breaking news
ISKCON Founders
-
ISKCON Temple: ఇస్కాన్ అంటే ఏమిటి? ఈ ఆలయాల్లో రోజూ ఏం చేస్తారు?
న్యూఢిల్లీ: ఇటీవల బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ ఆలయంపై జరిగిన దాడి వార్త ప్రధాన శీర్షికల్లో నిలిచింది. అలాగే ఇస్కాన్‌కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపధ్యంలో చాలాచోట్ల ఇస్కాన్ దేవాలయానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఇస్కాన్‌ను ఎవరు నెలకొల్పారు? ఈ సంస్థ లక్ష్యమేమిటి?కృష్ణ భక్తికి ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ దేవాలయాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. దీనిని 1966లో శ్రీల ప్రభుపాద స్థాపించారు. ఆయన కోల్‌కతాలో జన్మించారు. తనకున్న అపార శ్రీకృష్ణ భక్తిని పరివ్యాప్తం చేస్తూ 1965లో హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించారు. భగవద్గీతతో పాటు వేద గ్రంథాలలోని ఆధ్యాత్మికతను, భక్తిని వ్యాప్తి చేయడమే హరే కృష్ణ ఉద్యమ లక్ష్యం. శ్రీల ప్రభుపాద ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ‘హరే కృష్ణ, హరే రామ్’ అంటూ శ్రీకృష్ణ భక్తిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికిపైగా ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి. వీటిలోని కొన్ని ఆలయాలు అక్కడి వాస్తుశిల్ప కళకు ప్రసిద్ధి చెందాయి. లండన్, బెర్లిన్, న్యూయార్క్‌లలో లెక్కకు మించిన కృష్ణ భక్తులు కనిపిస్తారు. వీరిలో చాలామంది క్రమం తప్పకుండా ఇస్కాన్‌ను సందర్శిస్తారు. ఇస్కాన్ దేవాలయాల్లో మనోహరమైన రాధాకృష్ణుల విగ్రహాలు కనిపిస్తాయి.ఇస్కాన్ ఆలయాల్లో ప్రతి రోజూ హరినామ సంకీర్తన జరుగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా ప్రసాదం అందజేస్తారు. ఇస్కాన్ దేవాలయాలలో శ్రీమద్ భాగవతం, భగవద్గీతలపై బోధనలు ఉంటాయి. ఇస్కాన్ ప్రధాన కార్యాలయం మాయాపూర్ (పశ్చిమ బెంగాల్)లో ఉంది. ఇక్కడి భక్తులు శ్రీ చైతన్య మహాప్రభు అందించిన సూత్రాలను పాటిస్తారు.ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
ఆకలి కడుపులకు అక్షయపాత్ర
ఒకేసారి 15 లక్షల మందికి ఉచితంగా భోజనాలు పెట్టాలంటే? అలా ప్రతి రోజూ చేయాలంటే? కచ్చితంగా వారి చేతిలో ఏ అక్షయపాత్రో ఉంటే తప్ప సాధ్యం కాదు అని అంటారా? కాని అది సాధ్యమేనని నిరూపించింది ఇస్కాన్ బెంగుళూరు శాఖ వారి ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్. ప్రతి రోజూ దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం వేళ నాణ్యమైన పోషకాహారాన్ని అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద అన్నదాన కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదుల వారు పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్ ఆలయంలో ఉన్నప్పుడు, వీధుల్లో చెత్తకుప్పలపై ఉన్న ఆహార వ్యర్థాలకోసం కుక్కలతో పాటు చిన్నపిల్లలు కూడా పోటీ పడటాన్ని గమనించారు. ఆనాడే దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు కనీసం 10 మైళ్ల దూరం వరకు ఎవరూ ఆకలితో అలమటించకూడదని నిర్ణయించుకున్నారు. 2000లో అక్షయపాత్ర ఫౌండేషన్ పేరిట తొలుత బెంగుళూరులో 1500 మంది పిల్లలకు భోజనాలు అందించారు. ఆపై ఈ కార్యక్రమం అంచెలంచెలుగా దేశం నలుమూలలకూ విస్తరించడం మొదలైంది. అలా చిరు ప్రయత్నంతో మొదలై నేడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్‌లతో పాటు మొత్తం 11రాష్ట్రాల్లో, 10550 స్కూళ్లలోని లక్షలాది విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అన్నం పెడుతోంది ఇస్కాన్. తమ వంతుగా... అక్షయపాత్ర కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన వంతు సాయం చేస్తూనే ఉంది. అలాగే టాటా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, టీసీఎస్‌లతో పాటు అనేక చిన్నాపెద్ద సంస్థలు తమ వంతు సాయం అందిస్తున్నాయి. ప్రభుత్వం చేయూత ప్రారంభించిన అనతి కాలంలోనే ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రతి రాష్ట్రంలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ప్రతి రాష్ట్రంలోనూ మధ్యాహ్న భోజన పథకాలు అమలులోకి వచ్చాయి. అలాగే ఇస్కాన్ చేస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం తనవంతు తోడ్పాటు అందిస్తోంది. ప్రతి భోజనానికి అయ్యే ఖర్చు రూ.8.50 అయితే ప్రభుత్వం అందులో రూ. 4.50 వరకు ఇస్తే, మిగిలిన రూ.4 ఫౌండేషన్ భరిస్తోంది. పోషకాహార విషయంలో రాజీపడలేదు ప్రత్యేకమైన యంత్రాల సాయంతో అన్నం, కూరలను వండి, వేడి తగ్గకుండా హాట్ బాక్స్‌లలో పెట్టి వ్యాన్లలో స్కూళ్లకు తరలిస్తారు. దాదాపు 30 వెరైటీ వంటకాలు తయారు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పటాన్చెరులో ఉన్న కిచెన్‌లో రోజూ దాదాపుగా లక్షమందికి సరిపడే ఆహారాన్ని తయారు చేస్తున్నారు. ఇందులో 65000 భోజనాలను స్కూళ్లకు, మిగిలినవి అంగన్ వాడీ కేంద్రాలకు తరలిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువమందికి... ప్రస్తుతం పటాన్చెరులో ఉన్న యంత్రాలు ఒకసారికి 100 కేజీల బియ్యాన్ని మాత్రమే ఉడికించగలవు. ఇందుకు 45 నిమిషాలు పడుతుంది. ‘‘మరికొద్ది రోజుల్లో హైదరాబాద్‌లోని కోకాపేట్లో ఏర్పాటు కానున్న మోడరన్ కిచెన్‌లోకి రానున్న సరికొత్త యంత్రం 800 కేజీల బియ్యాన్ని కేవలం 30 నిమిషాలలో ఉడికిస్తుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి భోజనాన్ని అందించే వీలుంటుంది. ఈ యంత్రాన్ని స్విస్‌నుంచి దిగుమతి చేస్తున్నాం’’ మరింతమందికి ఆహారం అందించనున్నామన్న సంతోషం కళ్లలో కదలాడుతుండగా చెప్పారు అక్షయపాత్ర ఫౌండేషన్ సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ సత్యగౌర చంద్రదాస స్వామి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వైజాగ్‌లో ఏర్పాటయిన కిచెన్‌లో రోజుకి 50వేల మందికి సరిపడ ఆహారాన్ని అక్షయపాత్ర అందిస్తోందని, అలాగే కాకినాడ, రాజమండ్రిలో కూడా త్వరలోనే కిచెన్లు ఏర్పాటు చేయనున్నారు. బడిపిల్లల కోసమే కాదు సామాన్యుడి ఆకలిని తీర్చడంలో కూడా అక్షయపాత్ర తన వంతు చేయూత అందిస్తోంది. సద్దిమూట మార్కెట్ యార్డ్‌లలో వ్యాపారం చేసే రైతులకు నాణ్యమైన భోజనాలు అందించే సదుద్దేశంతో అక్షయ పాత్ర ఫౌండేషన్ సిద్దిపేటలో మొదట ‘సద్దిమూట’ ప్రారంభించింది. అక్కడ విజయవంతం కావడంతో బోయిన్ పల్లి, గజ్వేల్‌లో కూడా ప్రారంభించారు. ప్రతి రోజూ దాదాపు పదికి పైగా హాస్పిటళ్లలో ఉన్న 3500 మంది రోగులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. - శ్రావణ్ జయ