breaking news
J.. Prabhakar Rao
-
రక్తచరిత్ర
మచిలీపట్నం క్రైం : వ్యక్తిగత విభేదాలు.. వివాహేతర సంబంధాలు.. సరిహద్దు వివాదాలు.. ఆర్థిక లావాదేవీల్లో గొడవలు.. కారణాలు ఏమైనా పది రోజులుగా జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు జిల్లా వాసులను వణికిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల నిఘా కొరవడటం వల్లే వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అదుపుతప్పుతున్న శాంతిభద్రతలు! ప్రస్తుతం జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు శాఖ ఇటీవల ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నుంచి ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించి అందరి అభినందలు అందుకున్న జిల్లా పోలీసులు ఇటీవల తమ పట్టు సడలించారనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా లోపం వల్లే వరుసగా హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విభేదాలతోనే ఎక్కువ జిల్లాలో ఇటీవల జరిగిన హత్యలు, హత్యాయత్నాలు వ్యక్తిగత కారణాలు, వివాహేతర సంబంధాలకు సంబంధించినవే అధికం. పోలీసులకు ఫిర్యాదులు అందిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరిగితే అప్పుడు పోలీసుల వైఫల్యం అవుతుంది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు జరిగిన హత్యలకు సంబంధించిన కేసుల్లోని నేరస్తులను దాదాపు అరెస్ట్‌చేశాం. మిగిలిన ఒకటి, రెండు కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయాల్సి ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్కరినీ ఉపేక్షించం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. - జె.ప్రభాకరరావు, ఎస్పీ -
‘బెల్టు’ తీస్తాం
ఎన్నికల్లో మద్యం అక్రమ సరఫరా చేస్తే చర్యలు రౌడీషీట్లు కూడా తెరుస్తాం ఎస్పీ హెచ్చరిక మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో విడతల వారీగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని బెల్టు షాపులపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు మద్యాన్ని గ్రామాల్లో ఏరులుగా పారిస్తుండగా వాటిని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అందుకోసం ఎస్పీ జె.ప్రభాకరరావు జిల్లాలో ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు 80 మంది బెల్టుషాపుల నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బెల్టు దుకాణాల్లో మద్యం విక్రయాలకు పాల్పడుతున్న 80 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5,609 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా నాటుసారా, నల్లబెల్లాన్ని కాపుకాసి పట్టుకున్నారు. వీటితో పాటు అక్రమ మార్గంలో మద్యాన్ని తరలిస్తున్న ఆరు ఆటోలతో పాటు రెండు బైక్‌లను అదుపులోకి తీసుకున్నారు. మద్యం సరఫరా చేస్తే కేసులు తప్పవు : ఎస్పీ జిల్లాలో బెల్టుషాపులకు మద్యం సరఫరా చేసే బార్ యజమానులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ జె.ప్రభాకరరావు తెలిపారు. అక్రమ మార్గంలో మద్యం సరఫరా చేస్తే సంబంధిత యజమానులపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసులు కూడా తప్పవని స్పష్టం చేశారు. మద్యం సరఫరా విషయంలో ఒకటి, రెండు పర్యాయాలు పోలీసుల దృష్టిలో పడినవారిపై రౌడీషీట్లు తెరిచేందుకు వెనుకాడబోమని ఎస్పీ హెచ్చరించారు.