breaking news
Kaho Naa Pyaar Hai
-
హృతిక్ ఈజ్ రోషన్
‘కహో నా ప్యార్ హై ’తో మొదలుపెట్టాడు. అంటే... ‘నన్ను ప్రేమిస్తున్నానని చెప్పవా’ అని ఈ సినిమాతో అడిగాడు ఒకరా... ఇద్దరా... కోకొల్లలు ప్రేమించే అభిమానులు ఎందరో! ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడే హృతిక్‌లో ఎంత రోషన్ ఉందో... ఆ రోషన్ కోసం ఎంతమంది పడి చస్తున్నారో అర్థమైంది. రియల్లీ హృతిక్ ఈజ్ రోషన్.. ప్రేమకే వెలుగు చూపించినవాడు ఇతనేనేమో! కెహ్ దియా ప్యార్ హై.. అవును... నిన్ను ప్రేమిస్తున్నాం! ♦ మీ నాన్నగారు రాకేష్ రోషన్‌కి ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో మంచి అనుబంధం ఉండేది కాబట్టి, తెలుగు సినిమాల గురించి మీతో చెబుతుంటారా? మా నాన్నగారు మూవీ లవర్. ఎక్కడ టాలెంటెడ్ ఆర్టిస్టులున్నా వాళ్ల గురించి నాతో చెబుతుంటారు. సౌత్ మూవీస్ టెక్నికల్‌గా బాగుంటాయని నాన్నగారు అంటారు. నాది కూడా సేమ్ ఓపీనియనే. నేను అప్పుడప్పుడూ సౌత్ మూవీస్ చూస్తుంటాను. ♦ ఇక్కడ హైదరాబాద్‌లో మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? రానా మంచి ఫ్రెండ్. తను చాలా ఎనర్జిటిక్. మేం కలిస్తే సందడి సందడిగా ఉంటుంది. రానా ఆకారమే కాదు.. హార్ట్ కూడా పెద్దదే. చాలా మంచివాడు. పింకీరెడ్డి కూడా మంచి ఫ్రెండే. నా చిన్నప్పుడు స్కూల్ సెలవుల్లో హైదరాబాద్ వచ్చేవాళ్లం. పింకీరెడ్డి వాళ్ల ఇంట్లో కూడా ఉండేవాణ్ణి. ఇప్పుడు కూడా ఏదైనా పని మీద హైదరాబాద్ వస్తే, పింకీరెడ్డి వాళ్లను కలుస్తుంటాను. ఇంకా ఇక్కడ చాలామంది స్నేహితులు ఉన్నారు. ♦ సౌత్‌లో సీనియర్ ఆర్టిస్టుల్లో మీకు ఎవరితోనైనా పరిచయం ఉందా? రజనీకాంత్ సార్‌తో పరిచయం ఉంది. చిన్నప్పుడు నేను కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాను. వాటిలో రజనీ సార్ నటించిన హిందీ చిత్రం ‘భగవాన్ దాదా’ ఒకటి. మా నాన్నగారే ప్రొడ్యూసర్. ఆయన యాక్ట్ చేశారు కూడా. రజనీ సార్ ఎంత మంచి మనిషంటే మా ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ తీస్తున్నప్పుడు నేను టేక్స్ మీద టేక్స్ తీసుకునేవాణ్ణి. కానీ, రజనీ సార్ నేను భయపడతానని తనే తప్పు చేసినట్లు కలరింగ్ ఇచ్చేవారు. ‘హౌ ఫెంటాస్టిక్’ కదా. ఆ సినిమా నాకు మంచి మెమరీ. ♦ చిన్నప్పుడు మాట్లాడటానికి తడబడిపోయేవారట.? ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాటలు సరిగ్గా వచ్చేవి కావు. కంగారు, తడబాటు. ఎగ్జామ్స్ రాయడం ఇబ్బంది అనిపించేది కాదు కానీ, ఓరల్ టెస్ట్‌లంటే భయం ఉండేది. స్కూల్ ఎగ్గొట్టడం కోసం కడుపు నొప్పనో, ఏదైనా దెబ్బ తగిలించుకోవడమో.. ఇలా ఏదోకటి చేసేవాణ్ణి. అమ్మా నాన్న గ్రహించి, ‘స్పీచ్ థెరపీ’ ప్రాక్టీస్ చేయించారు. అది హెల్ప్ అయింది. ♦ పర్సనల్, ప్రొషెషనల్‌గా మీ టైమ్ ఎలా ఉందనుకుంటున్నారు... మీ భార్య సుజానే నుంచి విడిపోవడం, కంగనాతో వివాదం...? పర్సనల్ విషయాలు మాట్లాడనండి. జరిగేవి జరగకుండా మానవు. ‘ఇలా జరిగిందేంటి? మన టైమ్ బ్యాడేమో’ అని ఎనలైజ్ చేసుకుని బాధపడితే జరిగినవన్నీ మాయమైపోతాయా? జరిగేవన్నీ జరగకుండా ఆగుతాయా? అందుకే జీవితం ఎలా వెళుతోంది? మనం ఎటు వెళుతున్నాం? అని అదే పనిగా ఆలోచించి, టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. ♦ మరి.. సినిమా సినిమాకీ ఎక్కువ గ్యాప్ తీసుకుని టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు? కావాలని వేస్ట్ చేస్తానా? ఈ మధ్య ‘మొహెంజొదారో’ సినిమా చేశాను. దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ ఆ సినిమాని వంద రోజుల్లో పూర్తి చేస్తానని, రెండొందల రోజులు తీసుకున్నాడు. ఏం చేయమంటారు? డెరైక్టర్ చెప్పింది చేయాలి కదా. ♦ ఓకే... మీరు చాలా హైట్ కాబట్టి స్కూల్లో మీరే లాస్ట్ బెంచేమో? ఫస్ట్ బెంచ్‌లోనే కూర్చునేవాణ్ణి. ఎందుకంటే నేను చిన్నప్పుడు పొట్టిగా ఉండేవాణ్ణి. నా వయసు పిల్లలందరూ నాకంటే కొంచెం హైట్‌గా ఉండేవారు. దాంతో మా నాన్నగారు బాధపడిపోయేవారు. చెక్కతో దూలాన్ని తయారు చేయించి ఉదయం, సాయంత్రం దాన్ని పట్టుకుని వేలాడమనేవారు. నేను వేలాడుతున్నానా? లేదా? అని మాటి మాటికీ చెక్ చేసేవారు. 17 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను బాగా హైట్ అయ్యాను. నాలుగైదేళ్లుగా ప్రపంచంలోనే సెక్సీయస్ట్ ఏషియన్ మెన్లో మీ పేరు మిస్ కాకపోవడం ఎలా అనిపిస్తోంది? సెక్సీయస్ట్ మేన్ అనిపించుకున్నందుకు నేను లక్కీ కాదు. ఆ దేవుడు నాకో అందమైన లోపం ఇచ్చాడు (కుడి చేతికున్న ఆరు వేళ్లను ఉద్దే శిస్తూ). మన లోపాలు మనల్ని బలవంతుల్ని చేస్తాయి. ఆరు వేళ్లతో నా చెయ్యి పర్ఫెక్ట్గా ఉండదు. అది ‘బ్యూటిఫుల్ ఇన్పర్ఫెక్ట్’. అందుకే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ♦ అలా వేలాడడటం వల్లే హైట్ పెరిగానంటారా? అయ్యో అలా అనడం లేదు. హైట్ తక్కువగా ఉన్నవాళ్లందరూ వేలాడాలని అనుకుంటారేమో. అలా చేయొద్దు. ♦ ఇక్కడ బాగా ఎత్తుగా, హ్యాండ్సమ్గా ఉన్నవాళ్లను ‘తెలుగు హృతిక్ రోషన్’ అంటుంటారు. మీ ఫీలింగ్? ఓహ్. వినడానికి చాలా బాగుంది. హిందీ ప్రేక్షకులు అభిమానం కనబర్చడం సహజం. తెలుగు ప్రేక్షకులకూ దగ్గర కాగలిగానంటే లక్కీ. ♦ మీలా ఆరు వేళ్లు ఉన్నవాళ్లు లక్కీ అట కదా? లక్ అనుకుంటే లక్. బ్యాడ్ లక్ అనుకుంటే బ్యాడ్ లక్. ఏదైనా మనం అనుకోవడం బట్టే ఉంటుంది. ♦ హ్యాండ్సమ్ అని మీ గురించి కాంప్లిమెంట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? కాంప్లిమెంట్స్ చాలా డేంజరస్. కొంతమంది మనం అందంగా లేకపోయినా ఉన్నామంటారు. ఉన్నా.. లేమంటారు. వీటిని మనసుకి తీసుకోకూడదు. అభినందనల వల్ల అహం వచ్చే అవకాశం ఉంది. విమర్శించా రని బాధపడితే ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది. అందుకే మన గురించి మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. ఒకవేళ మన నడవడిక గురించి ఏమైనా కామెంట్ చేశారనుకోండి.. అప్పుడు మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి. ♦ మీ ఇద్దరి పిల్లలు రెహాన్, రిదాన్లతో ఎప్పుడూ హాలిడే ట్రిప్స్ వెళుతుంటారు. గుడ్ డాడ్ అన్న మాట? నా పిల్లల గురించి చెప్పే ముందు మా నాన్నగారి గురించి చెబుతా. ఆ దేవుడు మంచి తండ్రి ని ఇచ్చాడు. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా మా నాన్నగారు నాకు కొండంత అండగా ఉంటారు. నేను నా పిల్లలకు అంత మంచి డాడ్గా ఉండాలనుకుంటున్నాను. మా ముగ్గురికీ ట్రావెల్ చేయడం అంటే ఇష్టం. ఎక్కువగా విదేశాలు వెళతాం. పిల్లలతో స్పెండ్ చేసినప్పుడు నాకు మరో ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది చాలా అందమైన ప్రపంచం. అన్నిటికన్నా నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చే ప్రపంచం అది. ♦ మీ సినిమాలు చూసి మీ పిల్లలు ఏమంటారు? ‘సినిమా బాగుంది.. బాగా యాక్ట్ చేశావ్’ అని వాళ్లు అంటే, ఆనందపడిపోతా. పిల్లల అభినందనలు ఆస్కార్ అవార్డు కన్నా గొప్పవి. అయితే నా ఆనందం కోసం అభినందనలు చెప్పాలని నా పిల్లలు అనుకోరు. ఒకవేళ నచ్చకపోతే ఆ విషయాన్ని మొహం మీదే చెప్పేస్తారు. ♦ ఫైనల్లీ... లైఫ్ ఎలా ఉంది? నో కంప్లైంట్స్.. బాగుంది. - డి.జి. భవాని -
ఓ తండ్రి మాయాజాలం
కోయీ మిల్ గయా దేడ్ కహానీ - కోయీ మిల్గయా అది 8, ఆగస్ట్, 2013 - ఎవరో... కలిశారు. కోయీ... మిల్గయా. ఆ ఎవరో పేరు జాదూ. ఒక అశక్తుడికి సర్వశక్తి యుక్తులూ సెకన్లలో రావడమే జాదూ అంటే - మాయాజాలం, మ్యాజిక్. కహో నా ప్యార్ హై... లాంటి సూపర్‌హిట్ సినిమాతో ఎంటర్ అయ్యాక, వరుసగా ‘ఫిజా’, ‘మిషన్ కాశ్మీర్’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటం, ‘కభీ కుషీ కభీ గమ్’ హిట్ అయినా అది హీరో షారుక్ ఖాన్‌కి, డెరైక్టర్ కరణ్ జోహార్‌కి మాత్రమే ప్లస్ అవ్వడం - దర్శకుడు, నిర్మాత, కథకుడు రాకేష్ రోషన్‌ని ఆలోచనలో పడేసింది. కొడుకు కెరీర్‌ని మళ్లీ తానే గాడిలో పెట్టాలనుకున్నట్టున్నాడు - ఇంకో ‘మ్యాజిక్’ చేశాడు - ఆ జాదూ పేరే ‘కోయీ మిల్ గయా’. ఫక్తు కమర్షియల్ అంశాలున్న సైన్స్ ఫిక్షన్ ఇది. ఈ కథ గురించి చెప్పాలంటే, 40 ఏళ్లు వెనక్కి వెళ్లి ఇంకో చిన్న కథ గురించి చెప్పుకోవాలి. టింగ్... టింగ్... టింగ్... (ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్స్) 1962లో విశ్వవిఖ్యాత భారతీయ దిగ్దర్శకుడు సత్యజిత్ రే తన ఫ్యామిలీ మ్యాగజైన్ ‘సందేశ్’ కోసం ‘ది ఎలియన్’ అనే కథ రాసుకుని ప్రచురించారు. మిస్టర్ ‘అంగ్’ అనే ఒక గ్రహాంతర వాసి, బెంగాల్‌లోని ఒక కుగ్రామంలో అంతరిక్ష విమానంలోంచి దిగి, ఆ పల్లెటూళ్లో ‘హాబా’ అనే ఓ అమాయకపు బాలుడిని కలవడం, ఆ అంతరిక్ష విమానాన్ని గ్రామస్థులు సరస్సులో వెలసిన దేవాలయంలా భావించి పూజించడం... ఇలాంటి ఇతివృత్తంతో రాసుకున్న కాల్పనిక కథ ఇది. హాలీవుడ్ తెరమీద మన కథ! తర్వాత రోజుల్లో ‘ది ఎలియన్’ కథని ఇండో-అమెరికన్ సంయుక్త నిర్మాణంలో కొలంబియా పిక్చర్స్ సంస్థ అప్పటి హాలీవుడ్ సూపర్‌స్టార్ మార్లన్ బ్రాండోని ప్రధాన పాత్రధారిగా, సత్యజిత్ రే దర్శకత్వంలోనే సినిమా తీద్దాం అనుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. కానీ, ఆ కథని మైక్ విల్సన్ అనే వ్యక్తి తన పేరున రిజిస్టర్ చేసుకుని మార్కెట్ చేసుకోవడం ఆరంభించాడు. ఎక్కువ కాలం వేచి ఉండలేక, సత్యజిత్ రే భారతదేశానికి వచ్చేశారు. ఆ తర్వాత 1977లో ‘క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’, 1979లో ‘ఎలియన్’, 1982లో స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో ‘ఈ.టీ.’ (ఎక్స్ట్రా టెరస్ట్రియల్) సినిమాలు వరుసగా వచ్చాయి. వాటన్నింటి మూలం భారతీయ దర్శక మేధావి సత్యజిత్ రే కథ ‘ది ఎలియన్’ అని హాలీవుడ్ పరిశ్రమ మొత్తానికి తెలుసు. కథా చౌర్యం కురిపించిన కాసుల ఖజానాలో కథ రాసిన ఒరిజినల్ రైటర్ సత్యజిత్ రేకి రూపాయి కూడా రాలేదు. కానీ, ఆ చిత్రాలకి భారతదేశం ఇచ్చిన రెవెన్యూ వాటి కలెక్షన్ల మొత్తంలో పాతిక శాతం పైనే. టింగ్... టింగ్... టింగ్... (ఫ్లాష్ బ్యాక్ ఎండ్స్) ప్రస్తుతంలోకొస్తే ఇంచుమించు అనే కథావస్తువుతో ‘హాబా’ అనే బాలుడి పాత్రని కొద్దిగా మార్చి, మనిషి ఎదిగినా మెదడు ఎదగని అమాయకుడి పాత్ర రోహిత్ మెహ్రాగా మలచి, తన కొడుకు హృతిక్ రోషన్ సైజుకి తగ్గట్టు పాత్రని కుట్టాడు తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్. రెయిన్ మ్యాన్, ఫారెస్ట్ గంప్, స్వాతిముత్యం తదితర చిత్రాల్లోని హీరో పాత్రల్లా హృతిక్ రోషన్‌కి స్టార్ హీరోగా మాత్రమే కాదు మంచి నటుడిగా కూడా పేరు, అవార్డులు తెచ్చిపెట్టింది ‘కోయీమిల్ గయా’. ఇంగ్లిష్ టేకింగ్కి భారతీయ మసాలా! గ్రహాంతర వాసి ‘జాదూ’, అమాయకుడైన రోహిత్ మెహ్రాని మామూలు యువకుడిగా మార్చడం, తన అతీత శక్తులతో రోహిత్, అతని స్నేహితులని హీరోలను చేయడం, వాళ్ల శత్రువుల్ని విలన్లను చేసి ఆటపట్టించి, ఓడించడం - ఇందులో భాగంగా ఆ హిల్‌స్టేషన్ కలెక్టర్ కూతురు నిషా (ప్రీతిజింతా), రోహిత్ ప్రేమలో పడటం, చివరికి ‘జాదూ’ని మానవ మృగాల బారినపడనివ్వకుండా రోహిత్ హీరోచితంగా పోరాడి, అతడిని గ్రహాంతర వాసులతో కలిపి సేఫ్‌గా స్పేస్‌షిప్ ఎక్కించి పంపించడం - రాజేష్ రోషన్ అద్భుతమైన పాటలతో, ఇంగ్లిష్ సినిమాలకి ఏ మాత్రం తీసిపోని విజువల్ ఎఫెక్ట్స్‌తో, భారతీయ ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్లు మసాలా రుచులు పర్ఫెక్ట్గా మేళవించి మిలీనియమ్ మొదలైన మూడేళ్లలో రెండో సూపర్ డూపర్ హిట్ నమోదు చేశారు తండ్రి రాకేష్, తనయుడు హృతిక్ రోషన్లు. తత్ఫలితంగా భారతీయుడి మేధస్సుకి (సత్యజిత్ రే) ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ పట్టం కట్టినట్టు కూడా అయింది. పోస్టర్ చూస్తే... ‘కోయీ మిల్ గయా’ పోస్టర్ చూడగానే, హృతిక్, ప్రీతిజింతాల అందమైన ప్రేమకథ కాబోసు అనిపించింది. రాకేష్ రోషన్ సినిమా కాబట్టి కహో నా ప్యార్ హై తర్వాత కచ్చితంగా ఇంకో ప్రేమకథే తీసుంటారు అనిపించింది. ఆడియో వినగానే అన్ని పాటలూ పక్కగా ప్రేమకథా చిత్రాల్లోని పాటల్లాగే ఉంటాయి. ‘కోయీ మిల్ గయా’ అనే టైటిల్ సాంగ్ పాడినది మన దక్షిణాది మధుర గాయని చిత్రగారు. ఆ పాట సూపర్‌హిట్. ‘ఇదర్ చలా మై ఉదర్ చలా’ పాట, ‘హైలా..’ పాట కూడా వినడానికి చాలా బావున్నాయి. థియేటర్లో కూచున్నాక, బ్రహ్మాండమైన సర్ప్రైజ్. అది గుర్తుతెచ్చుకోవాలన్నా, అనుభూతి చెందాలన్నా మళ్లీ ఓసారి చూడాల్సిందే. తల్లిగా రేఖ నటన మళ్లీ కనువిందు చేస్తుంది. ఇవాళ్టి ప్రముఖ హీరోయిన్ ‘హన్సిక’ ఇందులో బాల నటి. ఈ చిత్రం సాధించిన ఘనవిజయం బాలీవుడ్ తెరమీద హృతిక్ రోషన్‌ని ఆబాలగోపాలం మెచ్చే సూపర్ హీరోని చేసింది. ఈ చిత్రానికి రెండు సూపర్ హిట్ సీక్వెల్స్ చేసేలా ప్రేరేపించింది. హాలీవుడ్‌కి ఒక సూపర్మ్యాన్లా, బ్యాట్‌మ్యాన్‌లా మనకి ‘క్రిష్’ అనే ఓ వెండితెర సూపర్ హీరోని అందించింది. వచ్చేవారం...‘కల్ హో న హో’... రేపనేది ఉంటుందో ఉండదో - అని. ఆ ఆర్టికల్ కూడా ఇవ్వాళే రాసేయలేను కదా! కాబట్టి, రేపన్నది ఉందని నమ్మి, వచ్చే ఆదివారం కలుద్దాం. నమస్తే! మాటల్లో మెచ్చు తునకలు కొన్ని... * ‘ఓమ్’ అనేది పవిత్ర హిందూ నాదం. విశ్వంలో ఉన్న శబ్ద తరంగాలన్నీ ఒక్క ‘ఓమ్’లో ఉన్నాయి. * పిచ్చి అనేది ఒక గుణం - రోగం కాదు. కొంత మందికి షాపింగ్ పిచ్చి, కొంతమందికి తిండి పిచ్చి, కొంతమందికి సంగీతం పిచ్చి... ఇలా రకరకాల వ్యాపకాల పిచ్చి ఒక రకం అయితే, మామూలు కన్నా కొంచెం ఎక్కువో, తక్కువో ప్రతిస్పందించడాన్ని కూడా పిచ్చి అనుకోవచ్చు. * రకం పిచ్చికి సైకియాట్రిస్ట్‌లు మందు ఇస్తారు. నన్ను పిచ్చివాడన్నారు కదా! యస్. నేను పిచ్చివాడినే. మా అమ్మాయి ప్రేమలో పడిన పిచ్చివాణ్ని. * కంప్యూటర్ మనుషుల్ని తయారుచేయదు - మానవ మేధస్సే కంప్యూటర్స్‌ని తయారుచేసింది. మెదడు చేసేవన్నీ కంప్యూటర్ చేయలేదు. * ఎవరినీ చిన్నపిల్లలని చులకన చేయకండి సర్. ఆ పిల్లలే పెరిగి పెద్దవాళ్లవుతారు ఫ్యూచర్లో. * ఈ ప్రపంచం ప్రతి కొత్త విషయాన్ని ముందు తిరస్కరించింది. తర్వాతే అంగీకరించింది. * ఇలాంటి మంచి సంభాషణలతో పాటు గ్రహాంతర వాసులకి కూడా మంచి మనసు, ఆర్ద్రత, కన్నీరు, ఆనందం అన్నీ మనలాంటి భావాలే ఉంటాయని, ఈ తరం ప్రేక్షకులని ఒప్పించిన ఘనత దర్శకుడిది. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు