breaking news
kanaparti Ramesh
-
శిక్షణ.. కాకూడదు శిక్ష
న్యూస్‌లైన్ , మంచిర్యాల సిటీ, వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుంటే ఇటు విద్యార్థులు.. అటు యువత వివిధ శిక్షణలు తీసుకోవాలనుకుంటారు. ఇది శారీరక, మానసిక ఉల్లాసానికి, దృఢత్వానికి మంచిదే. అయితే జిల్లాలో ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇంత వేడిని తట్టుకుంటూ క్రీడా శిక్షణ పొందడం అంత సులువు కాదు. వేడిమితో శరీరంలోని నీటి శాతం తగ్గడంతో వడదెబ్బ తగలి అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. అందుకే ఆర్యోగాన్ని కాపాడుకునేందుకు పిల్లలు, విద్యార్థులు, యువత.. వారి తల్లిదండ్రులు, శిక్షకులు అందరూ తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు శిక్షణ శిక్షగా మారకుండా సాఫీగా సాగుతుంది. - వేసవిలో క్రీడా శిక్షణ.. ఆరోగ్యంపై ప్రభావం - జాగ్రత్తలు పాటిస్తే సరి.. లేకుంటే ఇబ్బందికరం దుస్తులు శిక్షణ పొందే క్రీడాకారులు మందం దుస్తులు ఉపయోగించరాదు. అప్పర్, లోయర్ దుస్తులు, కాటన్ దుస్తులు ఉపయోగించడం శరీరానికి మంచిది. ఒకరోజు వాడిన దుస్తులను మరుసటి రోజు వేసుకోరాదు. ప్రస్తుత ఉష్ణోగ్రతలకు ఏ రోజుకారోజు దుస్తులు ఉతికినవే ధరించాలి. వాతావరణం మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో వాతావరణం కాస్త చల్లగా ఉన్నా మిగితా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీలు దాటి ఉంటోంది. రాత్రి సుమారు తొమ్మిది గంటల వరకు కూడా వాతావరణం వేడిగానే ఉంటోంది. ఇంతటి అత్యధిక వేడిలో ఆటలు ఆడటం, ఈత కొట్టడం, నృత్యం నేర్చుకోవాలంటే జాగ్రత్తలు కూడా అవసరమే. ఉదయం పదకొండు గంటల లోపు, సాయంత్రం ఐదు గంటల తరువాత క్రీడల్లో శిక్షణ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. ఉదయం శిక్షణ పొందిన వారు మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రిస్తే శరీరానికి హాయి కలుగుతుంది. గ్లూకోజ్ గ్లూకోజ్ పొడిని నీటిలో కలుపుకొని తాగితే శరీరానికి అదనపు శక్తి సమకూరుతుంది. కొందరు తింటారు. ఇలా చేస్తే శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గ్లాసెడు నీటిలో ఒక చెంచా పొడి కలిపి ఉదయం, సాయంత్రం తాగితే సరిపోతుంది. ఆహారం ఆకు కూరలు, కూరగాయలు, మజ్జిగ ప్రతిరోజు తీసుకోవడం మేలు. వీటితో పాటు నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం మరువరాదు. తాగునీరు ఉదయం పూట శిక్షణకు వెళ్లే క్రీడాకారులు తగినంత నీరు తాగాలి. వెంట తప్పనిసరిగా నీరు ఉండాలి. ఉదయం పూట అరటి పండు తింటే శరీరంలో విటమిన్ లోపం తలెత్తదు. శిక్షణ ముగిసే వరకు ప్రతి రోజు పుచ్చకాయ తినడం శరీరానికి చాలా మంచిది. దీనిలో 90 శాతం నీరు ఉంటుంది. సామర్థ్యాన్ని మించరాదు శరీరం శక్తి సామర్థాలకు మించి శిక్షణ పొందరాదు. సామర్థ్యానికి మించి సాధన చేయకుండ ఆటలో నైపుణ్యం పెంచుకోవాలి. పోటీ పడి అధిక బరువులు ఎత్తడం, ఎక్కువ దూరం పరుగెత్తడం, వ్యాయామం చేయడం వలన శరీరంలోని నీటి శాతం తగ్గి కోలుకోలేని స్థితికి చేరుకుంటాం. అతి వేగంగా ఆటలు ఆడి వెంటనే నీరు తాగడం శ్రేయస్కరం కాదు. నాట్యంలో శిక్షణ పొందే వారికి శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి నీటిని అధికంగా తీసుకోవడంతో పాటు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరులో ఏదో ఒకటి తప్పనిసరిగా ప్రతి రోజూ ఉండాలి. చల్లని నీటితో స్నానం శిక్షణ పొందిన క్రీడాకారులు ఉదయం, సాయంత్రం చల్లని నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఎండలో చల్లని నీటితో స్నానం చేయరాదు. నీడ వసతి ఉన్న చోటనే చల్లని నీటితో ఎక్కువ సేపు స్నానం చేయాలి. చెరువుల్లో ఎండ పూట ఈత కొట్టరాదు. ఉదయం పదకొండు, సాయంత్రం ఐదు గంటల తరువాత ఈత కొలనులో శిక్షణ పొందాలి. నిపుణుల సలహాలు పాటించాలి వేసవిలో వివిధ క్రీడల్లో శిక్షణ పొందడం మంచి అవకాశం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలి. సాధన ఒకేసారి కాకుండా నెమ్మదిగా పెంచాలి. అధిక ఉష్ణోగ్రతలో సాధనను ఒకేసారి వేగవంతం చేయరాదు. శరీర సామర్థ్యం ఆసరాతోనే క్రీడల్లో శిక్షణ పొందాలి. బలహీన క్రీడాకారులు వేసవిలో శిక్షణకు దూరంగా ఉండటమే మేలు. ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు శిక్షణలో నిపుణుల సలహాలు తప్పక పాటించాలి. - కనపర్తి రమేశ్, క్రీడా శిక్షకుడు -
క్రీడాంశాలను మేనిఫెస్టోలో పెట్టాలి
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : రాజకీయ పార్టీలు క్రీడాంశాలను తప్పనిసరిగా మేనిఫెస్టోలో పెట్టాలని జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కనపర్తి రమేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఏఎంసీ మైదానంలో అమేచర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. వీటికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల నిర్వహణకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నామన్నారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులు క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. క్రీడలను, క్రీడాకారులను నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల్లో ‘నోటా’ ఓట్లు వేసి నిరసన తెలుపుతామన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో దీర్ఘకాలం నుంచి పీఈటీల నియామకాలు జరగడం లేదన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ రెవెన్యూ డివిజన్లో తప్పనిసరిగా స్పోర్ట్స్ పాఠశాల ఏర్పాటు చేసి, క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. రెజ్లింగ్ పోటీలు ప్రారంభం అమేచర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలను శాంతిఖని గని మేనేజర్ బుచ్చయ్య ప్రారంభించారు. వివిధ ప్రాంతాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో అమేచర్ రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.