breaking news
Jio digital mission
-
జియో నిధుల్లో కొంత డెట్ ఫండ్స్‌లోకి!
డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియోలో వాటా విక్రయం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్పకాలిక డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు రిలయన్స్ జియోలో వాటా విక్రయం, మరోపక్క రైట్స్ ఇష్యూ చేపట్టడం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర అతి స్వల్పకాలిక, మనీ మార్కెట్ ఫండ్స్, తదితర రుణ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సగటున మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితిగల వివిధ రుణ సెక్యూరిటీలలో నిధులను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశాయి. 20 బిలియన్ డాలర్లు ఇటీవల రిలయన్స్ జియోలో వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ ఆర్ఐఎల్ 20 బిలియన్ డాలర్లను(రూ. 1,50,000 కోట్లకుపైగా) సమకూర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విదేశీ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటాలు కొనుగోలు చేసిన విషయం విదితమే. కొద్ది వారాలుగా పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ స్థాయిలో నిధులను సమీకరిస్తోంది. దీంతో ఆర్ఐఎల్ స్వల్పకాలిక పెట్టుబడులపై ఇటీవల ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆసక్తి పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కొంతమంది మనీ మేనేజర్ల వివరాల ప్రకారం ఇటీవల ఆర్ఐఎల్ సుమారు రూ. 35,000 కోట్లు(4.7 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారీ కార్పొరేట్ కంపెనీ నుంచి ఇటీవల రుణ సెక్యూరిటీలలోకి పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు మ్యూచువల్ ఫండ్ అడ్వయిజరీ సంస్థ వేల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. రుపీకి బలం ఇటీవల కొద్ది వారాలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ స్థాయిలో విదేశీ నిధులను సమీకరిస్తుండటంతో దేశీ కరెన్సీకి బలమొచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో గత నెల రోజుల్లో డాలరుతో మారకంలో రూపాయి 1 శాతానికిపైగా పుంజుకున్నట్లు తెలియజేశాయి. వెరసి ఆసియా కరెన్సీలలో రూపాయి ముందంజ వేసినట్లు తెలియజేశాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర ఆర్ఐఎల్ వడ్డీ రేట్ల ఆధారిత పెట్టుబడులకు మళ్లిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
రిలయన్స్ జియో మరో ఎత్తుగడ
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బిలీనియర్ ముఖేష్ అంబానీ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో ఎత్తుగడకు సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ రంగంలోనూ తన హవా చాటాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను రూపొందిస్తుందట. ఈ యాప్‌తో డివైజ్ ద్వారానే వాహన కదలికలను కంట్రోల్ చేయొచ్చట. కేవలం కారు కంట్రోలింగ్ వ్యవస్థనే కాకుండా ఇంధనం, బ్యాటరీ అయిపోతున్నప్పుడు కారు యజమానికి అలర్ట్ వచ్చేలా కూడా ఈ యాప్ దోహదం చేయనుందట. ''రిలయన్స్ జియో కారు కనెక్టెడ్ డివైజ్ రూపొందించడానికి సిద్ధమైంది. ఈ యాప్‌తో వాహనం దొంగతనానికి గురైనప్పుడు కారు కదలికలను ఓనర్ ఇట్టే కనిపెట్టేయొచ్చు. కారులో వై-ఫై వాడుకోవచ్చు. అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందడానికి కారు ఓనర్ తన డివైజ్‌లో జియో సిమ్ వాడాల్సి ఉంటుంది'' అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. దీనికోసం ఆటోమొబైల్ కంపెనీలతో జియో నడుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ డిజిటల్ మిషన్ ఆటో మొబైల్ మార్కెట్లోకి లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దీని ధర జియో మైఫై డివైజ్ ధర(రూ.2000) కంటే తక్కువగాను, సమానంగాను ఉండొచ్చని సమాచారం. కారు యాప్‌నే కాక, త్వరలోనే జియో టీవీలు వినియోగదారుల ముందుకు తీసుకు రానున్నట్టు తెలుస్తోంది.