breaking news
Janagan district
-
చదువుపై ప్రేమను చంపుకోలేక..
రఘునాథపల్లి: పట్టుదలతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలనుకున్న ఆ విద్యార్థిని అర్ధంతరంగా తనువు చాలించింది. పేదరికం కారణంగా చదువు మానేయాలని తండ్రి ఆదేశించడంతో మస్తాపానికి గురైన ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పారునంది కరుణాకర్, సుశీల దంపతుల కుమార్తె ప్రియాంక (17) ఇంటర్మీడియట్ చదువుతోంది. కరుణాకర్ గ్రామంలోని ఓ రైతు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. కూతురును చదువు మానేయాలని తండ్రి సూచించగా తాను చదువుకుంటానని వారించింది. ఈ క్రమంలో కూతురును తండ్రి మందలించాడు. ఆ తర్వాత కరుణాకర్ తన కుమార్తెతో కలిసి పత్తి చేనులో కలుపు కుప్పలు తీసేందుకు వెళ్లారు. కొద్ది సేపటికి ఇంటికి వెళ్లి తల్లిని తీసుకొస్తానని కుమార్తెకు చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రియాంక అక్కడే ఉన్న పురుగుల మందు తాగింది. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు వచ్చి చూడగా ప్రియాంక అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆమెను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రంజిత్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
144 సెక్షన్ ఎవరి ప్రయోజనాల కోసం?
విద్యార్థి నాయకులపై అక్రమ కేసులా? జనగామ జిల్లా కోసం మూడు రోజలు పాటు ప్రత్యేక కార్యచరణ నేటి ఎమ్మెల్యే హరితహారం కార్యక్రమాన్ని బహిష్కరించాలి కిలోమీటరు బ్యానర్‌పై సంతకాల సేకరణ ప్రతి ఇంటిపై జనగామ జెండా ఎగురు వేయాలి జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి జనగామ : జనగామ జిల్లా కోసం ప్రజలు శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే, ఎవరి ప్రయోజనాల కోసం 144 సెక్షన్ విధించి నిర్భందం విధించారని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, పాలకుర్తి జేఏసీ కన్వీనర్ డాక్టర్ లక్ష్మినారాయణ, స్టేషన్ ఘనపూర్ కన్వీనర్ మేడ శ్రీనివాస్, జిల్లా సాధన సమితి కన్వీనర్ మంగళ్లపల్లి రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్ ప్రశ్నించారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బస్సు దహనం అవుతుండగా, ఫైర్ ఇంజిన్‌ను అడ్డుకున్న అధికార పార్టీ నాయకులపై లేని కేసులు ఉద్యమకారులపై బనాయించడం ప్రభుత్వ నిరంకుశ విధానాలను స్పష్టం చేస్తోందన్నారు. విద్యార్థి నాయకులపై అన్యాయంగా కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హెచ్చార్సీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనగామ డివిజన్లోని పలు మండల కేంద్రాలతో పాటు గ్రామ గ్రామాన 144 సెక్షన్ విధించడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని ఎంత ప్రయత్నం చేస్తే అంత పైకి ఎగిసి పడుతుందన్నారు. 144 సెక్షన్‌కు నిరసనగా సోమవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హరితహారం కార్యక్రమాన్ని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కోరారు. ఈ నెల 21న కిలోమీటరు పొడవైన తెల్లనిగుడ్డపై లక్ష సంతకాల సేకరణ చేసి, సీఎంకు పంపించనున్నట్లు చెప్పారు. 24వ తేదీన డివిజన్లోని ప్రతి ఇంటిపై జనగామ జెండాను ఎగుర వేసి తమ ఆకాంక్షను తెలుపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీద్, పిట్టల సత్యం, బెడిదె మైసయ్య, దుబ్బాక వీరస్వామి, గండి నాగరాజు ఉన్నారు.