస్తే .. నీ బతుక్కి ఇదెలా సాధ్యం... అన్నట్లు వెకిలినవ్వులు నవ్వుతుంటారు.  

పువ్వులవోలె ప్రేమరసము వెలిగ్రక్కు విశుద్ధములైన లేనవ్వులు సర్వదుఃఖశమనంబులు... వికసించిన పువ్వులను చూస్తుంటే... మెత్తటి, అతి సున్నితమైన రేకులు, కళ్ళకింపైన రంగులు, మధ్యలో కేసరం, పుప్పొడి, మకరందం, వాటి చుట్టూ తిరిగే తుమ్మెదలు ...మనల్ని కొంచెం సేపు మరిపిస్తుంది, మురిపిస్తుంది... ఇదే అనుభూతి పసిపిల్లల నవ్వుల్లో మనకు కనిపిస్తుంటుంది.  ప్రేమగా నవ్వే నవ్వుల్లో కూడా ఈ భావన ఉంటుంది. అవి నిష్కల్మషాలు కాబట్టి వాటి శక్తి ఎక్కువ. మనం ఎంతటి బాధలో ఉన్నా ఆ నవ్వులు మనకు ఉపశమనం కలుగచేస్తాయి. మందుల్లా పనిచేస్తాయి.

నవ్వు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. విషపు నవ్వు గుండెల్ని చీలిస్తే, ప్రేమగా నవ్వే ఓ చిర్నవ్వు హృదయాలను పరవశింపచేస్తుంది. చిన్న చిరునవ్వు ఎంత గొప్పదో చెప్పడానికి మూకశంకరులు అమ్మవారి మీద వంద శ్లోకాలుచేస్తూ మందస్మిత శతకం రాసారు. మన విలువను పెంచేది, తెలియని వారికి పరిచయం చేసేది, మనల్ని ప్రపంచానికి దగ్గర చేసేది.. ఓ చిర్నవ్వు...అదెప్పుడూ మన ముఖాన్ని వెలిగిస్తూనే ఉంటుంది, మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తూనే ఉంటుంది.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top