breaking news
Jat category
-
‘యూపీ’ ఎన్నికలు: రెండు శాతమున్న ‘జాట్’లే శాసనకర్తలుగా..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర జనాభాలో జాట్ సమాజం వాటా కేవలం రెండు శాతం మాత్రమే అయినప్పటికీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని పలు నియోజకవర్గాల్లో ఆ వర్గం ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. అందుకే 2027 ఎన్నికలకు ముందు జాట్ ఓటర్లను ఆకర్షించడం అధికార ఎన్డీఏతో పాటు సమాజ్‌వాదీ పార్టీ–కాంగ్రెస్ కూటమికి కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.పశ్చిమ యూపీలో బలమైన పట్టుజాట్ సమాజానికి చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు సంప్రదాయంగా వ్యవసాయంపై ఆధారపడుతుంటారు. రాజకీయంగా వారు చాలాకాలంగా జాతీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)కి దగ్గరగా ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా జాట్ సమాజంలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. ఫలితంగా జాట్ ఓటర్లలో ఒక వర్గం బీజేపీ వైపు మళ్లింది. అయినప్పటికీ ఆర్ఎల్డీ ఇప్పటికీ ఆ సమాజంలో గణనీయమైన మద్దతును కొనసాగిస్తోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో దాదాపు 99 శాతం జాట్ జనాభా ఉంది. ఈ ప్రాంతంలో 136 అసెంబ్లీ, 27 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల విశ్లేషకుల అంచనా ప్రకారం 35 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో జాట్ ఓట్లు బలమైన ప్రభావం చూపనున్నాయి. దాదాపు 50 స్థానాల్లో ఎన్నికల పోటీలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది.2007–2012లో ఆర్ఎల్డీ ఆధిపత్యంజాట్ ఓటర్ల రాజకీయ వైఖరిలో గత రెండు దశాబ్దాల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎల్డీకి జాట్ ఓట్లలో 61 శాతం లభించగా, బీజేపీ+కు సుమారు 18 శాతం వచ్చాయి. బీఎస్పీకి 10 శాతం, ఎస్పీకి 8 శాతం, కాంగ్రెస్‌కు 2 శాతం జాట్ ఓట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ విజయం సాధించింది. 2012లో ఆర్ఎల్డీ తన జాట్ ఓటు ఆధిక్యాన్ని కొనసాగించినప్పటికీ వాటా 45 శాతానికి తగ్గింది. బీఎస్పీ 16 శాతం, కాంగ్రెస్ 11 శాతం, బీజేపీ 7 శాతం, ఎస్పీ 7 శాతం జాట్ ఓట్లు పొందాయి. ఈ ఎన్నికల్లో ఆర్ఎల్డీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన విషయం గమనార్హం. అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుంది.2017లో మారిన రాజకీయ గణితం2017 అసెంబ్లీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచాయి. 403 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 300కుపైగా సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో జాట్ ఓట్లలోనూ బీజేపీ గణనీయంగా చొచ్చుకుపోయింది. మరోవైపు ఆర్ఎల్డీ ప్రభావం బలహీనపడింది. ఆ పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలిచి, రాష్ట్రవ్యాప్తంగా 1.80 శాతం ఓట్లకే పరిమితమైంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 24 జిల్లాల్లో 126 స్థానాలకు గాను బీజేపీ 100 స్థానాలను గెలుచుకోవడం ఆ ప్రాంతంలో పార్టీ బలాన్ని స్పష్టం చేసింది.2022లో బీజేపీకి ఎదురుదెబ్బలు2022 ఎన్నికల్లోఆర్ఎల్డీ, ఎస్పీతో జతకట్టింది. వ్యవసాయ చట్టాల వ్యతిరేకత నేపథ్యంలో జాట్ సమాజంలో బీజేపీపై ఉన్న అసంతృప్తి తమ కూటమికి అనుకూలంగా మారుతుందని ఎస్పీ-ఆర్ఎల్డీ భావించింది. అయితే ఆశించిన స్థాయిలో అది జరగలేదు. పశ్చిమ యూపీలో బీజేపీ 85 స్థానాలు గెలుచుకోగా, ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి 41 స్థానాలు సాధించింది. అయినప్పటికీ జాట్ ప్రాబల్యం ఉన్న కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. షామ్లీ జిల్లాలోని మూడు స్థానాలన్నింటినీ, మీరట్‌లోని ఏడు స్థానాల్లో నాలుగింటిని, ముజఫర్‌నగర్‌లోని ఆరు స్థానాల్లో నాలుగింటిని బీజేపీ కోల్పోయింది. మురాదాబాద్‌లోని ఆరు స్థానాలన్నింటిలోనూ రాంపూర్, సంభల్ జిల్లాల్లో కలిపి నాలుగు స్థానాల్లో మూడింటిలోనూ ఓటమి ఎదురైంది. ఇదే ఎన్నికల్లో ఆర్ఎల్డీ ఎనిమిది స్థానాలు గెలుచుకుంది.2027 కోసం పార్టీల వ్యూహాలుపశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్ ఓట్ల ప్రాధాన్యాన్ని బీజేపీ నాయకత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో 2022 ఆగస్టులో జాట్ నేత భూపేంద్ర సింగ్ చౌధరీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. అయితే 2025 డిసెంబరులో జరిగిన మార్పుల్లో ఆయన స్థానంలో కుర్మీ సామాజిక వర్గానికి చెందిన పంకజ్ చౌధరీని నియమించారు. మరోవైపు జయంత్ చౌధరీ నాయకత్వంలోని ఆర్ఎల్డీ ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా ఉంది. జాట్ సమాజంలో తన మద్దతును మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ కూటమి బీజేపీకి ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకత్వ నిర్మాణం, టికెట్ల కేటాయింపులో జాట్లకు ప్రాతినిధ్యం పెంచే అంశాన్ని కూడా బీజేపీ పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. సంజీవ్ బలియాన్, సత్యపాల్ సింగ్ వంటి నేతలు జాట్ సమాజంలో బీజేపీ మద్దతును పెంచడంలో కీలకంగా మారవచ్చు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని చౌధరీ చరణ్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వడం కూడా జాట్ సమాజానికి బీజేపీ ఇచ్చిన రాజకీయ సంకేతంగా విశ్లేషిస్తుంటారు. ఇదిలా ఉండగా 2027 అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ వేగవంతం చేసింది.ఇదీ చదవండి: బిగ్‌బాస్: మేరీ కోమ్ వ్యాఖ్యలపై దుమారం.. టీమ్ క్షమాపణలు! -
వైద్య కోర్సుల్లో జాట్లకు రిజర్వేషన్‌పై డీయూకు నోటీస్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల ప్రవేశాల్లో జాట్ కేటగిరికి రిజర్వేషన్‌పై ప్రభుత్వానికి, ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)కి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీచేసింది. వర్సిటీలో ఇప్పటికే సీట్లు పొందిన నలుగురు ఓబీసీ విద్యార్థులు వేసిన వ్యాజ్యం మంగళవారం విచారణ కు వచ్చింది. 2014 విద్యా సంవత్సరానికిగాను డీయూలో వివిధ వైద్య కోర్సులకు సంబంధించి 229 డిగ్రీ, 29 డిప్లొమా సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో రిజ ర్వేషన్ ప్రకారం డిగ్రీలో 62, డిప్లొమాలో 8 సీట్లు ఓబీసీకి కేటాయించింది. కాగా, గత ఫిబ్రవరి 25వ తేదీన డీయూ మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించింది. ఇదిలా ఉండగా మార్చి 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం జాట్లను ఓబీసీలో చేరుస్తూ జీవో జారీ చేసింది. దీనిప్రకారం డీయూ జాట్ కేటగిరిని ఓబీసీలో చేర్చి తిరిగి మెరిట్‌లిస్ట్‌ను సవరించింది. దాంతో మొదట ప్రకటించిన మెరిట్‌లిస్ట్‌లో సీట్లు వచ్చిన నలుగురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. మొదటిసారి ప్రకటించిన మెరిట్‌లిస్ట్‌ను పక్కన బెట్టి జాట్లతో కలిపి తిరిగి మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించడం అన్యాయమని వారు వాదించారు. కాగా, దీనిపై తమ సమాధానాన్ని ఫైల్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, డీయూకు ఢిల్లీకోర్టు నోటీసులు జారీచేసింది.


