breaking news
Lab testing
-
పాము విషానికి తిరుగులేని విరుగుడు.. మనిషి రక్తం నుంచే..
హీరోకు వాళ్ల నాన్నో, తాతయ్యో చిన్నప్పటి నుంచే కొద్దిపాటి మోతాదులో విషం తినిపిస్తారు. దాంతో పెరిగి పెద్దయ్యాక ఎలాంటి పాము కరిచినా మనవాడికి ఏమీ కాదు. ఈ ఫార్మూలాతో సూపర్‌డూపర్ హిట్టైన సినిమాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికాలోనూ కాలిఫోర్నియాలో ఉండే తిమోతీ ఫ్రైడ్ అనే వ్యక్తి అచ్చం అలాగే చేశాడు. ఒకటీ రెండూ సార్లు కాదు, 18 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 200 సార్లకు పైగా పాములతో కరిపించుకున్నాడు. 700 సార్లకు పైగా పాము విషాన్ని ఒంట్లోకి ఎక్కించుకున్నాడు!.గుర్రం వంటి బలిష్టమైన జంతువులను కూడా ఒకే కాటుకు బలి తీసుకునే 16 ప్రాణాంతక పాము జాతుల విషాలూ వాటిలో ఉన్నాయి. ఫలితంగా తిమోతీ ఎలాంటి పాము కరిచినా ఏమీ కాని స్థితికి చేరుకున్నాడు! మనవాడి రక్తం నుంచి సైంటిస్టులు తాజాగా పాము విషానికి విరుగుడు తయారు చేశారు. ఇప్పటిదాకా తయారైన వాటిల్లోకెల్లా అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్ ఇదేనని చెబుతుండటం విశేషం! దీన్ని పాముకాటు చికిత్సలోనే అత్యంత విప్లవాత్మక మలుపుగా చెబుతున్నారు!!ఇలా చేశారు... బ్లాక్‌మాంబా. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. రాచనాగు, టైగర్ స్నేక్, రాటిల్ స్నేక్ వంటివీ ఈ కోవలోకే వస్తా యి. ఇలాంటి విషపూరిత పాములతో పదేపదే కరిపించుకున్న తిమోతీ గురించి అమెరికాకు చెందిన వ్యాక్సీన్ కంపెనీ సెంటివాక్స్ సీఈఓ జాకబ్ గ్లెన్‌విల్లే 2017లో ఎక్కడో చదివారు. వాటి విషాన్ని వందలాదిసార్లు ఒంట్లోకి ఎక్కించుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. తిమోతీ ట్రక్ మెకానిక్‌గా చేసేవాడు. తర్వాత రకరకాల పాములను గురించి ఆసక్తికరమైన వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. ఆ క్రమంలో ఒకసారి రెండు నాగుపాములు వెంటవెంటనే కరవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు.మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఇలా విషం పుచ్చుకోవడం మొదలుపెట్టాడు. తిమోతీ అంగీకారంతో గ్లెన్‌విల్లే అతని రక్త నమూనాలు సేకరించారు. ఎలాంటి పాము విషాన్నైనా తట్టుకోగలిగే తిరుగులేని యాంటీబాడీలు వాటిలో పుష్కలంగా ఉన్నట్టు తేల్చారు. కొలంబియా వర్సటీకి చెందిన మెడికల్ సైన్సెస్ నిపుణుడు రిచర్డ్ స్టాక్ తదితరుల సాయంతో సైంటిస్టులు ఆ యాంటీబాడీలను సేకరించారు. ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ శ్రమకోర్చి వాటి సాయంతో అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్ ఇంజక్షన్ తయారు చేశారు. దానికి ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 అని పేరు పెట్టారు.ప్రయోగాత్మకంగా బ్లాక్మాంబాతో పాటు 19 అత్యంత విషపూరిత పాముల విషాన్ని ఒక్కొక్కటిగా ఎలుకలకు ఎక్కించి, అనంతరం వాటికి ఈ విరుగుడు ఇచ్చారు. బ్లాక్మాంబాతో పాటు 13 రకాల విషాల బారినుంచి ఎలుకలను ఈ యాంటీ వెనమ్ కాపాడటం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు! ఆరు అత్యంత విషపూరిత పాముల విషాన్ని కలగలిపి ఇచ్చినా అదే ఫలితం వచి్చంది. మిగతా 6 రకాల విషాలకు కూడా ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 పాక్షికంగా విరుగుడుగా పని చేసింది. ఇది ప్రస్తుతానికి ప్రయోగాల దశలోనే ఉన్నట్టు గ్లెన్‌విల్లే చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలను తాజాగా సైంటిఫిక్ జర్నల్ ‘సెల్’లో ప్రచురించారు.శ్రమతో కూడిన ప్రక్రియ యాంటీ వెనమ్ తయారీ ఓ సంక్లిష్ట ప్రక్రియ. పాముల నుంచి సేకరించిన విషయాన్ని చిన్న డోసుల్లో గుర్రాల వంటి జంతువులకు ఎక్కిస్తారు. ఆ విషానికి రోగనిరోధకత సమకూరాక వాటి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలతో విరుగుడు తయారు చేస్తారు. అయితే ఇది శ్రమతో కూడినదే గాక ప్రమాదకరమైన ప్రక్రియ కూడా. చాలాసార్లు సరిగా పని చేయకపోవడంతో పాటు సీరియస్ సైడ్ ఎఫెక్టులు కూడా తలెత్తుతాయి. పాముకాటుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.4 లక్షల మంది బలవుతున్నట్టు అంచనా. 4 లక్షల మంది దాకా వికలాంగులుగా మారుతున్నారు. గ్వాటెమాలా గ్రామాల్లో పెరిగిన గ్లెన్‌విల్లే ఈ సమస్యకు మెరుగైన, శాశ్వత పరిష్కారం కోసం చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అది ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 కాగలదని ఆయన ధీమాగా చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్. -
కనీసం చివరిచూపు చూసుకోనివ్వండి
మాస్కో: రష్యా మారుమూల జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు అలెక్సీ నవాల్నీ పార్థివదేహాన్ని వెంటనే అప్పగించాలని ఆయన తల్లి ఆవేదనతో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చనిపోయాక మృతదేహాన్ని వేరే చోటుకు తరలించామంటూ తల్లి, నవాల్నీ న్యాయవాదులను అటూ ఇటూ తిప్పుతూ అధికారులు తిప్పలు పెడుతున్నారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలు చేయిస్తేగానీ విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలియని పరిస్థితి. అందుకే కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించట్లేరనే వాదన వినిపిస్తోంది. మాస్కోకు 1,900 కిలోమీటర్ల దూరంలోని ఆర్కిటిక్ ధృవ సమీపంలో మంచుమయ మారుమూల కారాగారంలో శుక్రవారం నవాల్నీ మరణించిన విషయం తెల్సిందే. విషయం తెల్సి నవాల్నీ తల్లితో కలిసి న్యాయవాది కిరా యామిష్క్ ఆ జైలుకెళ్లారు. అక్కడ మృతదేహం లేదు. దర్యాప్తులో భాగంగా సలేఖర్డ్ సిటీకి తరలించామని అధికారులు చెప్పారు. తీరా అక్కడి సిటీ మార్చురీకి వెళ్తే మూసేసి ఉంది. ఇక్కడికి తీసుకురాలేదని అక్కడి అధికారులు చెప్పారు. ‘మరణానికి కారణాన్ని రష్యా ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. మృతదేహాన్ని అయినా అప్పగించాలి’ అని లాయర్ డిమాండ్‌చేశారు. -
మందు బిళ్లలు కాదు.. ‘సుద్ద’ బిళ్లలే..
* ఔషధ మూలకాలేవీ లేని 56 రకాల మందులు * కర్నూలులో ఓ వినియోగదారుడి ఫిర్యాదుతో కదిలిన డొంక * సుద్దముక్కలు, కట్‌చేసిన రాళ్లకు అందమైన ప్యాకింగ్ * హైదరాబాద్ ల్యాబ్ పరీక్షల్లో బట్టబయలు * హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘ఓషన్ ఆర్గానిక్స్’ నుంచి దిగుమతి సాక్షి, హైదరాబాద్: డాక్టర్ చీటీ రాయగానే ఎంతో నమ్మకంగా మందులు కొనుక్కుని వేసుకుంటాం. అంతేగానీ అవి అసలైనవేనా.. నకిలీవా.. అనేది పట్టించుకోం. ఇంతకీ మనం మందులు మింగుతున్నామా? వాటి పేరిట ఎందుకూ పనికిరాని సుద్దబిళ్లలు మింగుతున్నామా? ఎందుకంటే.. ఔషధ నియంత్రణ అధికారుల నిర్లక్ష్యంతో నకిలీ మందులు మార్కెట్లోకి విచ్చలవిడిగా ప్రవేశిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. ఒక వినియోగదారుని ఫిర్యాదుపై స్వాధీనం చేసుకున్న కొన్ని రకాల ఔషధాలు పూర్తిగా నకిలీవని తేలడంతో ఔషధ నియంత్రణ అధికారులు నిర్ఘాంత పోయారు. ఒకే కంపెనీకి చెందిన 56 రకాల మందులు పూర్తిగా నకిలీవని పరీక్షల్లో తేలింది. ఇప్పటికే అవి అనేక మందుల షాపుల్లో విరివిగా విక్రయిస్తున్న మందులు కావడం గమనార్హం. ఒంగోలు, కర్నూలు, కడప మందుల షాపుల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుద్ద బిళ్లలే..:ఆ మందుల్లో అస్సలు ఔషధ మూలకాల్లేవు. మొత్తం సుద్ద బిళ్లలు. కట్ చేసిన రాళ్లముక్కలే. వాటిని బ్రహ్మాండంగా ముస్తాబు చేసి మార్కెట్లోకి వదిలారు. కర్నూలులో ఒక వినియోగదారుడి ఫిర్యాదుతో కదిలిన ఔషధ నియంత్రణ అధికారులు ఆ ఔషధాన్ని సీజ్ చేసి పరీక్షించగా పూర్తిగా నకిలీదని తేలింది. దాంతో అనుమానం వచ్చి ఆ కంపెనీకి చెందిన అన్ని రకాల మందులను సీజ్ చేసి హైదరాబాద్‌లోని ఔషధ నియంత్రణ ల్యాబొరేటరీలో పరీక్షించగా భయంగొలిపే వాస్తవాలు బైటపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని రుద్రపూర్‌లో గల ఓషన్ ఆర్గానిక్స్ కంపెనీకి చెందిన ఆ ఔషధాలన్నీ సుద్దముక్కలు, రాతిముక్కలేనని తేలింది. వాటిలో ఒక్కశాతమూ ఔషధ మూల కాలు లేవని ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ ఔషధాల ను ఉత్పత్తి చేసిన కంపెనీపై ‘డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్’ ప్ర కారం కేసులు నమోదుచేశారు. రూ.5 లక్షల పెనాల్టీతో పాటు యజమానికి యావజ్జీవ శిక్ష పడొచ్చని అధికారులు చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నకిలీలు..: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్స్ (ఔషధాల ముడి పదార్ధాలు) ఉత్పత్తి ఎక్కువగా ఉంది గానీ ఫార్ములేషన్ (మందులను మాత్రల రూపంలోకి మార్చడం) డ్రగ్స్ కంపెనీలు చాల తక్కువ. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి.... ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఔషధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. దాదాపు 70శాతం ఔషధాలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, హర్యానా వంటి రాష్ట్రాల్లో డ్రగ్ లెసైన్సులు పొందడం చాలా సులభం. ఒకవేళ నకిలీలతో దొరికిపోయినా అక్కడ శిక్షలు కూడా చాలా స్వల్పంగా ఉంటాయి. దీంతో ఊరూపేరూలేని మందుల కంపెనీలు వందల్లో పుట్టుకొస్తుంటాయి. అవి తయారు చేసే మందులన్నీ దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అప్పుడప్పుడు ల్యాబ్‌లలో ఈ ఔషధాల బండారం బైటపడుతోంది కానీ అవి నాసిరకం అని తేలినా ఆ కంపెనీకి నోటీసులు మాత్రమే ఇచ్చి ఊరుకుంటున్నారు. తాజాగా నకిలీ ఔషధాలు కలకలం సృష్టించడంతో ఔషధ నియంత్రణ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వాసుపత్రులకు ఏటా రూ.200 కోట్లతో ఔషధాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రులలో సరఫరా కోసం ఏటా రూ.200 కోట్లతో ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. యాంటీబయాటిక్స్ వీటికి అదనం. ఇందులో 70 శాతం అంటే రూ.140 కోట్ల విలువైన మందులు ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే ఉంటున్నాయి. అంటే కేవలం 30శాతం (అంటే రూ.60 కోట్లు) మాత్రమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తయారైన మందులు సరఫరా అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు ఇస్తున్న మందుల్లో 70శాతం మందులు నకిలీవి ఉండే అవకాశం ఉందన్నమాట. మన ప్రజారోగ్య వ్యవస్థ ఏ మేరకు నాశనమైపోయిందో అర్ధం చేసుకోవచ్చు.