breaking news
Kaveri waters
-
మా ఆదేశాలు పాటించాల్సిందే
♦ తమిళనాడుకు 18 వేలక్యూసెక్కుల కావేరి నీరివ్వండి ♦ కర్ణాటకకు సుప్రీం ఆదేశం సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు కావేరి జలాలను రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీటిని వదలకూడదని కర్ణాటక ఉభయసభలు తీర్మానం చేసినా.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కావేరి నీటిని తమిళనాడుకు వదిలే విషయమై ఈ నెల ఐదు నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘కర్ణాటక మొండి పట్టుదల వల్ల ప్రతిసారీ మీ వద్దకు రావాల్సి వస్తోంది. బెంగళూరు కావేరి పరీవాహక ప్రాంతంలోనిది కాకపోయినా, అక్కడివారి తాగునీటి కోసం కావేరి జలాలను ఉపయోగించడం సరికాదు. సమస్య పరిష్కారానికి కేంద్రాన్ని మధ్యవర్తిత్వం వహించేలా ఆదేశించండి’ అని తమిళనాడు తొలుత కోర్టును కోరింది. ‘ఈ సమయంలో కేంద్రం కలుగజేసుకోవడానికి వీలవుతుందా’ అని అటార్నీ జనరల్ రోహ త్గీని కోర్టు ప్రశ్నించగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఇద్దరు సీఎంలు, కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలనికోర్టు సలహా ఇచ్చింది. తర్వాత కర్ణాటక తరఫున ఫాలీనారిమన్ వాదనలు వినిపించారు. ‘రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో నీటిని నవంబర్ వరకూ వదలడం వీలవదు’ అని తెలిపారు. ‘ఇప్పుడు లేనిది అప్పుడు ఎలా వదులుతార’ని కోర్టు ప్రశ్నించింది. ‘దేవుని దయ. ఆలోగా వానలు కురవొచ్చ’ని ఆయన అన్నారు. నారిమన్ ఉభయసభల తీర్మానాన్ని ప్రస్తావించగా, న్యాయమూర్తులు కొంత గట్టిగా ‘ మా ఆదేశాన్ని పాటించాల్సిందే. సమాఖ్య విధానంలో పొరుగు రాష్ట్రాల అవసరాలను సంబంధిత రాష్ట్రాలు గుర్తించాలి’ అంటూ తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేశారు. తాజా ఆదేశంతో ఈ వివాదంపై ఈ నెలలోనే నాలుగుసార్లు కర్ణాటకకు సుప్రీంలో చుక్కెదురైంది. కాగా, తమిళనాడు సీఎం జయలలిత ఆసుపత్రిలోనే ఈ అంశంపై భేటీ నిర్వహించారు. -
రోజుకు 12 వేల క్యూసెక్కులు వదలండి
తమిళనాడుకు కావేరి నీటి విడుదలపై ఆదేశానికి సుప్రీంకోర్టు సవరణ - తీర్పును వారం పాటు నిలిపివేయాలన్న కర్ణాటక వినతికి తిరస్కృతి - నీటి పరిమాణం కొంత తగ్గించినా.. విడుదల రోజులు పెంచిన వైనం - ప్రజలు తమకు తాముగా చట్టంగా మారజాలరని స్పష్టీకరణ సాక్షి, బెంగళూరు: కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు రెండూ శాంతిభద్రతలు నెలకొనేలా చూడాలని సుప్రీం కోర్టు సోమవారం సూచించింది. కావేరి జలాల పంపిణీకి సంబంధించి రోజుకు 15 వేల క్యూసెక్కుల పది రోజుల పాటు తమిళనాడుకు నీరు విడుదల చేయాల్సిందిగా ఈ నెల 5న కర్ణాటకను సుప్రీం ఆదేశించడం విదితమే. ఆ తీర్పును.. కావేరి నీటి విడుదలపై తమ రాష్ట్రంలో చెలరేగిన శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో వారం రోజుల పాటు నిలిపివేయాలన్న కర్ణాటక విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే.. ఆ ఆదేశాలను సవరించి.. తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున ఈ నెల 20 వరకూ నీటిని విడుదల చేయాలని తాజాగా నిర్దేశించింది. తాజా ఆదేశాలను అమలు చేసేలా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. తమిళనాడుకు నీటి విడుదలపై 5నాటి తీర్పును వారం పాటు నిలిపేయాలని, ఆ ఆదేశాలను సవరించాలని కర్ణాటక శనివారం వేసిన పిటిషన్‌పై.. జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ యు.యు.లలిత్‌ల ద్విసభ్య ధర్మాసనం సోమవారం కోర్టుకు సెలవు అయినా కూడా సమావేశమై వాదనలు విని, తాజా ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈలోగా కావేరి జలాలపై పర్యవేక్షక కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాజా తీర్పు వల్ల తమిళనాడుకు అదనంగా 2-3 టీఎంసీలు వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందని కన్నడ సంఘాలు అంటున్నాయి. ఎంత నీరు వదలాలో తీర్పు ప్రతిని అధ్యయనం చేసిన తర్వాతే చెప్పగలమని కర్ణాటక నీటి పారుదల అధికారులు అంటున్నారు. పిటిషన్లో ‘భాష’పై ఆక్షేపణ..: ఇదిలావుంటే.. కావేరి జలాలపై తీర్పును నిలిపివుంచాలని, ఆ తీర్పును సవరించాలని కోరుతూ కర్ణాటక సమర్పించిన దరఖాస్తులో ఉపయోగించిన భాషను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఒక తీర్పులో సవరణను కోరడానికి.. అకస్మాత్తుగా లేదా ఏదైనా ఉద్దేశంతో రేగిన లేదా ఏదైనా ఉత్ప్రేరక అంశం వల్ల రూపొందిన ఆందోళన అనేది ఎన్నడూ ప్రాతిపతిక కాబోదని స్పష్టం చేసింది. ‘ఒక న్యాయ ఉత్తర్వును పాటించకపోవటానికి.. అధికార యంత్రాంగం శాంతిభద్రతల అంశాన్ని కారణంగా చూపజాలదు. ఉత్తర్వును పాటించకుండా ఉండటానికి చోటే లేదు. ఉల్లంఘనకు తావే లేదు. పౌరులు తమంత తాముగా చట్టంగా మారజాలరు. న్యాయస్థానం ఒక ఉత్తర్వును జారీ చేసినపుడు.. దానిని పాటించాల్సిన పవిత్ర ధర్మం పౌరులది. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే చట్ట ప్రకారం అనుమతించగల న్యాయ పరిష్కారాలను పాటించాలి. కర్ణాటక సమర్పించిన దరఖాస్తు భావం దీనిని ప్రతిబించటం లేదు.. పైగా దీనికి విరుద్ధంగా ఉంది. మేం దీనిని ఆక్షేపిస్తున్నాం’ అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. కావేరి కమిటీ నిర్ణయం వాయిదా న్యూఢిల్లీ: సుప్రీం ఉత్తర్వుల ప్రకారం కావేరి జలాలల్లో ఎంత మొత్తాన్ని తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు విడుదల చేయాలన్న అంశంపై.. కావేరి పర్యవేక్షక కమిటీ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. దీనిపై ఈ నెల 19న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించింది. కావేరి జలాల మళ్లింపు, వినియోగం, అనుమతి లేనప్పుడు నీటిని తీసుకున్నారన్న ఆరోపణలు, వర్షపాతంలో తేడాలు దాని ప్రభావం తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాలు పూర్తిగా అందించలేదని.. తగినంత సమాచారం అందుబాటులో లేనందున కమిటీ నిర్ణయానికి రాలేకపోయిందని ఈ భేటీకి అధ్యక్షత వహించిన కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్ అనంతరం మీడియాకు తెలిపారు.