breaking news
keshavareddy educational institute
-
కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు..
అనంతపురం క్రైం: ‘పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ డిపాజిట్లు చెల్లించాం. ప్రతి ఒక్కరూ రూ.లక్షకు తగ్గకుండా రూ.3.5 లక్షల (ఒక్కొక్కరు) వరకు ఇచ్చాం. కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం పిల్లల చదువులయ్యాక డబ్బులిస్తామని ఇంత వరకు పైసా ఇవ్వలేదు’ అంటూ శింగనమల, తాడిపత్రి నియోజకవర్గం రైతు కుటుంబాలు ఎస్పీ సత్యయేసుబాబుతో తమ బాధను చెప్పుకున్నారు. శుక్రవారం కేశవరెడ్డి యాజమాన్యంపై వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2013లో కేశవరెడ్డి విద్యా సంస్థ ‘వన్‌టైం ఫీజు పేరిట’ డబ్బులు వసూలు చేశారన్నారు. దాదాపు జిల్లాలోనే 1500 మంది దాకా ఒక్కసారిగా ఫీజు చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదని నానా కష్టాలు పడి డబ్బులు చెల్లించామన్నారు. డబ్బులు చెల్లిస్తామని బాండ్లు ఇచ్చారని, కానీ ఇంత వరకు వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. కర్నూలు, తదితర ప్రాంతాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి చాలా దుర్భరంగా ఉందన్నారు. అసలే పంటలు సరిగా పండకపోవడం, మరో వైపు కోవిడ్ ప్రభావంతో చితికిపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. తమను దగా చేసిన కేశవరెడ్డి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. దీనికి ఎస్పీ సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామన్నారు. ఎస్పీను కలిసిన వారిలో నార్పల పెద్దిరెడ్డి, కూరగానిపల్లి ఈశ్వర్‌రెడ్డి, పుట్లూరు భాస్కర్, పెదపప్పూరు శివప్రసాద్, గుడిపాడు శివశంకర్ రెడ్డి, తదితరులున్నారు. భూమి అమ్మి రూ.2.5 లక్షలు ఇచ్చా.. 2011లో కేశవరెడ్డి విద్యా సంస్థలో డిపాజిట్ చేస్తే పదో తరగతి వరకు ఉచితంగా చదివించి, తిరిగి డిపాజిట్ ఇస్తారని చెప్పారు. ఆ సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పుడే మా ఊళ్లో ఫ్యాక్టరీ పడుతోందని ఎకరా రూ.లక్ష ఇస్తారని చెప్పారు. ఒక్కమాట ఆలోచించకుండా పిల్లాడి భవిష్యత్తు కంటే భూమీ అవసరం లేదని ఉన్న ఆరు ఎకరాల్లో ఐదు ఎకరాలు అమ్మేశా. అందులో వచ్చిన డబ్బులతో కేశవరెడ్డి స్కూల్‌కు రూ.2.5 లక్షలు చెల్లించా, రెండేళ్లుగా డిపాజిట్ కోసం తిరుగుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ స్పందించి మాకు న్యాయం చేయాలి. – సీ శ్రీరాములు , గుడిపాడు, యాడికి పేదోళ్లను మోసం చేస్తే ఎలా? 20 ఏళ్లుగా క్షవరం (బార్బర్ వృతి) చేస్తున్నా. నాకు ఇద్దరు కుమారుడు హర్షవర్ధన్, భానుకిరణ్. 2014లో కేశవరెడ్డి స్కూల్లో పిల్లలను చేర్పించా. అప్పట్లో పోస్టాఫీస్ ఆర్డీ కట్టిన రూ.75 వేలు, మరో రూ.75 వేలు అప్పు తీసుకుని మొత్తం రూ.1.5 లక్షలు చెల్లించా. పిల్లల చదువయ్యాక డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. కేశవరెడ్డి యాజమాన్యం బాండ్లు ఇచ్చాం భయపడాల్సిన పనిలేదన్నారు. ఇప్పుడేమో డబ్బుల కోసం వెళితే అసలు వ్యక్తే జైల్లో ఉన్నారని ఇప్పట్లో ఇవ్వమని చెబుతున్నారు. పేదోళ్లను మోసం చేస్తే ఎలా?.. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. – మంగలి శివకుమార్ , ఎర్రనేల కొట్టాల, అనంతపురం బంగారం తాకట్టు పెట్టాం వ్యవసాయమే ఆధారం మాకు. పెద్దగా ఆస్తులు లేవు. ఉన్న ఐదెకరాల భూమిలోనే సాగు చేసేవాన్ని. 2013లో కేశవరెడ్డి స్కూల్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్ చేస్తే పదో తరగతి వరకు చదివిస్తారని చెప్పారు. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టాం, కూడబెట్టిన డబ్బులు మొత్తం కలుపుకుని రూ.3 లక్షలు డిపాజిట్‌గా చెల్లించా. బాబు పదోతరగతి పూర్తైంది. కానీ ఇంత వరకు డబ్బులు చెల్లించలేదు. ఆర్థిక పరిస్థితి చెప్పుకునేది కాదు. కష్టం వస్తే కడుపులోనే ఉంచుకనే వాళ్లం. కానీ పిల్లాడి భవిష్యత్తు దెబ్బతింటా ఉంటే ఎలా ఊరుకునేది. తమను మోసం చేసిన కేశవరెడ్డి యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మా డబ్బు వెనక్కి ఇప్పించాలి. – వరదరాజులరెడ్డి, చుక్కలూరు,తాడిపత్రి -
బాబు పాలన.. హడలెత్తించిన ఆర్థిక మోసాలు!
సాక్షి, అమరావతి : 2014లో సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టింది మొదలు రాష్ట్రంలో ఆర్థిక మోసాలకు అంతులేకుండా పోయింది. ఈ కాలంలో పలు ప్రముఖ సంస్థలు బోర్డులు తిప్పేశాయి. అగ్రిగోల్డ్, సిరిగోల్డ్, బొమ్మరిల్లు వంటి సంస్థలు డిపాజిటర్ల నెత్తిన పిడుగులు వేసాయి. చంద్రబాబు అధికారం చేపట్టడానికి ఏడాది ముందు బోర్డు తిప్పేసిన అక్షయగోల్డ్, అభయగోల్డ్ డిపాజిటర్లను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు ఆదుకోలేదు. ఈ ఐదు కీలక సంస్థలు సేకరించిన మొత్తం డిపాజిట్లు రూ.11,486 కోట్ల 75లక్షలు. వీటి బారినపడి ఏకంగా 60,59,100 మంది డిపాజిటర్లు మోసపోయారు. అవనిగోల్డ్, సిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్–మార్ట్, గోల్డ్ క్వెస్ట్, వీఆర్ చిట్‌ఫండ్స్ తదితర సంస్థల మోసాలపై కేసులు నమోదైనప్పటికీ చంద్రబాబు తమను ఆదుకునే చర్యలు తీసుకోలేదంటూ బాధితులు వాపోతున్నారు. వీటిలో 2,44,842 మంది రూ.628 కోట్లు డిపాజిట్లు చెల్లించి చేతులు కాల్చుకున్నారు. వీరందరికీ టీడీపీ హయాంలో వీసమెత్తు న్యాయం జరగలేదు. ఇక కేశవరెడ్డి విద్యా సంస్థల అధిపతి సంగతైతే సరేసరి. రూ.750 కోట్లు ఎగేసిన ‘కేశవరెడ్డి’కి సర్కారు అండ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రముఖ ఆర్థిక మోసాల్లో కేశవరెడ్డి విద్యా సంస్థల స్కామ్ ఒకటి. కేశవరెడ్డి విద్యా సంస్థ ‘విద్యా స్కీమ్’ పేరుతో 1,100 మంది తల్లిదండ్రుల నుంచి రూ.750 కోట్లు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఆ సంస్థల అధిపతి నాగిరెడ్డిపై నంద్యాల, పాణ్యం, అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం, వైఎస్సార్ జిల్లా చినచౌక్ పోలీస్స్టేషన్లలో 2015లో ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు సీఐడీకి అప్పగించారు. కేశవరెడ్డి నాగిరెడ్డి వియ్యంకుడు ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి పొందారు. దీంతో కేశవరెడ్డి నాగిరెడ్డికి చంద్రబాబు, మంత్రి అండదండలు లభించాయి. ఫలితంగా మోసపోయిన బాధితులకు ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగలేదు. ‘అగ్రిగోల్డ్’లో టీడీపీ అవకాశవాదం అగ్రిగోల్డ్ స్కామ్ దేశంలోనే అతి పెద్దదిగా చెప్పవచ్చు. డిపాజిటర్ల అసలు, వడ్డీ మొత్తాలు కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల వరకు ఎగనామం పెడితే వాటి ద్వారా ఆ సంస్థ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.35 వేల కోట్లు పైమాటే. ఈ సంస్థపై దేశవ్యాప్తంగా 29 కేసులు నమోదయ్యాయి. అందులో 15 కేసులు రాష్ట్రంలోనే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్, అండమాన్, నికోబార్ దీవులకు చెందిన 32,52,632 ఖాతాదారులు, మరో 8 లక్షల మంది ఏజెంట్లు రూ.7,623 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19,43,497 మంది ఖాతాదారులు రూ.3,965కోట్లు డిపాజిట్లు చేశారు. నమ్మకమే పెట్టుబడిగా కోట్లు గుంజేసిన అగ్రిగోల్డ్ సంస్థ 2014 నుంచి తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. ఆదుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు మీనమేషాలు లెక్కించారు. డిపాజిటర్లను ఆదుకోవాల్సిన అధికారపక్షం లోపాయికారిగా అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్ తదితర విలువైన ఆస్తులు కొట్టేసే పనిలో పడింది. ‘సిరిగోల్డ్’ సరేసరి.. అత్యధిక వడ్డీ ఆశ చూపి 45వేల మంది నుంచి రూ.95కోట్లు డిపాజిట్లు వసూలు చేసిన సిరిగోల్డ్ సంగతి సరేసరి. 2014లో ఈ మోసాన్ని గుర్తించిన బాధితులు పోలీస్స్టేషన్లను ఆశ్రయించడంతో 8 కేసులు నమోదయ్యాయి. సీఐడీ దర్యాప్తు చేపట్టినప్పటికీ డిపాజిటర్లను ఆదుకునే చర్యలు శూన్యం. ‘బొమ్మరిల్లు’.. జనం జేబు చిల్లు రియల్ ఎస్టేట్, రోజువారీ వడ్డీ, డిపాజిట్లు, నెలవారీ స్కీమ్స్ పేరుతో బొమ్మరిల్లు సంస్థ జనం జేబుకు చిల్లుపెట్టింది. బొమ్మరిల్లు ఫారమ్స్ అండ్ విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, రాజా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొమ్మరిల్లు ఫుడ్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొమ్మరిల్లు సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, బొమ్మరిల్లు కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి అనేక సంస్థల పేరుతో వసూళ్లు చేశారు. 20వేల మంది నుంచి రూ.85కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో 2014 నుంచి ఆరు కేసులు నమోదయ్యాయి. అతీగతీలేని ‘అక్షయగోల్డ్’ కేసు.. మరోవైపు.. అక్షయగోల్డ్ కేసు కూడా అతీగతీ లేకపోవడంతో డిపాజిటర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దేశంలో 15.94 లక్షల మంది నుంచి రూ.735 కోట్లు డిపాజిట్లు సేకరించగా రాష్ట్రంలో 10.11 లక్షల మంది నుంచి రూ.335.75 కోట్లు డిపాజిట్లు సేకరించాక సంస్థ బోర్డు తిప్పేసింది. లబోదిబోమమంటూ డిపాజిటర్లు పోలీస్స్టేషన్లను ఆశ్రయించడంతో రాష్ట్రవ్యాప్తంగా 19 కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 2012 నుంచి కేసులు నమోదైనప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కూడా ఐదేళ్లుగా డిపాజిటర్లకు న్యాయం జరగలేదు. హడలెత్తించిన ఆర్థిక మోసాలు.. సాక్షాత్తు రాష్ట్ర సచివాలయాన్ని కేంద్రంగా చేసుకున్న ఓ ముఠా.. కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిన ఘటనలు గడిచిన రెండేళ్లలో రెండుసార్లు జరగడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దంపడుతోంది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను ఎరవేసి వారి నుంచి ఏకంగా రూ.51.44 లక్షలు వసూలు చేసి వారిని నిలువునా ముంచేశారు. అలాగే, ఆక్వా చెరువుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఐడీబీఐ బ్యాంకులో ఏకంగా రూ.540 కోట్లు కొట్టేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అక్రమార్కుల అకృత్యాలకు అంతేలేకుండా పోతోంది. కాగా, రాష్ట్రంలో 2017లో 5,616 చీటింగ్ కేసులు నమోదు కాగా.. 2018లో 5,705 మోసాలు జరిగాయి. ఆర్థికపరమైన మోసాలు ఇలా పెరగడం ప్రమాదకరమైన సంకేతమని ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించడం రాష్ట్రంలో ఈ పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ‘అభయగోల్డ్’ అంతే సంగతి.. రాష్ట్రంలో 2013లో వెలుగుచూసిన అభయగోల్డ్ వ్యవహారంలోను చంద్రబాబు సర్కారు ప్రేక్షకపాత్రే వహించింది. రియల్ ఎస్టేట్ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 3.99 లక్షల మంది నుంచి రూ.221 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీనిపై 19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ఆస్తుల ఎటాచ్మెంట్ వంటి చర్యలు మినహా బాధితులకు న్యాయం చేకూర్చిన దాఖలాల్లేవు. -
కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత అరెస్ట్
కర్నూలు : కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశరెడ్డిని కర్నూలు సీసీఎస్ పోలీసులు గతరాత్రి అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 700 కోట్లకు పైగా అప్పుల ఎగవేతకు పాల్పడ్డారని ఆయనపై అరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. విద్యార్థుల తల్లిందండ్రుల వద్ద రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు కేశవరెడ్డి విద్యాసంస్థ యాజమాన్యం వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే తమ నుంచి సేకరించిన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు కోరుతున్నప్పటికీ యాజయాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న విషయం విదితమే. తమ డిపాజిట్లు తమకు ఇప్పించాలంటూ బాధితులు పోలీసులను కోరుతున్నారు.