ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్ చేయాలి: రాఘవులు
కొణిజర్ల: ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి వారు పంటలు నష్టపోవడానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్ చేయాలని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తీగలబంజర, సింగరాయపాలెం గ్రామాల్లో అకాల వర్షాలకు తడిచిన పత్తి చేలను, లాలాపురంలో అడ్డదిడ్డంగా ఎదిగిన వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతు సంక్రాంతి నరసయ్య మాట్లాడుతూ.. ఏపీ సీడ్స్ వారు పంపిణీ చేసిన విత్తనాలలో దాదాపు 50 శాతం నకిలీ విత్తనాలు ఉండడంతో సగం పంట ముందుగానే ఈనిందని, మిగిలింది పొట్ట దశలో ఉందని, దీంతో పంట నష్టపోవాల్సి వ స్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం రాఘవులు మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు నాణ్యమైనవనే నమ్మకంతో రైతులు కొనుగోలు చేశారని, ప్రభుత్వమే వారిని మోసం చేస్తే ఇక దిక్కెవరని ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లాలో దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో ఏపీసీడ్స్ విత్తనాలు కొనుగోలు చేశారని, వీరంతా నష్టపోయారని అన్నారు. పంటలు పరిశీలించిన అధికారులు 10 నుంచి 15 శాతం మాత్రమే విత్తనలోపం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చే శారు. పంటల పరిశీలన నివేదికలు ఇవ్వమని అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నించారు.
అనంతరం సిద్దిక్నగర్, తీగలబంజరలో తడిసిన పత్తి చేలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. పంటల నష్టంపై నిపుణులతో కమిటీ వేసి అంచనాలు తయారు చేయించాలని రాఘవులు ప్రభుత్వాన్ని కోరారు. తడిసిన పత్తిని ఎలాంటి ఆంక్షలు లేకుండా సీసీఐ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతుల రుణాలు రద్దు చేసి రబీకి తిరిగి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.