breaking news
lahore school
-
క్లాసు తుడవలేదని.. పైనుంచి తోసేశారు!
పాఠశాలకు వచ్చేది శుభ్రంగా చదువుకోడానికే గానీ, తరగతి గదులను శుభ్రం చేయడానికి కాదు. ఇదే విషయం చెప్పినందుకు తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థిని మీద టీచర్లకు ఎక్కడలేని కోపం వచ్చింది. వాళ్లు ఆమెను స్కూలు పై అంతస్తు వరకు తీసుకెళ్లి, అక్కడినుంచి కిందకు తోసేశారు. ఈ దారుణ ఘటన పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ఫజ్జర్ నూర్ (14) అనే ఆ బాలిక ప్రస్తుతం లాహోర్ నగరంలోని ఘుర్కి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆమెకు పలు చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో పాటు వెన్నెముక కూడా విరిగిపోయింది తరగతి గదులను ప్రతిరోజూ ఒక్కో విద్యార్థిని శుభ్రం చేయాలి. మే 23న ఫజ్జర్ వంతు వచ్చింది. అయితే, ఆరోజు ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో మరోరోజు ఆ పనిచేస్తానని చెప్పింది. దాంతో టీచర్లు ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లి చెంపల మీద కొట్టారు. తర్వాత ఇద్దరు కలిసి మూడో అంతస్తు పైకి తీసుకెళ్లి, అక్కడ శుభ్రం చేయమన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని మళ్లీ చెప్పగా వాళ్లు తనను మేడ మీద నుంచి తోసేశారని ఫజ్జర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెప్పింది. దాంతో ఇద్దరు టీచర్లు రెహానా కౌసర్, బుష్రా తుఫైల్ అనే ఇద్దరిపై హత్యాయత్నం కేసు పెట్టారు. మే 23వ తేదీనే ఈ ఘటన జరిగినా, దాన్ని స్కూలు యాజమాన్యం దాచిపెట్టిందని పంజాబ్ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అల్లాబక్ష్ మాలిక్ చెప్పారు. ఎట్టకేలకు పోలీసులకు విషయం తెలియడంతో వాళ్లు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడిన ఓ కమిటీని ముఖ్యమంత్రి నియమించారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి తన కూతురిని చూడాలని, ఆమె బాధ తట్టుకోలేకపోతోందని ఫజ్జర్ తల్లి రుఖ్సానా బీబీ అన్నారు. -
బాలుడిపై టీచర్ అత్యాచారం.. స్కూలుపై దాడి
ఎనిమిదేళ్ల అబ్బాయిపై అతడికి పాఠాలు చెప్పే టీచర్ అత్యాచారం చేయడం, ఆ తర్వాత నుంచి ఆ అబ్బాయి అదృశ్యం కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, స్థానికులు ఆ స్కూలు మీద దాడి చేశారు. ఈ ఘటన పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో జరిగింది. స్థానికుల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సదరు టీచర్ అబ్బాయిపై అత్యాచారం చేసిన తర్వాత అక్కడినుంచి పారిపోయాడు. పిల్లాడు కూడా కనిపించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఎక్కువైంది. స్థానికులను తోడు తీసుకుని స్కూలుపై దాడి చేశారు. స్కూలు సెక్యూరిటీ గార్డును కూడా కొట్టి, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా, రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆందోళనకారులు స్కూలుకు నిప్పు పెట్టడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత తీవ్రమైందని, చివరకు పోలీసులు ఎలాగోలా వారిని అదుపు చేశారని స్థానికులు చెప్పారు.