breaking news
kodanda ramalayam
-
భద్రాచలం రామాలయంలో కన్నులపండుగగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
కోదండ రామాలయంలో భారీ చోరీ
మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో గల కోదండ రామాలయంలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనలో రెండు పంచలోహ విగ్రహాలు, వెండి, తులాల బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనను నిరసిస్తూ.. ఆగ్రహించిన స్థానికులు, అఖిల పక్ష నేతలు ఆలయం ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కోదండ రామాలయంలో ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి దొంగలు గుడి తాళాలు, గర్భ గుడి షట్టర్‌తో పాటు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. పంచలోహ విగ్రహాలైన సీతమ్మ తల్లి, శ్రీకృష్ణుడు విగ్రహాలతో పాటు రెండు కిలోల వెండి ఆభరణాలు, రెండు తులాల బంగారు పుస్తెలు చోరీ చేశారు. అయితే ఈ భారీ చోరీని తెలుసుకున్న వీహెచ్‌పీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నేతలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నేతలు మాట్లాడుతూ పోలీసుల వైఫల్యంతోనే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే ఇదే ఆలయంలో నాలుగుసార్లు చోరీ జరిగినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాల వద్ద పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ వనజాదేవి, డీఎస్పీ గోద్రూ, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్, పట్టణ సీఐ విజయ్‌కుమార్‌లు వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. స్పందించిన ఆర్డీఓ, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. కాగా ఆలయం చోరీ దృష్ట్యా స్థానికులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి, దుకాణాలు మూసివేయించారు. ఆలయంలో క్లూస్‌టీం బృందం పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యా సంస్థలను ఏబీవీపీ నేతలు మూసివేయించారు. సాయంత్రం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో వనపర్తి వెంకటేశం, గడ్డం శ్రీనివాస్, టీ చంద్రపాల్, దుర్గ ప్రసాద్, కృష్ణారెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, సంజీవ్, మల్కాజి సత్యనారాయణ, కొండశ్రీను, మ్యాడం బాలకృష్ణ, మధు, కాశీనాథ్, ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్, ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం మధుసూచార్యులు, బ్రాహ్మణ సంఘం నేతలు వైద్య శ్రీనివాస్, కృష్ణమూర్తి, రాజు పంతులు, కృష్ణమూర్తి పంతులు, ప్రసాద్ పంతులు, కృష్ణ పంతులు, కొల్చారం మండలం కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డితో పాటు పట్టణ ప్రజలు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కాజ కోదండ రామాలయంలో చోరీ
కాజ(మంగళగిరి రూరల్), న్యూస్‌లైన్ : కాజ గ్రామంలోని కోదండ రామస్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు చొరబడి రూ.3.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అర్చకుడు సత్య ప్రసాద్ ప్రతి రోజు మాదిరిగా బుధవారం ఉదయం 5 గంటలకు దేవస్థానానికి చేరుకున్నాడు. దేవస్థానం లోపల తలుపులకు వేసిన తాళం పగులగొట్టి ఉంది. ఉత్సవ విగ్రహాల వద్దకు వెళ్లి పరిశీలించగా ఆరు వెండి కిరీటాలు, నాలుగు బంగారు మంగళ సూత్రాలు, వెండి చటారి, బంగారు నెక్లెస్, స్వామి వారి వెండి పాదాలు, వెండి ధనస్సు, వెండి బాణం, రెండు ఉత్తర జంధ్యాలు, వెండి పంచపాత్రలు చోరీ అయినట్టు గుర్తించారు. విషయాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కృపాల్‌రెడ్డికి తెలియజేసి, మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్త్‌సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావు, రూరల్ సీఐ టి.మురళీకృష్ణ, ఎస్ఐ వై.సత్యనారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకుని దేవస్థాన ఈవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించారు. వేలిముద్రల విభాగం అధికారి కె.వెంకటేశ్వరరావు, క్లూస్ ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో వేలిముద్రల ఆధారాలను సేకరించారు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంచాయితీ కార్యాలయం వద్ద ఉన్న పడమట దేశమ్మ తల్లి, శ్రీకృష్ణుని మందిరాల్లో కూడా బుధవారం తెల్లవారుజామున దొంగలు హుండీలను పగులగొట్టి వాటిలోని నగదు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రతి రోజూ రాత్రి వేళ పోలీస్ సిబ్బంది గ్రామంలో ప్రత్యేక గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా సంచార జాతికి చెందిన ఓ ముఠా దేవాలయాల దోపిడీలకు పాల్పడుతున్నట్టు తమకు సమాచారం వుందన్నారు.