breaking news
land grabing
-
పేట్బషీరాబాద్లో రూ.కోట్ల విలువైన భూమికి రెక్కలు
జాతీయ రహదారికి దగ్గరలో ఉంది. ఇక్కడ గజం స్థలం విలువ లక్ష రూపాయల పైమాటే. ఇంకేముంది రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టడం.. నోటరీలు అడ్డుపెట్టుకుని విద్యుత్ మీటర్లు తెచ్చుకోవడం..రెవెన్యూ అధికారులు కూల్చివేతకు వస్తే ‘చేతులు తడిపి’ వెళ్లగొట్టడం షరా మామూలుగా మారింది. ఈ కోవలోనే సుమారు రూ.200 కోట్ల విలువ చేసే 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం కబ్జాకు గురయ్యింది. కబ్జా వాస్తవమేనని నిర్ధారణకు వచ్చినప్పటికీ కోర్టు కేసులు ఉన్నాయంటూ వాటిని రెవెన్యూ యంత్రాంగం తొలగించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2 ఆక్రమణలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2లలో 57.38 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ గజం ఏకంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతుంది. ఈ స్థలంపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కబ్జాదారులకు కలిసి వచ్చింది. రాత్రికి రాత్రి బేస్మెంట్లు, గదులు, షెడ్ల నిర్మాణం చేస్తూ కబ్జాకు తెర లేపారు. ఈ క్రమంలో సుమారు 8.06 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించగా తేలింది. అయితే వాటిని తొలగించాల్సిన అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి కబ్జాదారులు కోర్టుకు వెళ్లే విధంగా సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అక్కడ నిర్మాణం చేపట్టిన వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని కూల్చివేతల జోలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. దేవుడు వరమిచ్చినా... 2008 మార్చి 25వ తేదీన జీఓ నంబర్ 424 ద్వారా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేట్‌బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2లలో మొత్తం 38 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ఎన్నో అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలం విషయంలో 2022 ఆగస్టు 25వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం.. సదరు స్థలాన్ని జర్నలిస్టులకు అప్పగించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మండల రెవెన్యూ అధికారులు అది తమ పరిధి కాదు అన్నట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలపై జర్నలిస్టు ప్రతినిధులు మండల రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు రూపంలో అందజేశారు. కాగా మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లారే తప్ప అక్రమ నిర్మాణాలను చూసి కూల్చివేయకుండా వదిలివేయడం గమనార్హం. ఐదెకరాల స్థలంపై ఆధిపత్యం... ప్రభుత్వ స్థలంపై ఓ వ్యక్తి మాజీ నక్సలైట్‌ని అంటూ కబ్జాకు దిగాడు. అప్పట్లో 60 గజాల్లో ఓ గది నిర్మించుకుని ఉంటూ వచ్చిన అతగాడు ఏకంగా 5 ఎకరాల స్థలం నాదే అంటూ.. ఇప్పుడు అధికారులకే సవాలు విసురుతున్నాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలం ప్రభుత్వానిది. గతంలో పలు పర్యాయాలు చుట్టూ కంచె వేస్తే రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇలా పలు పర్యాయాలు తొలగించినా.. తిరిగి అదే స్థలంలో కంచె ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తోంది. అంతేకాకుండా ఇక్కడ విద్యుత్ మీటర్లు చెట్లకు ఉంటాయి. ముందస్తుగా పథకం ప్రకారం పదులకొద్దీ మీటర్లను తీసుకుని గదులు నిర్మించే లోపు రెవెన్యూ అధికారులు గుర్తిస్తారని తీసుకున్న మీటర్లు చెట్లకు వేలాడుతుండటం విశేషం. ఈ విషయమై ఆర్ఐ రేణుకను సాక్షి వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. (క్లిక్: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది!) -
ప్రభుత్వ జాగా..వేసేయ్ పాగా
►రూ.10 కోట్ల స్థలం కబ్జా ►తెలుగు తమ్ముళ్ల అండతో అక్రమనిర్మాణాలు ►పట్టించుకోని మున్సిపల్ అధికారులు కావలి : టీడీపీ నేతల భూకబ్జాలకు అంతేలేకుండా పోతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే పాగా వేసేస్తున్నారు. అధికారం అండదండలతో విలువైన స్థలాలను ఆక్రమించుకుంటూ పోతున్నారు. తాజాగా కావలి మున్సిపాలిటీ పరిధిలో సుమారురూ.10 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు గురైంది. తెలుగు తమ్ముళ్ల అండతో ఆక్రమణదారులు భవంతులు, షెడ్లు నిర్మించుకుంటున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందినా నోరు మెదపటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని 19వ వార్డు పరిధిలోని వెంగళరావునగర్ వాటర్‌ట్యాంక్ కోసం 2048 సర్వే నంబర్లో సుమారు 4 ఎకరాల వరకు స్థలం ఉంది. పట్టణం విస్తరిస్తుండటంతో ముందుచూపుతో ఈ స్థలాన్ని వాటర్‌ట్యాంకు నిర్మాణం కోసం కేటాయించినట్లు తెలిసింది. అయితే ఈ స్థలం అధికార పార్టీ అండదండలతో ఆక్రమణలకు గురైంది. 2008లో ఇదే స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న అప్పటి మున్సిపల్ కమిషనర్ ఆక్రమణలను తొలగించారు. ఆ తరువాత ఆ స్థలంలోకి వెళ్లటానికి ఎవరూ సాహసించలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మున్సిపల్ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. కొంతకాలంగా నిర్మాణాలు జరుగుతున్న విషయాన్ని స్థానికులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఈ ఆక్రమణల విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే అందులోకి వెళ్లటానికి అధికారులు సాహసించడం లేదు. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ కూడా బదిలీ కావడం.. ఆ స్థానాన్ని ప్రభుత్వం భర్తీచేయకపోవడంతో టీడీపీ నేతలు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పార్కుకు సంబంధించిన సుమారు 300 అంకణాల స్థలం ప్రస్తుతం కబ్జాకోరల్లో చిక్కుకుని ఉంది. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో విలువైన స్థలాలు అక్రమార్కుల చెరలో చిక్కుకుపోతున్నాయి. ఈ కబ్జాలను ఆపకుంటే ఆ మున్సిపల్ స్థలం పూర్తిస్థాయిలో ఆక్రమణదారుల చెరలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంపై టౌన్‌ప్లానింగ్ అధికారి దఫెయ్యను వివరణ కోరగా.. ఆక్రమణల గురించి తమకూ సమాచారం వచ్చిందని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పలుమార్లు ఫిర్యాదు చేశాం: అక్కడ జరుగుతున్న ఆక్రమణలపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాం. కానీ ఆక్రమణల తొలగింపుపై అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. వెంటనే ఆక్రమణలు తొలగించి మున్సిపల్ స్థలాలను పరిరక్షించాలి. - పందిటి కామరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి.