breaking news
Jalamani scheme Drinking water
-
గ్రేటర్ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఏడాది తొలి వారంలోనే హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ఉచితంగా అందిస్తామన్నారు. ఇందుకు కావాల్సిన కార్యాచరణపైన మంత్రి కేటీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల తాగు నీటి వినియోగం 20 వేల లీటర్ల వరకు ఉచితంగా అందించాలన్నారు. ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ నెల బిల్లులో 20 వేల లీటర్ల వరకు ఛార్జ్ చేయొద్దని ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. -
వెక్కిళ్లొస్తే.. పరుగో పరుగు!
ఇది కళ్యాణదుర్గంలోని నార్త్ హైస్కూల్. రెండు గోడల మధ్యనున్న చిన్న సందులో ఏర్పాటు చేసిన కుళాయి వద్దకు విద్యార్థులు అతి కష్టం మీద చేరుకుని దాహం తీర్చుకుంటున్నారు. ఇక్కడ ఇదో సమస్య అయితే.. జిల్లాలోని చాలా పాఠశాలల్లో గుక్కెడు నీటికి చుక్కలు చూడాల్సి వస్తోంది. అనంతపురం ఓల్డ్‌సిటీ: విద్యార్థులకు గుక్కెడు మంచినీటిని కూడా అందించలేని ప్రభుత్వ తీరును తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. వర్షపు నీటిని ఒడిసి పడుతామని.. కాల్వలు తవ్వి బంజరు పొలాలను సస్యశ్యామలం చేస్తామని కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్న నాయకులు కూడా ఈ చిన్నారుల గొంతు తడిపే ప్రయత్నం చేయని దయనీయం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామనే ప్రగల్భాలు తప్పిస్తే.. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోతుండటం విమర్శలకు తావిస్తోంది. మధ్యాహ్న భోజనం చేసే సమయంలో వెక్కిళ్లు వస్తే.. మధ్యలోనే ఆపేసి నీళ్ల కోసం పరుగు తీస్తున్న ఘటనలు నిత్యకృత్యం. జిల్లాలో 2,654 ప్రాథమిక, 588 ప్రాథమికోన్నత, 610 ఉన్నత పాఠశాలలో ఉన్నాయి. వీటిలో 3,45,713 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇకపోతే 1,210 పాఠశాలల్లో అసలు నీటి వసతే లేకపోవడం చూస్తే విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లో విద్యను అభ్యసించాల్సి వస్తుందో అర్థమవుతోంది. బాలికల పాఠశాలల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా నీళ్లు లేక ఇప్పటికీ ఆరుబయటకు వెళ్తుండటం గమనార్హం. మధ్యాహ్న భోజనం చేశాక ప్లేట్లను కడగకుండా బ్యాగుల్లో పెట్టుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. 919 పాఠశాలల్లో ఉప్పునీరు చుక్క నీరు లేని పాఠశాలల దయనీయ పరిస్థితి అలా ఉంటే.. నీళ్లున్నా తాగేందుకు వీలుపడని పాఠశాలలు కూడా ఉన్నాయి. జిల్లాలోని 919 పాఠశాలల్లో కుళాయిలు ఉన్నా ఉప్పునీరు వస్తుండటంతో విద్యార్థులకు ఈ నీరు ఉపయోగపడటం లేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఇళ్ల నుంచి నీళ్ల బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను బయటకు పంపి బిందెలతో నీళ్లు తెప్పిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు విద్యార్థుల దాహం తీర్చే ప్రయత్నం చేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జలమణి తెలియదు ‘జలమణి’ పథకం తెలియదని ఎస్ఎస్ఏ పీఓ సుబ్రమణ్యం, డీఈఓ లక్ష్మినారాయణ, ఎస్ఎస్ఏ ఈఈ విజయప్రకాష్ తెలిపారు. 919 పాఠశాలల్లో నీటి వసతి కల్పించాలని కోరుతూ గ్రామీణ నీటి సరఫరా విభాగానికి నివేదికలు పంపినట్లు చెప్పారు. ఇంత వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి బడ్జెట్ విడుదల కాలేదు. ♦ రాప్తాడు నియోజకవర్గంలోని 102 పాఠశాలల్లో æనీటి సమస్య ఉంది. ఉన్నా ఉప్పునీరు కావడంతో తాగునీటికి రోజూ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఒకటి, రెండు పాఠశాలల్లో దాతలు నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసినా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. ♦ పెనుగొండలోని సెంట్రల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు ఫర్లాంగు దూరంలోని గుడిలోకి వెళ్లి దాహం తీర్చుకుంటున్నారు. 264 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో వెక్కిళ్లు వస్తే అంతే సంగతి. -
రూ.45.72 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘జలమణి’ పథకం కింద జిల్లాలో 254 పాఠశాలల్లో తాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పాఠశాలకు రూ.18 లక్షలను కేటాయించిన ప్రభుత్వం.. జిల్లాకు రూ.45.72 కోట్లను విడుదల చేసింది. జాతీయ గ్రామీణాభివృద్ధి, నీటి ప్రాజెక్టు (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) కింద తెలంగాణలో 4,005 స్కూళ్లలో జలమణి కింద మంచినీటిని అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. అంచనా వ్యయంలో 50శాతం నిధులను గ్రాంట్ రూపంలో కేంద్రప్రభుత్వం అందిస్తుంది. మిగతా సగం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ నిధులతో నిర్దేశిత పాఠశాలల్లో సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయనున్నారు.