breaking news
Jurala reservoir project
-
కర్ణాటక కరుణించె
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ దౌత్యం ఫలించింది. కర్ణాటక ప్రభుత్వం కరుణించింది. భానుడి ప్రతాపానికి ప్రియదర్శిని జూరాలలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి పడిపోయి.. తాగునీటి ప్రమాద ఘంటికలు మోగుతోన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ఒప్పుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి శుక్రవారం రాత్రి నారాయణపూర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆదివారం తెల్లవారుజాము వరకు నీరు జూరాల ప్రాజెక్టులో చేరనుంది. జూరాల నుంచి రామన్‌పాడు, బీమా, కోయిల్‌సాగర్, కేఎల్ఐ తదితర ప్రాజెక్టుల్లో నీరు చేరనుంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావాసుల తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు నెలకొన్నాయి. ఇదీలా ఉంటే కర్ణాటక విడుదల చేసే 2.5 టీఎంసీలలో ఒక టీఎంసీ నీరు మధ్యనే ఆవిరైపోతుందని, కేవలం 1.5 టీఎంసీ మాత్రమే జూరాలకు చేరుకుంటుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ 100క్యూసెక్కుల నీరు ఆవిరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60శాతానికి పైగా గ్రామాలకు జూరాల ప్రాజెక్టు నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అయితే ఈ సారి భానుడు నిప్పులు చెరుగుతుం డడంతో ప్రతిరోజూ సుమారు వంద క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. 9.66 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో 3 టీఎంసీల నీరు ఉంటే దాన్ని డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం జలాశయంలో 1.93 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంది. అంటే డెడ్‌స్టోరేజీ కంటే ఒక టీఎంసీకి పైగా నీళ్లు తక్కువగా ఉందన్న మాట. నీటి లభ్యత లేకపోవడంతో ప్రధాన గ్రిడ్ ద్వారా ఆవాసా ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు మొదలయ్యాయి. చాలా చోట్ల నీటి కోసం ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో జూరాలలో తగ్గుతోన్న నీటి మట్టంపై ఆందోళన చెందిన ఇరిగేషన్ అధికారులు సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేసి.. పాలమూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలని గత నెలలోనే కర్ణాటక సీఎం కుమారస్వామికి లేఖరాశారు. లేఖపై స్పందించిన కర్ణాటక సీఎం అధికారులతో చర్చించి ప్రాజెక్టు నుంచి రెండున్నర టీఎంసీల నీటి విడుదలకు అంగీకారం తెలిపారు. జూరాలే కీలకం.. ప్రస్తుతం జూరాల వద్ద ఉన్న ప్రధాన గ్రిడ్ నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని 319 గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు ప్రతి రోజూ 50ఎంఎల్డీ సరఫరా అవుతోంది. ప్రస్తుతం నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో అధికారులు అప్రోచ్ కెనాల్‌ను జేసీబీలతో సరి చేస్తూ నీరు సరఫరా చేస్తున్నారు. మరోవైపు జూరాల ఎడమ కాల్వ ద్వారా విడుదలయ్యే నీటిని వనపర్తిలో ఉన్న రామన్‌పాడు ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. ప్రస్తుతం అక్కడి నుండి వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఉన్న 500 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే రామన్‌పాడులోనూ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కావడం ఆయా ప్రాంతాల్లో నెలకొననున్న నీటి ఎద్దడికి పరిష్కారం లభించింది. వీటితో పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించి కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 300 గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తారు. ఎవరిదీ పాపం? మూడు నెలల క్రితం వరకు జూరాలలో తాగునీటి అవసరాలకు సరిపడేంత నీటి లభ్యత ఉంది. తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా జలాశయంలో నీరు ఆవిరవుతూ వచ్చింది. దీంతో అధికారులు రబీ పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయితే జూరాల, బీమా ప్రాజెక్టుల పరిధిలోని పెబ్బేరు, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగు చేసిన వరి, వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయంటూ ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి లేఖరాశారు. దీనిపై స్పందించిన ఆయన నీటి విడుదలకు ఆదేశించారు. దీంతో జనవరి 6న సాగు కోసం జూరాల ఎడమ కాలువ నుంచి 0.7టీఎంసీల నీటిని తరలించారు. ఆ సమయంలో నీటిని తరలించకపోతే ఈ రోజు ఈ స్థాయిలో తాగునీటి కష్టాలు ఉండేవి కావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదీలా ఉంటే ప్రతి సంవత్సరం జూరాల ప్రాజెక్టులో నీళ్లు అయిపోగోట్టుకోవడం, కర్ణాటకను అడుక్కోవడం నాలుగేళ్లుగా ఓ తంతుగా మారింది. తాగు, సాగునీటి అవసరాలకు సంబంధించి ముందుచూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని.. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. -
జూరాల రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, జోగులాంబ గద్వాల: జురాల రిజర్వాయర్‌కు చెందిన 15 గేట్లను అధికారులు శనివారం ఎత్తివేశారు. ప్రస్తుతం జూరాల ఇన్‌ఫ్లో 1.40 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 1.42 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రస్తుత నిల్వ 8.830 టీఎంసీలు కాగా గరిష్ట నిల్వ 9.657 టీఎంసీలుగా ఉంది. కాగా... శుక్రవారం ఒక్కరోజే 1, 37,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. అలాగే ఇంకా వరద నీరు వస్తుండడంతో ప్రస్తుతం 15 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
జూరాల-పాకాల ప్రాజెక్టు రద్దు?
జూరాల: జూరాల-పాకాల ప్రాజెక్టును రద్దు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాలోని డిండి వరకు భూగర్భం ద్వారా నీటిని తరలించి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో సాగునీటిని అందించే లక్ష్యంతో జూరాల-పాకాల పథకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు సర్వేను నిర్వహించేందుకుగాను వ్యాప్కోస్ సంస్థకు ప్రభుత్వం ఆరు నెలల కాల పరిమితితో పనులను అప్పగించింది. అదేవిధంగా పాలమూరు పథకాన్ని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంస్థకు సర్వే బాధ్యతలను అప్పగించారు. పాలమూరు పథకం పనులకు సర్వేలో ప్రాథమిక దశ, సమగ్ర సర్వేలు పూర్తయ్యాయి. జూరాల-పాకాల పథకాన్ని చేపట్ట వద్దంటూ జిల్లాలో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలోనే డిండి పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. నల్లగొండ జిల్లాలో డిండి ద్వారా సాగునీటిని అందించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో జూరాల-పాకాల అంశాన్ని పక్కన పెట్టేశారు. పాకాల సర్వేను చేపట్టిన వ్యాప్కోస్ సంస్థ రూ.3.63 కోట్లతో సర్వేను పూర్తి చేయాల్సి ఉంది. సర్వేను ప్రారంభించి దాదాపు రూ.1.25 కోట్ల విలువైన పనుల సర్వేను పూర్తి చేసింది. ఈ దశలో ప్రభుత్వం మిగతా సర్వేపై స్పందించకపోవడంతో సర్వే సంస్థ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేను నిలిపివేసింది. ఎట్టకేలకు డిండి ప్రాజెక్టు రావడంతో జూరాల-పాకాల సర్వే జరిగిన పనులకు సంబంధించి సంబంధిత కంపెనీకి చెల్లింపులు జరిపి మిగతా సర్వేను పూర్తిగా రద్దు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటిక సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారుల ద్వారా తెలిసింది.