breaking news
kodana ram
-
పార్టీ పేరును ప్రకటించిన కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ పాలనను కూకటివేళ్లతో తొలగించడానికి.. ‘తెలంగాణ జన సమితి (టీజేఎస్)’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా కోదండరాం ప్రకటించారు. సోమవారం ఆయన తెలంగాణ ఉద్యమ నేతలు కె.దిలీప్‌కుమార్, గాదె ఇన్నయ్య, అడ్వొకేట్ రచనారెడ్డి తదితరులతో కలసి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ పేరును, లక్ష్యాలను, ఆశయాలను, కార్యాచరణను ప్రకటించారు. ‘తెలంగాణ జన సమితి’ పేరుతో జనం కోసం రాజకీయంగా పోరాడుతామని కోదండరాం పేర్కొన్నారు. ఎన్నెన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉద్యమించి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు గౌరవం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి చూస్తున్నామని, ఉద్యమకారులే రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నామని చెప్పారు. పాలనను సరిచేయాలి.. రాజకీయపార్టీ ఏర్పాటుపై అనేక సంఘాలతో లోతుగా చర్చించామని కోదండరాం చెప్పారు. పార్టీ పెట్టడానికి ప్రధానంగా మూడు కారణాలు ప్రభావితం చేశాయన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న పాలనను సరిచేయాల్సిన అవసరం ఏర్పడింది. ఉద్యమ కాలంలో కోరుకున్నట్టుగా ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. పాలకుల్లో మార్పు తప్ప పాలనలో మార్పు రాలేదు. తెలంగాణలో ప్రజాస్వామిక విలువలు కనుమరుగయ్యాయి. సభలు, సమావేశాలు నిర్వహించుకునే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఏకవ్యక్తి నిరంకుశ పాలన సాగుతోంది..’’ అని పేర్కొన్నారు. నియంతృత్వ పాలనను పెకలిస్తాం ఉద్యమాలతో మార్పు, పౌర సమాజం సాధ్యమనే యోచనతో ఇప్పటిదాకా ఉద్యమించామని.. కానీ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై తీవ్ర నిర్బంధం విధించిందని కోదండరాం విమర్శించారు. ఈ నియంతృత్వ పాలనను కూకటివేళ్లతో పెకిలించడానికే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెప్పారు. రాజకీయ పార్టీ లక్ష్య ప్రకటనపై స్థూలమైన అంగీకారానికి వచ్చామని.. రాజ్యాంగానికి, అంబేడ్కర్ ఆశయాలకు లోబడి తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా ‘తెలంగాణ జన సమితి’ పోరాడుతుందని కోదండరాం వెల్లడించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనను అంతం చేయడానికి టీజేఎస్‌తో కలసి పనిచేయాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు. విస్తృతంగా ప్రజల్లోకి.. టీజేఎస్ పార్టీ నియమ నిబంధనావళిని తయారు చేసుకున్నామని.. జెండాను రూపొందించడానికి చిత్రకారులు, ఇతర నిపుణుల సహకారం తీసుకుంటున్నామని కోదండరాం చెప్పారు. లక్షలాది మందికి జెండా వివరాలు చేరాయని, వారి నుంచి సూచనలు, సలహాలు వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 4న జెండా వివరాలను అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ఈనెల 29న హైదరాబాద్‌లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తామని తెలిపారు. ఆవిర్భావ సభ నిర్వహణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సన్నాహాక కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాష్ట్ర స్థాయి సన్నాహక కమిటీలోని సభ్యులు, 11 సబ్ కమిటీలు సభ నిర్వహణ కోసం పనిచేస్తాయని తెలిపారు. సభకు అనుమతుల కోసం దరఖాస్తు చేశామన్నారు. సభకు జన సమీకరణకోసం ఈ నెల 5వ తేదీ నుంచి సదస్సులు, సమావేశాలు, ర్యాలీలు జరుగుతాయని వెల్లడించారు. టీజేఎస్ ఆవిర్భవించినా టీజేఏసీ యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుంది.. టీజేఏసీ పోరాటం లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని.. తెలంగాణ వచ్చాక ఉద్యమ ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వానికి అనుక్షణం గుర్తుకు చేసిందని మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. కానీ ప్రశ్నించడాన్ని ప్రభుత్వం, పాలకులు జీర్ణించుకోవడం లేదని చెప్పారు. నీతి, నిజాయితీ కలిగిన కోదండరాం నాయకత్వంలో ఏర్పాటవుతున్న రాజకీయ పార్టీ రాష్ట్రంలో రాజకీయాలను మారుస్తుందని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలోనూ పాత రాజకీయాలు, ఆ రాజకీయాల దుర్గంధమే కొనసాగుతోందని అడ్వొకేట్ రచనారెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి రాజకీయాలను సమూలంగా మార్చేందుకు తెలంగాణ జన సమితి పనిచేస్తుందని చెప్పారు. అన్ని వర్గాలూ నిరాశలోనే.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తాము కనీసం 500 గ్రామాల్లో తిరిగామని.. అన్ని వర్గాలు నిరాశలోనే ఉన్నాయని కోదండరాం తెలిపారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఉద్యోగాల భర్తీ లేదని పేర్కొన్నారు. అసలు ప్రజాస్వామ్య విలువలకు తావులేకుండా పోయిందన్నారు. చాలా గ్రామాల్లో 144 సెక్షన్ ఉందని, ఇసుక మాఫియా కోసం సామాన్య ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని, రైతులకు అందాల్సిన ట్రాక్టర్ల పంపిణీలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. మహిళలకు తెలంగాణ కేబినెట్లో స్థానం లేదని.. మంత్రులకు తెలియకుండానే సమీక్షలు జరిగిపోతుంటాయని వ్యాఖ్యానించారు. సచివాలయానికి రాకుండా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడేనని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్లను పట్టించుకోకుండా కాంట్రాక్టర్ల సలహాలతోనే ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. రెండు నెలల క్రితమే వెల్లడించిన ‘సాక్షి’ కోదండరాం నాయకత్వంలో ‘తెలంగాణ జన సమితి’ పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటవుతున్నట్టుగా ‘సాక్షి’ గతంలోనే వెల్లడించింది. జనవరి 31న పత్రిక మొదటి పేజీలో ‘కోదండరాం పార్టీ.. తెలంగాణ జన సమితి’ శీర్షికన కథనం ప్రచురించింది. తాజాగా ఆయన అదే పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. -
తెలంగాణ సీఎస్‌ను కలిసిన కోదండరాం బృందం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ప్రొ.కోదండరాం బృందం కలిసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కరవు పరిస్థితులపై బుధవారం సీఎస్‌కు ఓ నివేదికను అందజేసింది. కోదండ రాంతో పాటు పొలిటికల్ జేఏసీ నేతలు రఘు, డీపీ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. అయితే సీఎస్‌ను కలిసిన అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలన్నారు. ఎకరానికి రూ. 10 వేల పంటనష్టం ఇవ్వాలంటూ కోదండరాం డిమాండ్ చేశారు. -
'విజయ్‌మాల్యాతో పోలీస్తే వారి అప్పు ఎంత?'
జనగామ: పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా బ్యాంకు ద్వారా పొందిన అప్పుల చిట్టాలో తెలంగాణ రైతుల రుణాలు ఏమాత్రమని పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్నించారు. జనగామలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. మాల్యాకు ఇచ్చిన అప్పులు ఎలా రాబట్టుకోవాలో తెలియక జుట్టు పీక్కుంటున్న బ్యాంకులకు.. కొత్త రుణాలు ఇచ్చి పాతవి రాబట్టుకోవాలంటూ కేంద్రం ఉచిత సలహా ఇచ్చిందని విమర్శించారు. అదే రైతులకు ఇస్తే మాత్రం దివాళా తీస్తారని చెప్పడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో వాటా పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి 60 శాతం హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదాయం వస్తుందన్నారు. కరువు, ఉపాధి, విద్యారంగాల్లో తెలంగాణ సంక్షోభంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయూలని ఉపాద్యాయులకు సూచించారు. అదే సమయంలో జేఏసీగా ఏర్పడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మనోహర్‌రాజు, మైస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.