breaking news
Jagananna Haritha Nagaralu
-
హరిత నగరాలకు సొంత మొక్కలు
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న హరిత నగరాలకు అవసరమైన మొక్కలను సొంతంగా అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మూడుచోట్ల నిర్వహిస్తున్న నర్సరీల్లో అవసరమైన మొక్కలను పెంచుతోంది. మొదటి విడతగా జూలై నెలలో 45 నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, గ్రీనింగ్ కార్పొరేషన్ సొంతంగా పనులు చేపట్టిన 11 యూఎల్బీల్లో మినహా, సొంతంగా పనులు చేపట్టిన మిగిలిన యూఎల్బీల్లో మొక్కల ధరల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. గ్రీనింగ్ కార్పొరేషన్ నిర్ణయించిన ధరలు గిట్టుబాటు కావంటూ.. నాలుగైదు పర్యాయాలు టెండర్లు పిలిచినా కొన్ని మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఐదోసారి ఇటీవల ఈ పట్టణాలకు మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో హరిత ప్రాజెక్టు చేపట్టినా అవసరమైన మొక్కలు ఒకే ధరకు లభించేలా, మార్కెట్ ధర కంటే తక్కువకే అందించేలా చర్యలు చేపట్టారు. అందుకోసం గ్రీనింగ్ కార్పొరేషన్ నర్సరీల నుంచే మొక్కలు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్రీకాళహస్తి, సింహాచలం, విజయవాడ (నున్న) ప్రాంతాల్లోని నర్సరీలను సిద్ధం చేశారు. హరిత నగరాల్లో మొత్తం 54 రకాల మొక్కల జాతులను ఎంపిక చేసి నాటుతున్నారు. మరో మూడు, నాలుగు నెలల్లో 78 యూఎల్బీల్లో చేపట్టనున్న జగనన్న హరిత నగరాల్లో వీటిని నాటనున్నారు. అధిక ధరలకు చెక్ పెట్టిన గ్రీనింగ్ కార్పొరేషన్ సాధారణంగా పట్టణాల్లో గ్రీనింగ్ పనులను ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు సొంతంగా చేపట్టేవి. మొక్కల ధరలు కూడా స్థానికంగానే నిర్ణయించేవారు. దీనివల్ల ఒక్కో యూఎల్బీలో మొక్కల ధరలో భారీ వ్యత్యాసం ఉండేది. అయితే, జూలైలో 45 నగరాల్లో హరిత కార్యక్రమాలు చేపట్టారు. అంతకు నెలరోజుల ముందే ఏపీ గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు నర్సరీ రైతుల నుంచి సీల్డ్ కవర్లలో మొక్కల ధరలను సేకరించారు. వాటిలో తక్కువగా ఉన్న ధరలను ప్రామాణికంగా తీసుకుని, మొక్కల రవాణాలో జరిగే నష్టానికి ఐదు శాతం ధర కలిపి కాంట్రాక్టర్‌కు లాభదాయకంగా ఉండేలాగా ధరలను నిర్ణయించారు. ఈ విధంగా మొత్తం 14 యూఎల్బీల్లో చేపట్టే పనులకు మొక్కల రేట్లు ఒకేలా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే, వీటిలో 11 యూఎల్బీల్లో పనులు ప్రగతిలో ఉండగా, ఎమ్మిగనూరు, బాపట్ల, పాలకొల్లు యూఎల్బీల్లో గ్రీనింగ్ పనులు చేపట్టలేదు. వీటికి నాలుగు దఫాలుగా టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోగా, స్థానిక అధికారులు సైతం చొరవ చూపలేదు. మిగిలిన 31 యూఎల్బీలు సొంతంగా టెండర్లు పిలిచి, వారు నిర్ణయించిన ధరకు మొక్కలు కొనుగోలు చేశారు. ఈ ధరలు గ్రీనింగ్ కార్పొరేషన్ నిర్ణయించిన ధరలకంటే అధికంగా ఉండడం గమనార్హం. ఇకపై అలాంటి ధరల వ్యత్యాసం, బయటి నుంచి మొక్కలు కొనుగోలు చేసే అవకాశం లేకుండా ఏపీ గ్రీనింగ్ కార్పొరేషన్ సొంతంగా హరిత నగరాలకు అవసరమైన మొక్కల పెంపకాన్ని చేపడుతోంది. రెండో విడత జగనన్న హరిత నగరాలకు అవసరమైన 54 రకాల మొక్కలను గ్రీనింగ్ కార్పొరేషన్ నర్సరీల నుంచే సరఫరా చేయాలని నిర్ణయించారు. -
ఏకరీతిన హరిత నగరాల ప్రధాన రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జగనన్న హరిత నగరాల కింద తొలి విడతలో ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో ప్రథాన రోడ్లను ఒకేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం విజయవాడ విమానాశ్రయ రోడ్డును నమూనాగా తీసుకోనున్నారు. ఈ మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారు. ఈ రహదారిపై ఎలాంటి మొక్కలు నాటుతారో మిగతా నగరాల్లోనూ ఒక ప్రధాన మార్గాన్ని అలాగే తయారు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ విభాగాలు నిర్ణయించాయి. నగర, పట్టణాల్లోని ప్రధాన మీడియన్స్‌లో అభివృద్ధి చేసే ఈ ప్లాంటేషన్ ద్వారా మొత్తం 1.50 లక్షల చ.మీ మేర పచ్చదనం అదనంగా అందుబాటులోకి వస్తుంది. ఇతర రాష్ట్రాలకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే గన్నవరం విమానాశ్రయం రోడ్డును అందంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ రోడ్డు విజయవాడ రామవరప్పాడు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 13.82 కిలోమీటర్లు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు కొంత కాలం పాటు కృత్రిమ అందాలు, రంగుల వెలుగుల్లో కనిపించింది. ఇకపై సహజమైన పూల మొక్కలు, పచ్చని చెట్లతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో పురపాలక, పట్టణాభివృద్ధి విభాగంపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఈ రోడ్డును రూ.5.02 కోట్లతో ప్రకృతి అందాన్నిచ్చే మొక్కలతో నింపేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటి దాకా జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఈ రోడ్డును తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చి, ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్‌కు అప్పగించారు. -
Live Blog: 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్