ఆ ముఖం అయితే కచ్చితంగా గెలిచేవాళ్లం
కేరళం రాజకీయాల్లో ఒకప్పుడు “విజయానికి బ్రాండ్”గా కనిపించిన పార్టీ.. విమర్శలు, ఓటమి అనే ఎదురుదెబ్బతో ఆత్మపరిశీలనలో పడింది. సాధారణంగా.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థులపైనే విమర్శలు వినిపిస్తాయి. కానీ అక్కడ మాత్రం అక్కడి రాజకీయాల్లో మునుపెన్నడూ కనిపించని వాతావరణం కనిపిస్తోంది. బహిరంగంగా తమ నాయకత్వ నిర్ణయాలను సీపీఎం కార్యకర్తలే తప్పుబడుతున్నారు. పార్టీ ఓటమికి “కమ్యూనలిజం”, “మైనారిటీ ఓట్ల ధ్రువీకరణ” కారణమంటూ సీపీఎం రాష్ట్ర నాయకత్వం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయి కేడర్ మాత్రం ఆ వాదనను నేరుగా తిరస్కరిస్తున్నారు. “మైనారిటీ ఓటు కాదు.. సీపీఎం సంప్రదాయ ఓటర్లే దూరమయ్యారు” అంటూ గణాంకాలతో సహా చెబుతున్నారు. తాళిపరంబ ఏరియా కమిటీ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు సీపీఎంలో పెరుగుతున్న అసహనాన్ని బహిర్గతం చేశాయి.కన్నూర్ జిల్లాలోని తాళిపరంబ నియోజకవర్గం సీపీఎంకు కంచుకోటగా ఉంటూ వచ్చింది. విజయన్‌కు అత్యంత సన్నిహితుడైన ఎంవీ గోవిందన్ ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే ఈ ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌ను అధిష్టానం పరిగణనలోకి తీసుకోలేదు. గోవిందన్నే అక్కడ బరిలోకి దింపాలని కిందిస్థాయి శ్రేణులు అధిష్టానానికి విజ్ఞప్తి చేశాయి. అయితే పీకే శ్యామలను అభ్యర్థిగా దింపి ప్రయోగం చేసింది. అయితే అనూహ్యంగా.. యూడీఎఫ్ మద్దతుతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగిన టీకే గోవిందన్ ఇక్కడ ఘన విజయం సాధించారు. దీంతో దశాబ్దాల తర్వాత ఇక్కడ సీపీఎం అభ్యర్థి ఓటమిపాలైనట్లయ్యింది. “ప్రజల్లో ఆదరణ లేని ముఖాలను ముందుకు తెచ్చారు. నిజంగా ప్రజలు నమ్మిన నాయకత్వాన్ని పక్కన పెట్టారు” అంటూ మండిపడ్డారు. ఈ చర్చల్లో ఎక్కువగా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ పేరు ఎక్కువగా వినిపించింది. నిపా, కరోనా వైరస్ సమయాల్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆమెను ముఖ్యమంత్రి ముఖంగా ముందుకు తెచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వాళ్లంతా బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. “ఆమె ముఖం అయితే గెలిచేవాళ్లం” అన్న వ్యాఖ్య ఇప్పుడు కేరళ రాజకీయాల్లో వైరల్‌గా మారింది.అయితే ఈ అసంతృప్తి కేవలం సీపీఎం లోపలే కాదు.. మిత్రపక్షమైన సీపీఐ వరకూ చేరడం కేరళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా మళ్లీ పినరయి విజయన్‌కే ప్రాధాన్యం ఇవ్వడంపై మిత్రపక్షమైన సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. యువ నాయకత్వాన్ని లేదంటే ప్రజల్లో మరింత ఆమోదం ఉన్న కొత్త ముఖాన్ని(కొంత మంది శైలజ పేరునే ప్రస్తావించారట) ముందుకు తేవాల్సిన అవసరం ఉందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఓటమికి విజయన్ నాయకత్వ శైలే ప్రధాన కారణమన్న వాదనను వారు కూడా పరోక్షంగా ప్రస్తావించినట్లు సమాచారం.అయితే సీపీఎం మాత్రం సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పినరయి విజయన్‌కే మళ్లీ ప్రధాన ప్రతిపక్ష ముఖంగా అవకాశం ఇచ్చింది. పార్టీని కట్టిపడేసే శక్తి ఇంకా ఆయనకే ఉందన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. కానీ గ్రాస్‌రూట్ స్థాయిలో మాత్రం ఈ నిర్ణయంపై అసంతృప్తి పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. ఇంత హైప్ ఉన్న కేకే శైలజ, పెరవూర్ నుంచి ఓటమి పాలయ్యారు. కేరళ పీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్(ప్రస్తుతం మంత్రి) చేతిలో ఆమె పరాజయం చెందారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు ఉన్న ఇమేజ్, కరోనా సమయంలో చూపించిన నాయకత్వం ఇప్పటికీ ప్రజల్లో బలంగానే ఉందని సీపీఎం వర్గాలు భావిస్తున్నాయి.వాస్తవానికి.. పినరయి విజయన్, ఎం.వి. గోవిందన్ లపై అధికార ధోరణి, అహంకారం, బంధుప్రీతి ఆరోపణలు ఉన్నాయి. శైలజా ప్రజాదరణ ఉన్నప్పటికీ, ఆమెను బలహీనమైన నియోజకవర్గంలో పోటీకి పంపడం ఓటమికి దారితీసిందనేది సీపీఎం కిందిస్థాయి శ్రేణుల వాదన. ఫలితంగా.. పార్టీ 2021లో 99 సీట్ల నుండి 2026లో 35కి పడిపోయింది. శైలజా ప్రజాదరణను ఉపయోగించుకోలేకపోవడం, నాయకత్వంపై అసంతృప్తి CPI(M)లో లోతైన సంక్షోభానికి దారితీసింది. ఇప్పటికైనా ఆ పని చేయాలని సీపీఎం నాయకత్వంపై తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి.ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. కేరళలో ఎల్డీఎఫ్ ఎదుర్కొంటున్న సమస్య కేవలం ఎన్నికల ఓటమి మాత్రమే కాదని స్పష్టమవుతోంది. నాయకత్వ శైలి, అభ్యర్థుల ఎంపిక, ప్రజల్లో పార్టీ ఇమేజ్, మిత్రపక్షాల అసంతృప్తి, గ్రాస్‌రూట్ కార్యకర్తల తిరుగుబాటు.. ఇవన్నీ ఇప్పుడు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ఈ అసంతృప్తి ఇక్కడితో ఆగుతుందా? లేక సీపీఎంలో మరింత పెద్ద మార్పులకు దారితీస్తుందా? అన్నదే ఇప్పుడు కేరళ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.