breaking news
khan academy
-
ఖాన్ అకాడమీ
ఓ మంచి ట్యుటోరియల్! నాణ్యమైన చదువుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ విద్యార్థులకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ నిజంగా వరమే! కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్‌కు ఇంటర్నెట్ తోడుంటే చాలు.. కూర్చున్న చోటు నుంచే అంతర్జాతీయ స్థాయి విద్య, విజ్ఞానం విద్యార్థి సొంతమవుతుంది. ఎవరైనా.. ఎప్పుడైనా.. ఎక్కడినుంచైనా.. ప్రపంచస్థాయి నిపుణులు అందించే సబ్జెక్టు పరిజ్ఞానం పొందొచ్చు. అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండానే! ఇదంతా ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా సాధ్యమవుతున్న అద్భుతం. కేజీ నుంచి పీజీ దాకా.. ఏ కోర్సు అయినా.. ఏ సబ్జెక్ట్ అయినా.. ఏ కాన్సెప్ట్ అయినా.. ఇట్టే నేర్చుకోవచ్చు. ఎలాంటి సందేహాలున్నా.. క్షణాల్లో నివృత్తి చేసుకోవచ్చు. ఖాన్ అకాడమీ, ఎన్పీటీఈఎల్, ఎడెక్స్, కోర్స్ఎరా, మూక్స్, మిట్ ఓపెన్ కోర్స్‌వేర్, ఎంఆర్ యూనివర్సిటీ వంటివి ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను అందించే దిశగా వినూత్న, విప్లవాత్మక విధానాలతో ముందుకొస్తున్నాయి. - సాక్షి, ఎడ్యుకేషన్ డెస్క్ ఖాన్ అకాడమీ.. ఆన్లైన్ ఎడ్యుకేషన్‌లో సంచలనం. 2006లో చిన్నగా మొదలై.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇటీవల భారత్‌లో టాటా ట్రస్ట్‌తో ఖాన్ అకాడమీ ఒప్పందం చేసుకుంది. తద్వారా టీచర్లకు ఉద్యోగ అవకాశాలతోపాటు భారతీయ భాషల్లో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల ఆధారంగా నాణ్యమైన కంటెంట్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హిందీ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. ఎంతో మంది కృషి ఫలితం అరటిపండు వొలిచి నోట్లో పెట్టినట్లు.. క్లిష్టమైన మ్యాథ్స్ ఈక్వేషన్స్‌ను అత్యంత సులువుగా బ్లాక్ బోర్డుపై రంగురంగుల స్కెచ్‌లతో వివరించడం విద్యార్థులను ఆకట్టుకుంటోంది. నిపుణులైన 80 మందికిపైగా టీమ్‌తో ప్రపంచంలో ఎక్కడున్నా, ఎవరికైనా.. ఉచితంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా ఖాన్ అకాడమీ విస్తరిస్తోంది. ఈ క్రతువులో ఎంతోమంది పాలుపంచుకుంటున్నారు. ఇందులో.. టీచర్లు, డెవలపర్లు, సాఫ్ట్వేర్ డిజైనర్లు, సైంటిస్ట్‌లు, స్ట్రాటజిస్టులు, కంటెంట్ స్పెషలిస్టులు ఉన్నారు. వీరంతా తమ ఏకైక లక్ష్యమైన ప్రతి ఒక్కరూ అత్యున్నత విజ్ఞానాన్ని అందుకోవాలనే దిశగా ఉద్యుక్తులవుతున్నారు. అంటే.. కొంత మంది గొప్ప వ్యక్తులు గొప్పగా ఆలోచిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నది వీరి నమ్మకం. అందరికీ ఉచిత విద్య ఎలాంటి ప్రకటనలూ.. సబ్‌స్క్రిప్షన్లూ లేవు. లాభాపేక్ష అస్సలు లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడమే ఆశయం. దాతలు, వలంటీర్లు ఖాన్ అకాడమీ బలం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది అందరికీ ఉచితం. మీకు కనీసం మెయిల్ ఐడీ/అకౌంట్ కూడా అవసరం లేదు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి చోటా ఖాన్ అకాడమీ అందుబాటులో ఉంటుంది. అకౌంట్ ఉంటే.. మీకు ఇష్టమైన భాషను డిఫాల్ట్ లాంగ్వేజ్‌గా పెట్టుకోవచ్చు. నేర్చుకుని మీ పురోగతిని అంచనా వేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లోనూ అందుబాటులో ఉంది. వీడియోలు, ఇతర కంటెంట్, లెర్నింగ్ మెటీరియల్ ఇంగ్లిష్‌తోపాటు స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్, బ్రెజిలియన్ వంటి 36 భాషల్లోకి అనువాదం అవుతుండటం విశేషం. తెలుగులోనూ మ్యాథ్స, ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠ్యాంశాలు లభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ మిలియన్ల మంది విద్యార్థులు తమకు ఇష్టమైన అంశాలను ఖాన్ అకాడమీ ద్వారా నేర్చుకుంటూ విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటున్నారు. అంటే... అమెరికా నుంచి కొరియా వరకూ ప్రపంచంలో ఏ మూలనున్నా, ఎక్కడున్నా... ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఖాన్ అకాడమీ ద్వారా ఆయా సబ్జెక్టులను నేర్చుకోవచ్చు. ఏమేమి నేర్చుకోవచ్చు? ఖాన్ అకాడమీ.. మ్యాథ్స్, సైన్స్, ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, హ్యుమానిటీస్, కంప్యూటింగ్, టెస్ట్ ప్రిపరేషన్, పార్టనర్ కంటెంట్, కాలేజ్ అడ్మిషన్స్, ట్యాక్స్, ఇంటర్వ్యూస్, కోచ్ రిసోర్సెస్.. ఇలా అనేకం అందుబాటులోకి తెచ్చింది. మ్యాథ్స్‌కు సంబంధించి కేజీ ఎర్లీ మ్యాథ్స్ నుంచి ప్రారంభించి.. జామెట్రీ, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్.. వంటివాటితో పాటు ఆర్ట్స, హ్యుమానిటీస్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచింది. అదేవిధంగా అకాడమీ అందించే కోడింగ్ పాఠాలు అద్భుతమని చెప్పొచ్చు. ఆయా ప్రోగ్రామింగ్ వీడియోల ద్వారా పైసా ఖర్చు లేకుండా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, వెబ్సైట్ డిజైనింగ్, గేమ్స్ డిజైనింగ్ కోసం ఉపయోగపడే జావా స్క్రిప్ట్ వంటి జాబ్ మార్కెట్ డిమాండింగ్ కోర్సులను నేర్చుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ సైన్స్ క్లాసుల్లో డేటా ఎన్‌క్రిప్షిన్, ఇన్ఫర్మేషన్ థియరీ వంటి ముఖ్యమైన టాపిక్స్‌ను తెలుసుకోవచ్చు. కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్‌పై ఎలాంటి అవగాహన లేని వారికి ఈ వీడియోలు నిజంగా అద్భుతమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్స్ట్రక్టర్ ఒకవైపు కోడ్‌ను వివరిస్తూ.. కోడ్‌ను టైప్ చేయగానే వెంటనే మరోవైపు దాని ఫలితం కనిపిస్తుంటుంది. పొరపాట్లను కూడా వెంటనే వివరించి సరిదిద్దే ఏర్పాటు సైతం ఉంది. అంతేకాకుండా జావా స్క్రిప్ట్‌పై ప్రాక్టికల్ కోర్సులు ఉన్నాయి. ఇష్టంగా ఆడుతూ పాడుతూ ‘‘ఎవరైనా.. ఎక్కడున్నా.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉచితంగా ‘విద్య’ను అందించడమే తమ లక్ష్యమని ఖాన్ అకాడమీ ప్రకటించింది. 4000 ఆన్లైన్ వీడియోలు.. ఒక్కోటి 10 నిమిషాల నిడివికలవి.. ఎర్లీ మ్యాథ్స్, సైన్స్ నుంచి ప్రారంభించి హిస్టరీ, ఎకనామిక్స్, మ్యూజిక్, కంప్యూటర్స్ వరకూ అనేక సబ్జెక్టులు.. టాపిక్‌ను వివరించే వీడియోలతోపాటు ఆయా టాపిక్‌పై పట్టు చిక్కిందో లేదో స్వయంగా పరీక్షించుకునేందుకు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లు, వ్యక్తిగతంగా నేర్చుకోవడానికి డాష్‌బోర్డు సౌలభ్యం సైతం ఉంది. భారతీయ విద్యార్థుల కోసం 6వ గ్రేడ్ నుంచి 8 గ్రేడ్ వరకు ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో కూడిన పాఠాలు అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స ఎగ్జామినేషన్‌కు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలకు వీడియో సమాధానాలు లభ్యమవుతున్నాయి. ఇవన్నీ తరగతి గది బోధన మాదిరిగా నిర్దిష్ట సమయంలో నిర్బంధంగా కాకుండా.. సదరు విద్యార్థి తనకు వీలున్న సమయంలో ఇష్టమైనప్పుడు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఆడుతూపాడుతూ హాయిగా నేర్చుకోవచ్చు. ఖాన్ అకాడమీ వినియోగిస్తున్న అత్యాధునిక అడాప్టివ్ టెక్నాలజీ నేర్చుకోవడంలో విద్యార్థి బలాలు, బలహీనతలను గుర్తిస్తుంది. తద్వారా విద్యార్థి నేర్చుకోవడంలో తన లోపాలను స్వయంగా సరిదిద్దుకోవచ్చు. నాసా, మిట్, కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సెన్సైస్, ద మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతోనూ ఖాన్ అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థి.. టీచర్.. పేరెంట్ విద్యార్థిగానే కాకుండా టీచర్‌గా, పేరెంట్‌గా, కోచ్‌గా కూడా అకాడమీలో చేరొచ్చు. పేరెంట్, టీచర్, ట్యూటర్.. విద్యార్థి (ఇతర యూజర్) పురోగతిని పర్యవేక్షిస్తూ.. అతనికి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. నేర్చుకోవాల్సిన నైపుణ్యాలేంటో చెప్పొచ్చు. పేరెంట్ అయితే తన కుమారుడు/కుమార్తె కోసం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా తన బిడ్డ ప్రస్తుతం ఉపయోగిస్తున్న అకౌంట్‌తో పేరెంట్ అకౌంట్ కనెక్ట్ కావొచ్చు. తద్వారా తమ పిల్లల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సౌలభ్యం ఉంది. మూక్స్, ఎడెక్స్ వంటివి తమ కంటెంట్‌ను మాత్రమే అందిస్తే.. ఖాన్ అకాడమీ తన సొంత కంటెంట్‌తోపాటు మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ తదితర తన భాగస్వాముల మెటీరియల్‌ను కూడా అందుబాటులో ఉంచుతోంది. విద్యార్థి ఆయా కాన్సెప్ట్‌లను నేర్చుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడా? లేదా తన తరగతి స్థాయి కంటే ముందంజలో ఉన్నాడా అనేది తెలుసుకునే సౌలభ్యం కల్పించడం ద్వారా విద్యార్థి ప్రతిభను టీచర్లు చక్కగా అంచనా వేయొచ్చు. కోచ్ డాష్ బోర్డ్ మొత్తం క్లాస్ రూం పనితీరుతోపాటు ఒక్కో విద్యార్థి వివరాలను అందిస్తోంది. టెక్నాలజీ నాసా, మిట్ వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా అందించే కంటెంట్; ట్యాబ్లెట్ ఆధారిత మార్కప్; మొబైల్ యాప్స్; ప్రాక్టీస్ టెస్ట్స్; మిషన్ అసెస్మెంట్; కోచెస్ మిషన్స్; శాట్; జీమ్యాట్ వంటి పరీక్షలకు ప్రామాణిక టెస్ట్ ప్రిపరేషన్ వంటివి టెక్నాలజీని ఇష్టపడే నేటి తరం విద్యార్థులకు ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాల వారికి అయాచిత వరమే అంటున్నారు నిపుణులు. ప్రపంచంలో నాణ్యమైన చదువుల కొరత, స్కూల్స్, కాలేజీల్లో బోధన ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉండటం, ఫీజుల భారం తదితర కారణాలతో తల్లిదండ్రులు ఖాన్ అకాడమీ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. విమర్శకులేమంటున్నారు ఖాన్ అకాడమీ ట్యుటోరియల్ వంటిదని.. దీన్ని ఆన్లైన్ ఎడ్యుకేషన్‌గా పేర్కొనడం సరికాదంటున్నారు నిపుణులు. ఆన్లైన్ కోర్సులను సంప్రదాయ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తూ.. కోర్సు పూర్తయ్యాక క్రెడిట్స్, సర్టిఫికెట్స్ ఇస్తుంది. ఖాన్ అకాడమీకి.. మాసివ్ ఆన్లైన్ కోర్సుల(మూక్స్)కూ తేడా ఉంది. ఖాన్ అకాడమీ అందించే కంటెంట్ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు సరితూగేలా ఉందా? అంటే ఇప్పుడే కచ్చితమైన సమాధానం చెప్పలేమన్నది నిపుణుల అభిప్రాయం. కొంత మీడియా ప్రచారం కూడా తోడవడంతో దీనికి దాతల మద్దతు లభిస్తోంది. అయితే అకాడమీ తన లక్ష్యంగా ప్రకటించుకున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత విద్య దిశగా ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని విమర్శకుల వాదన. భారతీయ మూలాలు ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సల్ఖాన్. భారతీయ మూలాలున్న ఆయన అమెరికాలో జన్మించి.. ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్), హార్వర్డ్‌లో చదువుకున్నారు. తన బంధువు చిన్నారి నదియకు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పే క్రమంలో అంకురించిన ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో సంచలనాత్మకమైంది. మొదట ఖాన్.. బంధువుల పిల్లల కోసం రూపొందించిన ట్యూషన్ వీడియోలు యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. వాటిని చూసిన వాళ్లు ఆ వీడియోలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయంటూ.. అమెరికా నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలతో ముంచెత్తారు. అలా ఖాన్ అకాడమీకి అంకురార్పణ జరిగింది. సల్ఖాన్ అప్పటి వరకూ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి 2009లో పూర్తిగా వీడియోల రూపకల్పన మొదలుపెట్టారు. దాతల మద్దతుతో అకాడమీపైనే దృష్టిపెట్టారు. బిల్‌గేట్స్ లాంటి కంప్యూటర్ మేధావులు సైతం ఖాన్ అకాడమీ వీడియోల ద్వారా తమ పిల్లలకు బోధిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. అంతేకాకుండా 2010లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్.. ఖాన్ అకాడమీకి ఆర్థికంగా దన్నుగా నిలిచింది. ఇది లాభాపేక్షలేని సంస్థ. దాతలు ఇచ్చే నిధులతో నడుస్తోంది. -
టాటా ట్రస్ట్స్ ఉచిత ఆన్లైన్ విద్య
ఖాన్ అకాడమీతో భాగస్వామ్యం ముంబై: భారత్‌లో ఉచిత ఆన్లైన్ విద్యను అందించేందుకు టాటా ట్రస్ట్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న నాన్-ప్రాఫిట్ సంస్థ ఖాన్ అకాడమీతో జతకడుతున్నట్లు ఆదివారం ఇక్కడ ప్రకటించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్-యాక్సెస్ ఆన్లైన్ మాధ్యమాల్లో ఒకటిగా నిలుస్తున్న ఖాన్ అకాడమీకి టాటా ట్రస్ట్స్ నిధులను అందించనుంది. ఐదేళ్లపాటు ఈ భాగస్వామ్యం కొనసాగుతుంది. అయితే, ఎంతమేరకు నిధులు ఇస్తున్నారన్న విషయాన్ని టాటా ట్రస్ట్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రతన్ టాటా వెల్లడించలేదు. 100 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్‌నకు హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది. ‘దేశంలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. అంతేకాకుండా అక్షరాస్యత రేటును పెంచేందుకు కూడా దీనివల్ల సాధ్యపడుతుంది. అందుకే ఆన్లైన్ ద్వారా ఉచితంగా విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఖాన్ అకాడమీని ఎంచుకున్నాం. ఒక భారతీయుడిగా, ఈ భూమిపై నివశిస్తున్న ఒక పౌరుడిగా దీన్ని ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నా. భావితరాల్లో ఒక మార్పును తీసుకురావాలన్నదే మా ఈ ప్రయత్నం ముఖ్యోద్దేశం’ అని రతన్ టాటా పేర్కొన్నారు. ఇప్పటికే భారతీయ విద్యార్ధులు తమ అకాడెమీ కంటెంట్‌ను వినియోగిస్తున్నారని.. అయితే, ప్రత్యేకంగా భారత్ కోసం ఇంగ్లిష్, హిందీ భాషల్లో కంటెంట్‌ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఖాన్ అకాడెమీ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ చెప్పారు. ఆయన గతంలో హెడ్జ్ ఫండ్ ఎనలిస్ట్ కావడం గమనార్హం. సీఎస్ఆర్ వ్యయం పన్నులాంటిదే: రతన్ టాటా కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కోసం వెచ్చిస్తున్న తప్పనిసరి వ్యయం ఒక విధంగా పన్ను కిందే లెక్కని టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. అసలు దీనికి సంబంధించి నిర్ధిష్టంగా లబ్ధిదారులను ప్రభుత్వమే గుర్తిస్తే మంచిదని కూడా ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం మేర సీఎస్ఆర్ కోసం(సామాజిక కార్యకలాపాలు) తప్పనిసరిగా ఖర్చు చేయాలని కొత్త కంపెనీల చట్టంలో నిబంధనలను చేర్చిన సంగతి తెలిసిందే. ‘దాతృత్వం లేదా సామాజిక సేవ అనేది స్వచ్ఛందంగా చేసేది. అంతేకానీ బలవంతంగా దీన్ని చేయించాలని చూస్తే ఫలితాలు పక్కదారిపట్టే అవకాశం ఉంది’ అని టాటా అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్బర్గ్ కంపెనీలో తనకున్న వాటాలో 99 శాతం షేర్లను(విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లు) సామాజిక సేవ కోసం దానం చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రతన్ టాటా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎస్ఆర్ ద్వారా సమకూరే భారీ నిధులను ఏ ప్రాజెక్టులు, రంగాల్లో వెచ్చించాలనేది ప్రభుత్వమే నిర్ధేశించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని టాటా అభిప్రాయపడ్డారు. -
ఒబామా వాణిజ్య రాయబారిగా సల్మాన్ ఖాన్
అమెరికాలో ప్రఖ్యాత ఖాన్ అకాడమీకి చెందిన ఎన్నారై సల్మాన్ ఖాన్‌ను అధ్యక్షుడు ఒబామాకు అంతర్జాతీయ వాణిజ్య రాయబారిగా నియమించారు. పలువురిని రాయబారులుగా నియమించగా, వారిలో ఈ సల్మాన్‌ఖాన్ కూడా ఒకరు. వారందరితో ఒబామా తొలిసారి ఓ సమావేశం నిర్వహించారు. వీళ్లంతా అమెరికాలో పలు అంతర్జాతీయ వాణిజ్యాలలో ఆరితేరినవాళ్లు. వాళ్లంతా తమ సమయం, శక్తి, ఆలోచనలు, అనుభవాన్ని పంచుకోడానికి, తర్వాతి తరం వాణిజ్యవేత్తలను రూపొందించడానికి అంగీకరించినట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. కోల్‌కతాలో పుట్టిన సల్మాన్‌ఖాన్.. ప్రధానంగా గణితం, సైన్సుతో పాటు పలు అంశాలపై 4,800కు పైగా వీడియో పాఠాలు రూపొందించారు. ఈయన తండ్రి ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంటున్నారు. ఈయన స్థాపించిన ఖాన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్‌కు 16,33,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీటిని దాదాపు 35.5 కోట్ల సార్లు చూశారు.