కిల.. కిలలు సరదాగా నవ్వేద్దాం... | Laughter answers to childrens problems, Laughter Day Special | Sakshi
Sakshi News home page

కిల.. కిలలు సరదాగా నవ్వేద్దాం...

May 3 2026 5:55 AM | Updated on May 3 2026 5:55 AM

Laughter answers to childrens problems, Laughter Day Special

నేడు నవ్వుల దినోత్సవం

నవ్వు ముందు పుట్టి తర్వాత పిల్లలు పుట్టారట! అందుకే నవ్వులూ పిల్లలూ కవలలు. అల్లరి చేసే పిల్లలకు తుంటరి లీడర్‌ ‘బుడుగు’. బుడుగంటే అందరికీ దడుపు. 
అందుకే పిల్లల సమస్యలకు నవ్వుల జవాబులు ఇక్కడ ఇస్తున్నాడు...

బుడుగు 2.వో
ఈ కాలం పిల్లలకు హాస్యసాధనాలు అంటే... మిక్కీమౌస్‌లాంటి కామిక్స్‌ మాత్రమే. అందుకే మన పిల్లలను గతకాలంలోకి తీసుకెళ్లి రమణగారి, బాపుగారి బుడుగును పరిచయం చేద్దాం. ఒక్కసారి గనుక పిల్లలకు బుడుగు పరిచయం అయితే... నా సామిరంగ... ఇక చూస్కోండీ... నవ్వులే నవ్వుల్‌! బుడుగు మాటల్లో నుంచి పుట్టేది కృత్రిమ నవ్వు కాదు. ఎండాకాలంలో వేపగాలిలాంటి సహజమైన నవ్వు. ఆరోగ్యకరమైన అందమైన నవ్వు! ఇప్పుడు మనం బుడుగు దగ్గరకు వెళదామన్నమాట...మన పిల్లలు బుడుగును ఇంటర్వ్యూ చేస్తారన్నమాట...

పిల్లలు: నమస్తే బుడుగన్నా....మీ గురించి రెండు ముక్కలు చెప్పండి?
బుడుగు: నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. ఇంకో ఇంకో పేరు చిచ్చుల పిడుగు. మా బామ్మ పెట్టిన పేరు... హారి పిడుగు. ఇంకో క్వశ్చన్‌ అడుగు...

పిల్లలు: మీరు కవితలు రాస్తారంట గదా... ఒక చిన్న కవిత చెప్పండి...
బుడుగు:   అగో మా నాన్నమా నాన్నకి నేను కొడుకు మా నాన్న నాకు గొడుగు... వాహ్వా... వాహ్వా!

పిల్లలు: మిమ్మల్ని బడిలోకి వేయడానికి చా.....లా పెద్ద కుట్ర జరిగిందని చెబుతుంటారు. విజమేనంటారా?
బుడుగు: హండ్రెడ్‌ పర్సంటు. మా రాధా, గోపాళం, బాబాయి... వీళ్లందరూ నన్ను ఎలాగేనా బళ్లో పెట్టేయాలని చూశారు. బళ్లో పెట్టేస్తే మన తెలివితేటలు అన్నీ పోతాయిట. పోనీ ఏదో ప్పదిరోజులికి ఒకసారి వెళ్లితే చాలదుట. రోఝూ వెళ్లాలిట.
ఈ పెద్దవాళ్ళందరూ చిన్నప్పుడు ఇలా కష్టపడినవాళ్లే. అయినా పెద్దయ్యాక ఇప్పుడు చిన్న చిన్న పిల్లలిని బళ్ళో పెఠేస్తున్నారు. నన్ను కూడా బళ్లో పెట్టాలని చాలా కుట్రలు చేశారు.

పిల్లలు: మీ తోటి పిల్లలకు ‘బుడుగోపదేశం’ చేశారంట కదా... అంటే?
బుడుగు: ‘బుడుగోపదేశం’ అంటే పిల్లలు బడికి వెళ్లకుండా తప్పించుకోవడానికి నేను చెప్పే సలహాలు. చాలా పాపులర్‌ అయ్యాయి. పరెంగ్జాపుల్‌... జెరం వచ్చిందని చెప్పాలి. మనం చెప్తే నమ్మరుగదా. అందికని యేం చెయ్యాలంటే, ముందస్తుగా చొక్కా యిప్పేసుకోవాలి. అప్పుడేమో ఎండలో నిలబడాలి చాలాసేపు. అప్పుడు వీపు మీద, పొట్ట మీద జెరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేఠుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాలి.
‘అమ్మోయి జెరం జెరం. గబగబా చూడు, బళ్ళోకి వెళ్లద్దని చెప్పూ’ అని చెప్పాలన్నమాట.
పిల్లలకు నేను చెప్పిన మరో సలహా కూడా బాగా వర్కవుటు అయింది. రోజూ నీళ్లోసుకోకుండా ఎలా తప్పించుకోవాలో వారికి చెప్పాను.

పిల్లలు: ప్లీజ్‌...మాకు కూడా చెప్పండి...
బుడుగు: ఏం చెయ్యాలంటే, నువ్వు రావద్దులే అమ్మా నేనే పోసేసుకుంటాను నీళ్లూ అని చెప్పేసెయ్యాలి ముందస్తుగా. అప్పుడేమో నీళ్లగది తలుపేసేసి, సబ్బుని తడిపి అరగ తీసెయ్యి. కాసేపు ఉత్తినే కూచో. తరువాత కుంచెం నీళ్లు నెత్తి మీద జల్లుకోవాలి. ఏం చేస్తాం మరి. అప్పుడు డేగిసాలో నీళ్లు అన్నీ పారసోసేసి హమ్మయ్య అని ఇంటిలోకి వెళ్లాలి.

పిల్లలు: అయిసుఫూట్రు కొనుక్కోవడం గురించి శానా బాగా చెప్పారు... మరోసారి మా కోసం...
బుడుగు: ఏమిటంటే ముందస్తుగా అమ్మ చూడకుండా అమ్మే వాడిని పిలిచి అయిసు పూట్రులు రెండు యిమ్మని ఎంగిలి చేసెయాలి. అప్పుడు అమ్మకు చెప్తే ఇంచక్కా కొని పెడుతుంది.     

Advertisement
 
Advertisement
Advertisement