breaking news
Job application process
-
పర్యాటక వీసాతోనూ ఉద్యోగ దరఖాస్తులు: అమెరికా
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో ఉద్యోగం కోల్పోయి కొత్త కొలువు దొరక్క దేశం వీడాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్న హెచ్–1బి వీసాదారులకు, ముఖ్యంగా భారత టెకీలకు భారీ ఊరట! బిజినెస్ (బి–1), పర్యాటక (బి–2) వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకూ హాజరు కావచ్చని ఆ దేశ పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. ‘‘అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం చూసుకోలేని పక్షంలో అమెరికా వీడటం తప్ప మరో మార్గంలేదనే అపోహలో ఉన్నారు. మరింత కాలం దేశంలో ఉండేందుకు వారికి పలు మార్గాలున్నాయి. 60 రోజుల్లోపు వీసా స్టేటస్‌ను (బి–1, బి–2కు) మార్చుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ ముగిశాక కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చు’’ అని వివరించింది. అయితే ఉద్యోగం దొరికాక అందులో చేరేలోపు వీసా స్టేటస్‌ను తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయమై పలువురు వెలిబుచ్చిన పలు సందేహాలకు సమాధానంగా సంస్థ ఈ మేరకు ట్వీట్ చేసింది. బి–1 వీసాను స్వల్పకాలిక బిజినెస్ ప్రయాణాలకు, బి–2ను ప్రధానంగా పర్యాటక అవసరాలకు అమెరికా జారీ చేస్తుంటుంది. మాంద్యం దెబ్బకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా గత నవంబర్ నుంచి అమెరికాలోనే 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులయ్యారు. వీరిలో కనీసం లక్ష మంది భారతీయులేనని అంచనా! -
దరఖాస్తుకు సాంకేతిక తిరకాసు
► గురుకుల దరఖాస్తు ప్రక్రియలో వెబ్‌పేజీ ఆటంకాలు ► ఆందోళన చెందుతున్న అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తు పూరించే క్రమం నుంచి ఫీజు చెల్లించే వరకు పలు సమస్యలు తలెత్తడం చికాకు తెప్పిస్తోంది. సాధారణంగా ఒక్క దరఖాస్తు పూర్తి చేయడానికి పది నిమిషాలు పడుతుండగా సాంకేతిక సమస్యల కారణంగా గంటల తరబడి సమయం వృథా అవుతోంది. గురుకుల పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో 7,306 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో టీజీటీ 4,362 పోస్టులు కాగా 921 పీజీటీ, 6 ఫిజికల్ డైరెక్టర్, 616 పీఈటీ, 372 ఆర్ట్ టీచర్, 43 క్రాఫ్ట్ టీచర్, 197 మ్యూజిక్ టీచర్, 533 స్టాఫ్ నర్స్, 256 లైబ్రెరియన్ పోస్టులున్నాయి. వీటికి సంబంధించి ఈ నెల 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.కానీ, దరఖాస్తు ప్రక్రియలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అభ్యర్థులు హైరానా పడుతున్నారు. దరఖాస్తు చేసే క్రమంలో ముందుగా టీఎస్పీఎస్సీలో రిజిస్ట్రేషన్(ఒన్ టైమ్ రిజిస్ట్రేషన్) వివరాలను నమోదు చేయాలి. వివరాలు ఎంట్రీ చేసిన తర్వాత దరఖాస్తు ఫారం తెరుచుకుంటుంది. అందులో వివరాలు నమోదు చేసిన తర్వాత చివరగా సరిచూసుకోవడానికి ప్రివ్యూ ఆప్షన్ నొక్కిన వెంటనే వెబ్‌పేజీ స్తంభించిపోతోంది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో తిరిగి హోం పేజీ తెరిచి మొదట్నుంచి వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. అదేవిధంగా వివరాలు నమోదు చేసే క్రమంలోనూ అకస్మాత్తుగా పేజీ ఒకేచోట నిలిచిపోవడంతో మళ్లీ మొదటికోస్తోంది. అదేవిధంగా ఫీజును ఆన్లైన్ పద్ధతిలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు సహాయంతో చెల్లించినప్పటికీ దరఖాస్తులో వివరాలు అప్లోడ్ కావడం లేదు. దీంతో అభ్యర్థి ఖాతాలో నిధులు వినియోగించినట్లు చూపుతుండగా దరఖాస్తు పేజీలో మాత్రం ఫీజు చెల్లించాలని సూచన వస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘మీ సేవ’లోనూ అంతే! గురుకుల ఉద్యోగ దరఖాస్తుకు పలువురు అభ్యర్థులు మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తు పూరించిన తర్వాత మీసేవా నిర్వహకుల ఖాతా నుంచి ఫీజును చెలిస్తున్నారు. ఆన్లైన్ పద్ధతిలో ఫీజు చెల్లించే క్రమంలో ఖాతా నుంచి నగదు కోతకు గురైనప్పటికీ దరఖాస్తు ఫారంలో అప్లోడ్ కావడంలేదు. దీంతో నిర్వాహకులు డబుల్చార్జి వసూలు చేస్తున్నారు. ఇదిలావుండగా, ఆన్లైన్ చెల్లింపుల్లో నగదు కోత పడినప్పటికీ వివరాలు అప్లోడ్ కాకుంటే ఆమేరకు నిధులు తిరిగి ఖాతాదారుడి అకౌంట్లో జమవుతాయి. అయితే అందుకు కనిష్టంగా వారంరోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.