breaking news
ISMA
-
ఐఎస్ఎంఏ అధ్యక్షుడిగా మండవ ప్రభాకర్ రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) కొత్త అధ్యక్షుడిగా నూజివీడు సీడ్స్ (ఎన్ఎస్ఎల్), ఎన్ఎస్ఎల్ షుగర్స్ లిమిటెడ్ సంస్థల చైర్మన్ మండవ ప్రభాకర్ రావు ఎన్నికయ్యారు. ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలో జరిగిన 89వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ పేరును ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ)గా మార్చారు. సంస్థ ఉపాధ్యక్షుడిగా ధామ్‌పూర్ బయో ఆర్గానిక్స్ (డీబీవో) ఎండీ గౌతమ్ గోయల్‌ను ఎన్నుకున్నారు. దేశీయంగా జీవ ఇంధనాలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో దూరదృష్టితో తమ సంస్థ పేరులో బయో ఎనర్జీని కూడా చేర్చినట్లు ఐఎస్ఎంఏ తెలిపింది. దేశీయంగా చక్కెర పరిశ్రమ.. ఇంధన పరిశ్రమగా రూపాంతరం చెంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. -
చక్కెర ఉత్పత్తి 44 శాతం తగ్గింది...
న్యూఢిల్లీ: దేశంలో చక్కెర ఉత్పత్తి 2016-17 సీజన్ తొలి నెల అక్టోబర్‌లో 44% క్షీణతతో 1.04 లక్షల టన్నులకు పరిమితమరుుంది. చక్కెరను అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెరకు క్రషింగ్ ఆలస్యం కావడం ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపించినట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్(ఐఎస్ఎంఏ) పేర్కొంది. 2015-16 సీజన్ ఇదే నెలలో చక్కెర ఉత్పత్తి 1.87 లక్షల టన్నులుగా ఉందని తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో 65 మిల్లులు చెరకు క్రషింగ్‌ను ప్రారంభిస్తే.. ప్రస్తుత ఏడాది అదే నెలలో కేవలం 28 మిల్లులే చెరకు క్రషింగ్ కార్యకలాపాలను ప్రారంభించాయని వివరించింది. -
ధర కోసం షుగర్ గేమ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పడుతున్న చక్కెర ధరలకు అడ్డుకట్ట వేయడానికి చక్కెర పరిశ్రమ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి 50 శాతానికిపైగా తగ్గిపోయిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) ప్రకటించినప్పటికీ హోల్‌సేల్ మార్కెట్లో ధరల పతనం ఆగలేదు. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో చక్కెర ధరలు ఏకంగా ఐదు నెలల కనిష్టానికి చేరుకోవడంతో కంపెనీల వ్యూహానికి ఎదురుదెబ్బ తగలింది. ఉత్పత్తి తగ్గినా... దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు క్వింటాల్‌కు రూ.30 తగ్గడం గమనార్హం. ప్రస్తుతం మొదటి రకం (ఎం-30) రకం క్వింటాల్ ధర రూ.3,020-3,225 పలుకుతుంటే ఎస్-30 రకం రూ.3,000-3,200 పలుకుతోంది. అంతకుముందు ఇస్మా ఈ సంవత్సరం చెరుకు గానుగ ఆడటం ఆలస్యం కావడంతో చక్కెర ఉత్పత్తి 50 శాతం పడిపోయిందని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సీజన్లో డిసెంబర్ 15 నాటికి పంచదార ఉత్పత్తి 50 శాతం తగ్గి 24.24 లక్షల టన్నులు మాత్రమే నమోదైనట్లు ఇస్మా తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో 457 మిల్లులు పంచదారను ఉత్పత్తి చేస్తుండగా ఈ ఏడాది ఈ సంఖ్య 426కి పడిపోయింది. దేశంలో చెరకును అత్యధికంగా పండించే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లో వరుసగా 35 శాతం, 78 శాతం క్షీణించడమే ప్రధాన కారణంగా ఇస్మా పేర్కొంది. మన రాష్ట్రంలో కూడా చక్కెర ఉత్పత్తి 44 శాతం తగ్గి 0.95 లక్షల టన్నులుగా ఉన్నట్లు ఇస్మా పేర్కొంది. ఆలస్యమే తప్ప ఉత్పత్తి తగ్గదు చక్కెర మద్దతు ధరపై మిల్లలు రైతులకు మధ్య అవగాహన కుదరకపోవడం వలన ఆలస్యం అయ్యిందే తప్ప ఉత్పత్తి తగ్గదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది 241 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందన్న అంచనాపై ఈ ఆలస్యం ఎటువంటి ప్రభావం చూపదని కేంద్ర ఆహార మంత్రి కె.వి.థామస్ మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. గతంలో ఇస్మా ఈ సీజన్ మొత్తం మీద ప్రభుత్వ అంచనాల కంటే ఎక్కువగా 250 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీ ఆశలతో... అప్పుల ఊబిలో కూరుకుపోయిన చక్కెర మిల్లులను ఆదుకోవడానికి ఏర్పాటైన మంత్రివర్గ బృందం బుధవారం సమావేశం నేపథ్యంలో చక్కెర కంపెనీ షేర్లు మంగళవారం పరుగులు తీశాయి. రానా సుగర్స్, ధంపూర్ సుగర్ మిల్స్ షేర్లు 5 శాతం పెరగ్గా, బలరాంపూర్ చిని, ద్వారికేష్ సుగర్స్ మూడు శాతం చొప్పున పెరిగాయి. చక్కెర మిల్స్ బెయిల్ ఔట్ ప్యాకేజీ గురించి బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశం కానుంది. చక్కెర మిల్లులు రైతులకు చెల్లించాల్సిన బకాయిల విలువ దాదాపు రూ.7,200 కోట్లు ఉంది.