breaking news
kumar rao
-
తొలి రోజు 25 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ కాంగ్రెస్ ప్రారంభించింది. ఆదివారం నుంచి ఈ స్వీకరణ ప్రారంభం కాగా, తొలిరోజు పలు లోక్‌సభ నియోజకవర్గాలకు 25 దరఖాస్తులు వచ్చాయని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. తొలిరోజు దరఖాస్తు చేసిన వారిలో పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, మల్లు రవి, బలరాం నాయక్, కోదండరెడ్డి తదితరులున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ మంగళవారం వరకు కొనసాగనుంది. సోమ, మంగళవారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సోమవారం గాంధీభవన్‌లో పలు సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నారు. దీంతో పాటు లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన మీడియా కో ఆర్డినేషన్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ప్రచార కమిటీ, సమన్వయ కమిటీ భేటీలు జరగనున్నాయి. ఈ భేటీల అనంతరం మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లోక్‌సభకు పోటీచేసేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్టు చేయనున్నారు. పోటీకి సై అంటున్న సీనియర్లు ఈ సారి కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని మాజీ ఎంపీ వీహెచ్, భువనగిరి సీటు ఇవ్వాలని ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డిలు ఆదివారం దరఖాస్తు చేసుకున్నారు. తమ దరఖాస్తులను టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మల్లు రవి (నాగర్‌కర్నూల్), కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ (మహబూబాబాద్)లు కూడా తమ దరఖాస్తులు అందజేశారు. కాగా, భువనగిరి స్థానం నుంచి టికెట్ కోసం నల్లగొండ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, నల్లగొండ పార్లమెంటు కోసం సూర్యాపేటకు చెందిన పటేల్ రమేశ్‌రెడ్డి కూడా దరఖాస్తు చేశారు. ఇక, రిజర్వుడు నియోజకవర్గాలైన వరంగల్ నుంచి ఇందిరా, మహబూబాబాద్ నుంచి బెల్లయ్యనాయక్, నాగర్‌కర్నూల్ నుంచి సతీశ్మాదిగలు కూడా దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. -
అభిప్రాయ సేక‘రణం’
భువనగిరి, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రూపు విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై సోమవారం ఏఐసీసీ ప్రతినిధి సేవక్ వాఘే పార్టీ నాయకులు, కార్యకర్తలనుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు భువనగిరి రహదారిబంగ్లాలో సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, ఇన్చార్జ్ కుమార్‌రావు, సత్యనారాయణలు వేదికపై ఉన్నారు. వారి సమక్షంలోనే పార్టీ కార్యకర్తలు ఇరువర్గాలుగా మారి దాడికి దిగారు. ఈ దాడిలో కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికన్నా సిట్టింగ్‌లో ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వద్దని ఫిర్యాదులు చేసుకున్నారు. ఒక దశలో పరిశీలకుడు ఫిర్యాదులు కాకుండా పోటీ చేయాలనుకునే వారు తమ పేర్లను ఇవ్వాలని సున్నితంగా ఫిర్యాదులను తిరస్కరించారు. అయినా ఇరువర్గాల కార్యకర్తలు ఎవరూ ఆగలేదు. ఇంతకాలం ఘాటైన విమర్శలు చేసుకుంటూ వచ్చిన ఇరువర్గాలు తిట్ల పురాణం అందుకుని చెప్పులు, కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసురుకోవడంతో పరిశీలకుడు ఉన్న రహదారి బంగ్లా ఆవరణ రణరంగంగా మారింది. పోలీసులు వెంటనే స్పందించి ఇరువర్గాలను చెదరగొట్టారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, వరంగల్ జిల్లా జనగామ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంకు చెందిన పలువురు నేతలు తమకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. కాగా పరిశీలకుడు ఆయా నియోజకవర్గాల వారిగా ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్ మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు బ్లాక్, మండల, యువజన కాంగ్రెస్ అధ్యక్షులనుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎవరి అనుచరులు వారికే... ఎంపీ రాజగోపాల్‌రెడ్డి పేరును అన్ని నియోజకవర్గాల నుంచి ఆయన అనుచరులు సూచించారు. అలాగే మంత్రి పొన్నాల లక్ష్యయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గూడూరు నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, గర్దాసు బాలయ్య, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తనయుడు సర్వోత్తమరెడ్డి, దూదిమెట్ల సత్తయ్యయాదవ్ల పేర్లను వారి అనుచరులు సూచించారు. ఆలేరు నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్పేరును అన్ని మండలాల బ్లాక్, మండల కాంగ్రెస్ ప్రతినిధులు సర్పంచ్‌లు సూచించారు. అలాగే మచ్చ చంద్రమౌళి గౌడ్, వంచవీరారెడ్డి, పల్లె శ్రీనివాస్, పర్వతాలు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గంనుంచి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతోపాటు కొండేటి మల్లయ్య, సాయిలు టికెట్ ఇవ్వాలని కోరారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మామిడి నర్సయ్య, శ్యాంసుందర్‌లకు టికెట్ ఇవ్వాలని వారి అనుచరులు ఏఐసీసీ దూతకు సూచనలు చేశారు. మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతి, ముంగి చంద్రకళ, సుంకరి మల్లేష్‌గౌడ్‌లకు అనుకూలంగా సూచనలు వచ్చాయి. ఇబ్రహీంపట్నం నుంచి క్యామ మల్లేష్, రంగారెడ్డి శేఖర్‌రెడ్డిల పేర్లను వారి అనుచరులు సూచించారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రామాంజ నేయులుగౌడ్, గర్దాసు బాలయ్య, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, పోత్నక్ ప్రమోద్‌కుమార్, పోతంశెట్టి వెంక టేశ్వర్లు, తంగళ్లపల్లి రవికుమార్, పింగల్రెడ్డిలకు అనుకూలంగా సూచనలు చేశారు. జనగామ నియోజకవర్గం నుంచి పొన్నాల లక్ష్యయ్య, వైశాలి, మహేందర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డిలకు అనుకూలంగా వారి అనుచరులు సూచనలు చేశారు. పలుమార్లు ఉద్రిక్తతం అభిప్రాయ సేకరణ సందర్భంగా కార్యకర్తలు బయట పరస్పరం దూషించుకునే విధంగా నినాదాలు చేసుకోవడంతో సమావేశ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూ ఇరువర్గాలను సముదాయించారు. పోటా పోటీగా నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో రహదారి బంగ్లా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో నిండిపోయింది. పరిశీలకుని ముందు అభిప్రాయాలు చెప్పే విషయంలో నాయకులు ఇబ్బందులు పడ్డారు. స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పలేకపోతున్నారని దామోదర్‌రెడ్డి పరిశీలకునికి ఫిర్యాదు చేశారు. పరిశీలకుని వద్ద ఎవరూ లేకుండా చూడాలని పలుమార్లు పరిశీలకుడిని కోరారు. ఒక దశలో పరిశీలకుని ముందే ఇరువర్గాలు వాగ్వాదం చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరువర్గాల కార్యకర్తల నినాదాలతో రహదారి బంగ్లా ప్రాంతం నిండిపోయింది. బయట కార్యకర్తలు ఘర్షణ జరుగుతున్న సమయంలోనే సాయంత్రం వరకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని పరిశీలకుడు బయపడ్డారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.