విద్యుత్ షార్టు సర్క్యూట్తొ రైస్ మిల్లు దగ్ధం
రూ.30లక్షల ఆస్తి నష్టం
పట్టణంలోని పోతురాజు గండిలో బుధవారం రాత్రి ఘటన
అద్దంకి : విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో మంటలు చెలరేగి రైసు మిల్లు దగ్ధమయింది. ఈ ఘటన పట్టణంలోని పోతురాజు గండిలో ఉన్న రాజరాజేశ్వరీ రైస్‌మిల్లులో బుధవారం రాత్రి జరిగింది. మిల్లు అద్దెదారు రహమాన్ అందించిన సమాచారం మేరకు కొటికలపూడి ఖాశీం మిల్లులను రహమాన్ అనే వ్యక్తి అద్దెకు తీసుకుని రెండేళ్ల నుంచి నడుపుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మిల్లుకు తాళం వేసి నమాజుకు వెళ్లాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో స్థానికులు పక్కనే ఉన్న మంచినీటి ప్లాంటులో నీరు తెచ్చుకోవడానికి వెళుతూ మిల్లులో నుంచి పొగలు రావడం గమనించారు. కొంత సేపటికే మంటలు ఎగసి పడి ఆకాశాన్నంటాయి.
అగ్నిమాపక శకట సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే మిల్లులో ఉన్న యంత్రాలు, 150 బస్తాల వరకు ధాన్యం అగ్గిపాలయింది. బాధితుడి నుంచి నష్టం వివరాలను తెలుసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుత్ బోర్డులో వచ్చిన మంటల వల్లే ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. కొందరు మిల్లులోని బోర్డు నుంచి మంటలు రావడం తాము చూశామని చెబుతున్నారు.