పాము విషానికి తిరుగులేని విరుగుడు.. మనిషి రక్తం నుంచే.. | Snake antivenom developed using man blood from US | Sakshi
Sakshi News home page

పాము విషానికి తిరుగులేని విరుగుడు.. మనిషి రక్తం నుంచే..

May 4 2025 7:45 AM | Updated on May 4 2025 11:06 AM

Snake antivenom developed using man blood from US

హీరోకు వాళ్ల నాన్నో, తాతయ్యో చిన్నప్పటి నుంచే కొద్దిపాటి మోతాదులో విషం తినిపిస్తారు. దాంతో పెరిగి పెద్దయ్యాక ఎలాంటి పాము కరిచినా మనవాడికి ఏమీ కాదు. ఈ ఫార్మూలాతో సూపర్‌డూపర్‌ హిట్టైన సినిమాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికాలోనూ కాలిఫోర్నియాలో ఉండే తిమోతీ ఫ్రైడ్‌ అనే వ్యక్తి అచ్చం అలాగే చేశాడు. ఒకటీ రెండూ సార్లు కాదు, 18 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 200 సార్లకు పైగా పాములతో కరిపించుకున్నాడు. 700 సార్లకు పైగా పాము విషాన్ని ఒంట్లోకి ఎక్కించుకున్నాడు!.

గుర్రం వంటి బలిష్టమైన జంతువులను కూడా ఒకే కాటుకు బలి తీసుకునే 16 ప్రాణాంతక పాము జాతుల విషాలూ వాటిలో ఉన్నాయి. ఫలితంగా తిమోతీ ఎలాంటి పాము కరిచినా ఏమీ కాని స్థితికి చేరుకున్నాడు! మనవాడి రక్తం నుంచి సైంటిస్టులు తాజాగా పాము విషానికి విరుగుడు తయారు చేశారు. ఇప్పటిదాకా తయారైన వాటిల్లోకెల్లా అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్‌ ఇదేనని చెబుతుండటం విశేషం! దీన్ని పాముకాటు చికిత్సలోనే అత్యంత విప్లవాత్మక మలుపుగా చెబుతున్నారు!!

ఇలా చేశారు... 
బ్లాక్‌మాంబా. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. రాచనాగు, టైగర్‌ స్నేక్, రాటిల్‌ స్నేక్‌ వంటివీ ఈ కోవలోకే వస్తా యి. ఇలాంటి విషపూరిత పాములతో పదేపదే కరిపించుకున్న తిమోతీ గురించి అమెరికాకు చెందిన వ్యాక్సీన్‌ కంపెనీ సెంటివాక్స్‌ సీఈఓ జాకబ్‌ గ్లెన్‌విల్లే 2017లో ఎక్కడో చదివారు. వాటి విషాన్ని వందలాదిసార్లు ఒంట్లోకి ఎక్కించుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. తిమోతీ ట్రక్‌ మెకానిక్‌గా చేసేవాడు. తర్వాత రకరకాల పాములను గురించి ఆసక్తికరమైన వీడియోలు చేసి ఫేమస్‌ అయ్యాడు. ఆ క్రమంలో ఒకసారి రెండు నాగుపాములు వెంటవెంటనే కరవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు.

మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఇలా విషం పుచ్చుకోవడం మొదలుపెట్టాడు. తిమోతీ అంగీకారంతో గ్లెన్‌విల్లే అతని రక్త నమూనాలు సేకరించారు. ఎలాంటి పాము విషాన్నైనా తట్టుకోగలిగే తిరుగులేని యాంటీబాడీలు వాటిలో పుష్కలంగా ఉన్నట్టు తేల్చారు. కొలంబియా వర్సటీకి చెందిన మెడికల్‌ సైన్సెస్‌ నిపుణుడు రిచర్డ్‌ స్టాక్‌ తదితరుల సాయంతో సైంటిస్టులు ఆ యాంటీబాడీలను సేకరించారు. ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ శ్రమకోర్చి వాటి సాయంతో అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్‌ ఇంజక్షన్‌ తయారు చేశారు. దానికి ఎల్‌ఎన్‌ఎక్స్‌–డీ09 అని పేరు పెట్టారు.

ప్రయోగాత్మకంగా బ్లాక్‌మాంబాతో పాటు 19 అత్యంత విషపూరిత పాముల విషాన్ని ఒక్కొక్కటిగా ఎలుకలకు ఎక్కించి, అనంతరం వాటికి ఈ విరుగుడు ఇచ్చారు. బ్లాక్‌మాంబాతో పాటు 13 రకాల విషాల బారినుంచి ఎలుకలను ఈ యాంటీ వెనమ్‌ కాపాడటం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు! ఆరు అత్యంత విషపూరిత పాముల విషాన్ని కలగలిపి ఇచ్చినా అదే ఫలితం వచి్చంది. మిగతా 6 రకాల విషాలకు కూడా ఎల్‌ఎన్‌ఎక్స్‌–డీ09 పాక్షికంగా విరుగుడుగా పని చేసింది. ఇది ప్రస్తుతానికి ప్రయోగాల దశలోనే ఉన్నట్టు గ్లెన్‌విల్లే చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలను తాజాగా సైంటిఫిక్‌ జర్నల్‌ ‘సెల్‌’లో ప్రచురించారు.

శ్రమతో కూడిన ప్రక్రియ 
యాంటీ వెనమ్‌ తయారీ ఓ సంక్లిష్ట ప్రక్రియ. పాముల నుంచి సేకరించిన విషయాన్ని చిన్న డోసుల్లో గుర్రాల వంటి జంతువులకు ఎక్కిస్తారు. ఆ విషానికి రోగనిరోధకత సమకూరాక వాటి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలతో విరుగుడు తయారు చేస్తారు. అయితే ఇది శ్రమతో కూడినదే గాక ప్రమాదకరమైన ప్రక్రియ కూడా. చాలాసార్లు సరిగా పని చేయకపోవడంతో పాటు సీరియస్‌ సైడ్‌ ఎఫెక్టులు కూడా తలెత్తుతాయి. పాముకాటుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.4 లక్షల మంది బలవుతున్నట్టు అంచనా. 4 లక్షల మంది దాకా వికలాంగులుగా మారుతున్నారు. గ్వాటెమాలా గ్రామాల్లో పెరిగిన గ్లెన్‌విల్లే ఈ సమస్యకు మెరుగైన, శాశ్వత పరిష్కారం కోసం చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అది ఎల్‌ఎన్‌ఎక్స్‌–డీ09 కాగలదని ఆయన ధీమాగా చెబుతున్నారు. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌.  

Advertisement
 
Advertisement
Advertisement