breaking news
jeeps
-
‘మృత్యు’ ప్రయాణం!
...ఇది నక్కర్తమేడిపల్లి నుంచి పల్లెచెల్కతండాకు విద్యార్థులు ఆటోలో వెళుతున్న దృశ్యం. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రం నుంచి నక్కర్తమేడిపల్లి మార్గంలో ఉన్న మల్కీజ్‌గూడ, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాలకు ప్రయాణించాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కు. నిత్యం ఆటోలు, జీపుల్లో ప్రమాదకర పరిస్థితిలో వెళ్లక తప్పని దుస్థితి ఇది. లోపలా పైనా.. జనమే.. సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో ప్రయాణం ప్రమాదంలో పడింది. మారుమూల పల్లెలు, తండాలు, కొన్నిచోట్ల మండల కేంద్రాల నుంచీ ప్రజలు ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడం, నడిచినా పొద్దున ఓ ట్రిప్పు, సాయంత్రం మరో ట్రిప్పు మాత్రమే ఉంటుండటంతో జనాలకు ఆటోలు, జీపులే దిక్కు అవుతున్నాయి. ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పోటీలు పడి పరుగులు తీయించడం, సరిగా లేని రోడ్లు, ఫిట్నెస్ లేని వాహనాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే నిజామాబాద్ జిల్లా మెండోరాలో ఓ ఆటో వ్యవసాయ బావిలో పడిపోయి 11 మంది మృత్యువాత పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అందులో ఆరుగురు చిన్నారులుకాగా, ఐదుగురు మహిళలు ఉండటం ఆందోళనకరం. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో నూ ఈ తరహా పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ నుంచి నారాయణఖేడ్‌కు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతున్న ఆటో ఇది. లోపల 20 మంది, టాప్‌పైన మరికొంత మంది.. అసలే గుంతల రోడ్డు.. మితిమీరిన వేగం.. ఏ మాత్రం తేడా వచ్చినా భారీ దుర్ఘటన జరగక తప్పని పరిస్థితి. నిబంధనలున్నా.. పాటించే వారేరీ? ♦ ఆటోలు, జీపుల్లో కచ్చితంగా పరిమితిని పాటించాలి. దీనిని పాటించేవారే లేరు. ఏదైనా ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న వారెవరికీ ప్రమాద బీమా కూడా వర్తించదు. ♦ డ్రైవింగ్ చేసేప్పుడు సెల్ఫోన్లు వాడడం నిషేధం. ప్రైవేటు వాహనాల వారు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆటోల్లో అయితే పెద్ద ధ్వనితో పాటలు పెట్టి నడుపుతూ ఉంటారు. దానివల్ల ఎవరైనా హారన్ కొట్టినా వినపడే పరిస్థితి ఉండదు. అరకొర బస్సులు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలా గ్రామాలకు సరిగా బస్సు సౌకర్యం లేదు. ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు బస్సు సర్వీసు మాత్రమే ఉన్న గ్రామాలు ఎన్నో. ఇక తండాల పరిస్థితి మరీ దారుణం. రోడ్డు కూడా సరిగా ఉండదు. ఆటోల్లో ప్రయాణం కూడా ప్రమాదకరమే. నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళితేగానీ వాహనం ఎక్కలేని పరిస్థితి. పలు చోట్ల సరైన రోడ్డు ఉన్నప్పటికీ బస్సులు నడపడం లేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో వాటికి 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల నుంచి ఆటోలు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. రోడ్లు సరిగా ఉండకపోవటం, మితిమీరిన వేగం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మైనర్లు నడుపుతుండటం, సెల్ఫోన్లో మాట్లాడుతూ, ఇయర్ ఫోన్లో పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తుండటం వంటివి ఎక్కడ చూసినా కనిపిస్తుండటం ఆందోళనకరం. ప్రాణాలతో చెలగాటం ♦ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలకు నాలుగైదు కిలోమీటర్ల దూరం లో విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి కాలేజీలైతే పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. చాలామంది విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ♦ ఇక తెల్లవారక ముందే కూలీలు ఉపాధి కోసం బయలుదేరుతారు. పనుల కోసం పది ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోలపైనా ఆధారపడాల్సిన పరిస్థితి. ఇలా కూలీలతో వెళ్తున్న ఆటోలు బోల్తాపడడం, వాహనాలను ఢీకొనడం వంటి ఘటనల్లో పేద కూలీలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మంది బలయ్యారు కిందటేడాది అక్టోబర్ 20వ తేదీన రాత్రి వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందారు. వారంతా మేడ్చల్ జిల్లా కాప్రా మండలం నందమూరినగర్‌కు చెందిన వారు. బస్సు రాదు.. రోడ్డు సరిగా లేదు.. ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో సుమారు 60 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. పలు గ్రామాలకు బస్సు సౌకర్యమున్నా.. ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు తిరుగుతాయి. దాంతో ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ వందలాది గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ♦ గద్వాల జిల్లాలో రోజూ సుమారు 50 వేల మందికిపైగా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారని అంచనా. వనపర్తి జిల్లాలో 250కి పైగా జనావాసాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. వారికి ప్రైవేటు వాహనాలే దిక్కు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి. నిత్యం జిల్లాలో ప్రైవేటు వాహనాల్లో రెండు లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ♦ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల సంఖ్యలో ఆటోలు, జీపులు తిరుగుతున్నాయి. వాటిలో నిత్యం 2 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. సూర్యాపేట జిల్లాలో బస్సులు నడవని గ్రామాలు 30 వరకు ఉన్నాయి. ♦ ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 35 వేల వరకు ఆటోలు, తుఫాన్లు, జీపులు ఉన్నాయి. వీటిల్లో రోజూ మూడున్నర లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజూ సుమారు లక్షన్నర మంది వరకు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తారు. బస్సుల్లో ప్రయాణిస్తేనే రక్షణ ప్రయాణికులు తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న హడావుడిలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వారు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూడాలి. బస్సుల్లో ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యం చేరవచ్చు. – శంకర్‌నాయక్, ఖమ్మం ఇన్చార్జి ఆర్టీవో -
స్మగ్లర్ల వాహనాలకు తుప్పు
– సకాలంలో జరగని ఆన్లైన్ వేలం – జాప్యం జరిగేకొద్దీ పడిపోతున్న ధర – వేలం వేయాల్సిన వాహనాల విలువ 10 కోట్లకు పైనే – 200 కి పైగా వాహనాలు తూకానికి వేయాల్సిందే సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ స్మగ్లర్ల వాహనాలు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. వందలాది వాహనాలు ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. ఇప్పటికే 200 వాహనాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. వీటిని సకాలంలో వేలం వేసి అధిక మొత్తంలో ఆదాయాన్ని దక్కించుకునే విషయంలో అటవీ, ఆర్టీఏ శాఖలు నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాయి. దీంతో కోట్ల విలువ చేసే వాహనాలు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. గడచిన మూడేళ్లుగా చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఎంతో మంది ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి రెండున్నర వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు. వీటిలో కార్లు, లారీలు, వ్యాన్లు, జీపులు, టాటా సుమోలు, టవేరాల వాహనాలున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ఆయా జిల్లాల్లోని అటవీ శాఖ కార్యాలయ ప్రాంగణాల్లో మూలుగుతున్నాయి. తిరుపతికి దగ్గరలోని భాకరాపేట దగ్గర 2 ఎకరాల విస్తీర్ణంలో మరో 450 వాహనాలున్నాయి. ఇవి మాత్రమే కాకుండా తిరుపతి డీఎఫ్‌వో కార్యాలయ ప్రాంగణంలోనూ అడుగు ఖాళీ లేకుండా సీజ్డ్ వాహనాలను పెట్టారు. ఇవన్నీ రెండేళ్లుగా ఇక్కడే మూలుగుతున్నాయి. వీటిని నెలల తరబడి ఇలాగే ఉంచడం వల్ల టైర్లు, ఇతర స్పేర్లు మాయమవుతున్నాయి. సకాలంలో వీటిని వేలం వేయలేక అటవీ శాఖ అవస్థలు పడుతోంది... వేలం ప్రక్రియ జరగాలంటే... పట్టుకున్న వాహనాలను వేలం వేయడం అంత తేలికైన విషయం కాదనీ, నిబంధనల ప్రకారం ఇందుకోసం కనీసం ఆరు నెలలు వేచి ఉండాల్సిందేనని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. స్మగ్లర్ల నుంచి సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి మొదట ఓనర్షిప్ వివరాలను అటవీ శాఖ తీసుకుంటుంది. ఇందుకోసం రవాణా శాఖకు లెటర్ రాయాలి. వాహనాల నెంబర్ల ప్రకారం ఓనర్షిప్ వివరాలు తెలిశాక, ఆయా ఓనర్లకు నోటీస్‌లు జారీ చేస్తారు. ఓనర్ల నుంచి సమాధానం రాకపోతే పేపర్ ప్రకటన జారీ చేస్తారు. అప్పటికీ వాహనాల యజమానుల నుంచి స్పందన లేకుంటే, 1967 ఫారెస్ట్ యాక్టు సెక్షన్ 44 ప్రకారం వాహనాలను అటవీ శాఖ ప్రభుత్వం పరం చేసుకుంటున్నట్లు కాన్ఫికేషన్ ఆర్డర్లు జారీ చేసి మరోసారి వాహనాల విలువను నిర్ధారించమని రవాణా శాఖ అధికారులను కోరతారు. ఈ విధంగా వాహనాల విలువ «నిర్ణయించాక అన్లైన్ పద్దతిలో వేలం నిర్వహించి ఎక్కువ కోట్ చేసిన వారికి వాహనాలను అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి కనీసం ఆరు నుంచి ఏడాది కాలం పడుతుందనీ, ఒక్కోసారి రవాణా శాఖ నుంచి వివరాలు వెంటనే అందకపోతే మరింత ఆలస్యం జరుగుతుందని అటవీ శాఖ చెబుతోంది. ఇప్పటి వరకూ 1000 వాహనాలే వేలం... చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఉన్న 1000 పైగా వాహనాలను అటవీ శాఖ వేలం వేసింది. వారం రోజుల కిందటనే తిరుపతి అటవీ శాఖ అధికారులు 161 వాహనాలను వేలం వేశారు. వీటి ద్వారా రూ.1.20 కోట్ల ఆదాయం లభించింది. ప్రొద్దుటూరు, రాజంపేట, కడప డివిజన్లలోనూ వాహనాల వేలం జరగాల్సి ఉంది. వీటిని వేలం వేయడం ద్వారా రూ.10 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా. వీటన్నింటినీ మార్చిలోగా వేలం వేస్తామని తిరుపతి డీఎఫ్‌వో సుబ్బారెడ్డి తెలిపారు.