breaking news
KM Pratap
-
8 మందిపై టీ-కాంగ్రెస్ వేటు
* ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంపై ఆగ్రహం * కేఎం ప్రతాప్, జైపాల్‌రెడ్డి సోదరుడికి షోకాజ్ నోటీసులు సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన 8 మంది జిల్లా స్థాయి నాయకులపై టీపీసీసీ బహిష్కరణ వేటు వేసింది. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారెడ్డి డీసీసీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సోదరుడు సూదిని రాంరెడ్డిలను ఈనెల 12న టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డి నోటీసు జారీ చేశారు. బుధవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కోదండరెడ్డి నేతృత్వంలోని క్రమశిక్షణా సంఘం సభ్యులు డీవీ సత్యనారాయణ, బండ ప్రకాష్, ఫరూఖ్ హుస్సేన్ సమావేశమయ్యారు. జిల్లాలవారీగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. అనంతరం 8 మంది నాయకులను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలిచ్చారు. వేటు వీరిపైనే: మహబూబ్‌నగర్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పీసీసీ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన తలకొండ పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి. రంగారెడ్డి జిల్లాలో మాజీ జడ్పీటీసీ పాశం లక్ష్మీపతిగౌడ్(ఇబ్రహీంపట్నం), మాజీ జడ్పీటీసీ నోముల కృష్ణగౌడ్(హయత్‌నగర్), మాజీ జడ్పీటీసీ బుయ్యకృష్ణగౌడ్(హయత్‌నగర్), మాజీ ఎంపీపీ మల్రెడ్డి యాదిరెడ్డి(హయత్‌నగర్), మాజీ కోఆప్టెడ్ సభ్యుడు గౌస్ మొయినుద్దీన్(గౌరెల్లి), మాజీ సర్పంచ్ కందాటి కృష్ణారెడ్డి(కవాడిపల్లి). -
డీసీసీ అధ్యక్షుడిని నేనే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా క్యామ మల్లేశ్ నియామకం చెల్లదని ఆ పార్టీ సీనియర్ నేత కేఎం ప్రతాప్ అన్నారు. మల్లేశ్‌ను డీసీసీ ఇన్చార్జి అధ్యక్షుడిగా పీసీసీ ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇన్చార్జిల నియామకాలు కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జరుగుతాయని గుర్తు చేశారు. ఏఐసీసీ అనుమతిలేకుండానే మల్లేశ్ పేరును పీసీసీ ఖరారు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ మాట్లాడారు. అధినాయకత్వం అనుమతి మేరకు పీసీసీ చీఫ్‌లు ఆయా జిల్లాల కమిటీలను ఖరారు చేస్తారని, రంగారెడ్డి జిల్లా విషయానికి వచ్చే సరికి.. అధిష్టానం ఆమోదం లేకుండానే మల్లేశ్‌ను నియమించి నట్లు పీసీసీ ఉపాధ్యక్షులు పరస్పర విరుద్ధ ప్రకటనలు జారీ చేసి పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టారని అన్నారు. ఇప్పటికీ తానే డీసీసీ సారథినని, పార్టీ వ్యవహారాలపై అధిష్టానం కూడా తనతోనే ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగిస్తోందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్గదర్శకాలకు భిన్నంగా డీసీసీ ప్రెసిడెంట్‌గా మల్లేశ్ ప్రకటించుకుంటే... చట్టప్రకారం చర్యలు చేపడతానని ప్రతాప్ హెచ్చరించారు.