breaking news
khairatabad vinayakudu
-
ఆపరేషన్ విశ్వరూప
'ఆపరేషన్ విశ్వరూప' అద్భుతమైన ఘట్టం. భారీ గణపతి విగ్రహాన్ని రథంపై అమర్చే అపురూపమైన సన్నివేశాన్ని కనులారా తిలకించాలన్నది లక్షలాదిమంది భక్తుల ఆకాంక్ష. ఈ కార్యక్రమం సోమవారం జరగనుంది. ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంగణం దీనికి వేదిక కానుంది. ఈ ఆపరేషన్ లో కీలక వ్యక్తులెవరు..? ఎన్ని గంటలకు జరగనుంది..! వినియోగించే యంత్ర సామగ్రి విశేషాలు తదితర అంశాలపై కథనం... అధునాతనమైన క్రేన్... 'ఆపరేషన్ విశ్వరూప'లో కీలకమైనది క్రేన్. అత్యాధునికమైన టెక్నాలజీ దీని సొంతం. ఈ క్రేన్ సోమవారం తెల్లవారుజామున ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకుంటుంది. జర్మన్ టెక్నాలజీతో తయారైన దీని ధర రూ.12 కోట్లు. ఇది కూకట్పల్లి రవి క్రేన్స్‌కు చెందినది. ఈ ఏడాది క్రేన్‌ను జమీల్ అనే వ్యక్తి ఆపరేట్ చేయనున్నారు. ప్రత్యేకతలివే.. పొడవు: 60 అడుగులు వెడల్పు 14 అడుగులు టైర్లు: 12 (ఒక్కో టైరు టన్ను బరువు) మొత్తం బరువు: 120 టన్నులు 150 టన్నుల బరువును 160 అడుగుల ఎత్తుకు లేపగలిగే సామర్థ్యం దీని సొంతం. వీరు కీలకం... ఈయన పేరు వెంకట్. విగ్రహానికి ఎటువంటి నష్టం కలగకుండా షెడ్డును తొలగించడంలో ఈయనది కీలకపాత్ర. ఓవైపు వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ప్రాంగణంలో షెడ్డుకు సంబంధించిన కర్రలను తొలగించడం ఓ రకంగా కత్తిమీద సాము వంటిదే. ఈ పనిని ఆయన కొన్నేళ్లుగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఈయన పేరు నాగరాజు. విద్యుత్‌శాఖ ఉద్యోగి. మహా గణపతి శోభాయాత్రకు ‘మార్గ’దర్శకుడు. ఖైరతాబాద్ మండపం నుంచి సాగర్ తీరం చేరే వరకూ ముందుండి నడిపిస్తారు. ఈయన సూచనలతోనే వాహనం కదులుతుంది. భారీ విగ్రహం విద్యుత్ స్తంభాలకు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌కు తగలకుండా ట్రాలీ డ్రైవర్‌కు కచ్చితమైన సూచనలిస్తూ ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన దిట్ట. 16 ఏళ్ల అనుభవం నాగరాజు సొంతం. పేరు సందీప్. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీలో సభ్యుడు. నిమజ్జనయాత్రలో అన్ని శాఖల్ని సమన్వయ పరుస్తూ ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చడంలో ఈయన కీలకపాత్ర పోషిస్తారు. ప్రత్యేక విధుల్లో శంకర్.. ఈయన పేరు శంకర్. పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్. కొంతకాలం క్రితం వరకు సైఫాబాద్ డీఐగా పనిచేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా నిమజ్జన యాత్రలో అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో ఈ ఏడాది గణనాథుడి వద్దకు ప్రత్యేక డ్యూటీ నిమిత్తం వచ్చారు. కలల రూపం కరిగే వేళ.. నిమజ్జనం వేళ అంతటా ఆనందోత్సాహం. నాకు మాత్రం భావోద్వేగం. బహుశా నేను తయారు చేసింది విగ్రహం అనుకోకపోవడమే కారణమేమో! నిజం.. అది కేవలం విగ్రహం కాదు. నా గుండెలోతుల్లోంచి ఎగసిన అపురూప ఊహకు ‘నిలువెత్తు’ రూపం. విగ్రహాన్ని వాహనంపై అమర్చే వరకు ఉంటా. యాత్ర ప్రారంభం కాగానే ఇంటికెళ్లి పోతా. ఏదో తెలియని బాధ.. రోజంతా ఒంటరిగా నిశ్శబ్దంగా గడుపుతా. - రాజేంద్రన్, మహాగణపతి ప్రధాన శిల్పి -
ఖైరతాబాద్ వినాయకుడు