breaking news
Jeans manufacturing
-
క్రెడో బ్రాండ్స్ @ రూ. 266–280
మఫ్టీ బ్రాండ్ జీన్స్ తయారీ కంపెనీ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.96 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 266–280 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పురుషుల మధ్యస్థాయి ప్రీమియం, ప్రీమియం క్యాజువల్ వేర్ దుస్తుల తయారీలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా 404 ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్స్, 1,807 టచ్‌పాయింట్స్‌సహా 71 లార్జ్ ఫార్మాట్, 1332 మల్టీ బ్రాండ్ స్టోర్ల ద్వారా విక్రయాలు నిర్వహిస్తోంది. గతేడాది(2022–23) ఆదాయం 46 శాతం ఎగసి రూ. 498 కోట్లను అధిగమించింది. నికర లాభం 117 శాతం దూసుకెళ్లి రూ. 77.5 కోట్లను తాకింది. -
Karnataka assembly election 2023: ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.కోటి
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీకి రూ.కోటి, కళ్యాణ కర్ణాటక ప్రాంతాభివృద్ధికి రూ.5,000 కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శుక్రవారం కలబురిగి జిల్లాలోని జేవర్గీ సభలో హోరు వానలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘బళ్లారిలో రూ.5,000 కోట్లతో వస్త్ర పరిశ్రమను తెస్తాం. జిల్లాను ప్రపంచ జీన్స్ హబ్‌గా, జీన్స్ రాజధానిగా మారుస్తాం. 50 వేల ఉద్యోగాల భర్తీని పూర్తిచేస్తాం’ అని అన్నారు. ‘ప్రతీ పనికి కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు 40 శాతం కమిషన్ గుంజారు. ఈ ప్రభుత్వ దోపిడీతో బళ్లారి ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు’’ అని ఆరోపించారు. తాము 150 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. -
బంద్‌తో ఇబ్బందులే..
సాక్షి, ముంబై: ఉల్లాస్‌నగర్‌లో జీన్స్ వాష్ కార్ఖానాల బంద్ ప్రభావం జీన్స్ తయారీ పరశ్రమపై కూడా పడే అవకాశం కన్పిస్తోంది. జీన్స్ తయారీ సంస్థలో తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నారు. అందులోనూ తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారే అత్యధికం. బంద్ ఇలాగే కొనసాగితే దాని ప్రభావం తమపై పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొన్ని వేల మంది ఉపాధి లేక రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. జీన్స్ వాష్ కార్ఖానాలు వాడుతున్న రసాయనాలతో కాలుష్యం పెరిగిపోతోందని, వెంటనే వాటిని మూసివేయాలని కాలుష్య నియంత్రణ విభాగం జారీ చేసిన నోటీసులను నిరసిస్తూ ఉల్లాస్‌నగర్‌లోని సుమారు 450 జీన్స్ వాష్ కార్ఖానాలు గత పది రోజులకుపైగా బంద్ పాటిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ఉల్లాస్‌నగర్‌లోని కొందరు తెలుగువారితో ‘సాక్షి’ మాట్లాడింది. వారు తెలిపిన వివరాలు వారి మాటల్లోనే ... ఇలా అయితే జీన్స్ తయారీ ఆపేయాల్సిందే... - దాసరి వెంకటేశ్వర్రావు, జీన్స్ తయారీ పరిశ్రమ యజమాని జీన్స్ వాష్ కార్ఖానాల బంద్ ప్రభావం పరోక్షంగా జీన్స్ తయారీపై కూడా పడనుంది. మాది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం. 20 ఏళ్ల కిందట ఇక్కడికి ఉపాధి కోసం వచ్చాను. ఇక్కడే జీన్స్ కుట్టడం నేర్చుకున్నాను. ప్రస్తుతం రెండవ నంబర్ ఉల్లాస్‌నగర్‌లో జీన్స్ తయారీ కార్ఖానాను సొంతంగా పెట్టుకుని పలువురికి ఉపాధి కల్పిస్తున్నాను. మా వద్ద లేడీస్ జీన్స్ ఎక్కువగా తయారవుతాయి. ఈ జీన్స్‌ను కొన్ని రకాల రసాయనాల మిశ్రమంలో వాష్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జీన్స్ వాష్ కార్ఖానాల బంద్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మా వద్ద జీన్స్ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. బంద్ ఇలాగే కొనసాగితే మేం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. అదే జరిగితే వేలాదిమంది రోడ్డున పడాల్సి వస్తుంది. గతంలో రెండుసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. - కముజు శ్రీను, టైలర్ నాది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం. 24 ఏళ్లుగా ఉల్లాస్‌నగర్‌లో జీన్స్ పరిశ్రమలో ఉపాధి పొందుతున్నాను. ప్రస్తుతం టైలర్‌గా పనిచేస్తున్నాను. గతంలో కూడా రెండుసార్లు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పదేళ్ల కిందట ట్యాక్స్ వివాదం చెలరేగి సుమారు మూడు నెలలకు పైగా కార్ఖానాలు బంద్ ఉంచారు. దీంతో టైలర్లు రోడ్డున పడాల్సి వచ్చింది. తిరిగి 2005లో వచ్చిన వరదల కారణంగా చాలా రోజులపాటు పరిశ్రమ మూతపడింది. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం అంత దయనీయస్థితి లేకపోయినా బంద్ ఇలాగే కొనసాగితే మా పరిస్థితి తిరిగి దయనీయంగా మారే అవకాశముంది. ఇబ్బంది ఉండకపోవచ్చని భావిస్తున్నాను.. - అప్పారి శ్రీను, టైలర్ మాది తూర్పుగోదావరి జిల్లా కావలిపురం మండలం. బాల్యం నుంచి ఈ వృత్తిలోనే ఉన్నాను. ప్రస్తుతం టైలర్‌గా పనిచేస్తున్నాను. ఈ బంద్ ఇంకా కొనసాగితే ఇబ్బందులు ప్రారంభమవుతాయి. వేలాదిమంది నాలాంటి ఉద్యోగులు రోడ్డున పడటం ఖాయం. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందనే ఆశాభావంతో ఉన్నాం. అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.